దళితులు టీడీపీ సొత్తుకాదు
ఉప్పలగుప్తం : తెలుగుదేశం పార్టీకి దళితులు కట్టుబడి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వ్యాఖ్యలు చేయడం సరికాదని, దళితులు టీడీపీ సొత్తు కాదని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీటీసీ కడిమి చిన్నవరాజు గురువారం ‘సాక్షి’తో అన్నారు.
దళితులు టీడీపీ వైపు ఉంటామని హామీ ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ చల్లపల్లిలో బుధవారం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ సామాజిక వర్గమూ ఏ ఒక్కపార్టీకీ కొమ్ముకాయదని, అలాగే రాజకీయ పార్టీలు కూడా సామాజిక అంశాలపట్ల సమతుల్యత పాటిస్తాయే తప్ప ఏ ఒక్కరి అండ కోరుకోవన్నారు. దళిత నాయకులు వివిధ పార్టీల్లో నాయకత్వం వహిస్తున్న వారేనని, అలాంటప్పుడు దళితులందరూ కమిటీగా ఏర్పడి హమీ ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందారని, వారు ఆయనకు నివాళులర్పించడం, ఆయన పేరున అన్నదానం చేయడాన్ని ఆక్షేపించడం సరికాదని చిన్నవరాజు అన్నారు. రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు దళితులు చందాలు చేసుకుని కార్యక్రమాలు చేశారంటే ఆయనపై వారికి ఉన్న అభిమానానికి అది అద్దంపడుతుందన్నారు. చాలా ఇళ్లలో దేవుని పటం పక్కన వైఎస్ బొమ్మ ఉందన్నారు. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిపై దళిత నాయకులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు.