వైరానికి రాం..రాం!
ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒక్కటయ్యాయి. కొన్నేళ్లుగా ఒకరికొకరు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసిపోయారు. వీరిద్దరి పేర్లలో మొదటి రెండక్షరాలను నిజం చేస్తూ.. తమ కలయికతో వర్గపోరుకు చరమగీతం పాడామనే సంకేతాన్ని పంపించారు.
శనివారం మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి టి.రాంమోహన్రెడ్డిల భేటీ పరిగిలో చర్చనీయాంశంగా మారింది. శనివారం పరిగిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అనంతరం కమతం రాంరెడ్డిని తమ ఇంటికి రావాలని రామ్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఆయన నేరుగా రాంమోహన్‌రెడ్డి ఇంటి వెళ్లారు. గత ఏడేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ వస్తున్న వీరు ఒక్కసారిగా కలిసిపోవటం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాకుండా నియోజకవర్గానికి చెందిన అన్ని పార్టీల నాయకుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఏ రోజూ రాంమోహన్‌రెడ్డి గడప తొక్కని రాంరెడ్డి.. ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు సైతం ఆయనను అనుసరించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నప్పటికీ.. టికెట్ ఎవరికి వచ్చినా ఇద్దరం కలిసీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మిగతా పార్టీలతో పోలిస్తే అధికంగా ఉన్నప్పటికీ సొంత పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరులాంటి సమస్యలతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యే పదవిని ఇతరులు ఎగరేసుకుపోయారు.
ఎన్నికల వేళ ఒక్కసారిగా ఇద్దరు ప్రధాన నేతలు కలవటంతో అటు కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇటు ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే వీరి చెలిమి ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందేనని గుసగుసలు మొదలయ్యాయి.