kanakadurga Fly over
-
నేటితో తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు
సాక్షి, విజయవాడ: ఇక నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. 2.6 కి.మీ పొడవుతో వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది -
ఈ నెల 18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం
విజయవాడ : ఈ నెల 18న కనకదుర్గ వంతెన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా నిర్వహించనున్నారు.కరోనా నేపథ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొననున్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేపట్టనున్నారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో కలిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. కాగా తొలుత ఈనెల 4న కనకదుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. (చదవండి : కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా) -
కనకదుర్గ వారధిపై లీక్ అయిన ఆయిల్
తాడేపల్లిరూరల్: కృష్ణానది కనకదుర్గవారధిపై ఓ ట్యాంకర్లోనుంచి డీజిల్ ఆయిల్ లీక్ అవ్వడంతో వారధిపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న డీజిల్ టాంకర్లోనుంచి ఆయిల్ లీక్ అయింది. సుమారు 500 మీటర్ల పొడవునా ఆయిల్ లీక్ అయిన అనంతరం గమనించిన ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఆపి లీక్ అవుతున్న ఆయిల్‌ను నిలుపుదల చేశాడు. ఆయిల్ లీక్ అవ్వడంతో భారీ వాహనాలు సైతం జారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లి ట్రాఫిక్ సీఐ బ్రహ్మయ్య, తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి వెళ్లి, లీక్ అయి రోడ్డు మీద ఉన్న ఆయిల్పైన ఇసుక చల్లించి వాహనాలను వదిలారు. అయినప్పటికీ కార్లు, ద్విచక్రవాహనాలు జారుతూ ఉండడంతో తిరిగి మరలా ట్రాఫిక్ నిలిపివేసి మరోసారి ఇసుక చల్లించి దానిపైన సర్ఫ్ చల్లి విజయవాడ అగ్నిమాపక సిబ్బందిచేత నీళ్లు కొట్టించి శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేయడానికి గంటన్నర వ్యవధి పట్టడంతో కనకదుర్గవారధి 22వ కానా దగ్గర నుంచి కొలనుకొండ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు రోడ్డు శుభ్రం చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
పైవంతెన పరిస్థితేంటి?
తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. మూడున్నరేళ్లు పూర్తయినా ఓ కొలిక్కి రాలేదు. ప్రజల ట్రాఫిక్ కష్టాలకు ఇక ఉండవంటూ ప్రగల్బాలు పలికారు.. ట్రాఫికర్ మరింత పెరిగింది తప్ప..సమస్యకు పరిష్కారం లభించలేదు. విజయవాడకు మకుటాయమానంగా నిలుస్తుందనుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి నిధులు కూడా నిలిపివేయడంతో నిర్మాణం సందిగ్ధంలో పడింది. కాంట్రాక్టర్కూడా ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, విజయవాడ: కనకదుర్గా ఫ్లైఓ వర్ నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో అధికారులే కాదు.. కాంట్రాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగపడుతుందనుకున్న ఫ్లైఓవర్ సకాలంలో పూర్తికాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోవడమే మానేశారు. 70 శాతం పనులు మాత్రమే పూర్తి.... మూడున్నర ఏళ్లలో 70శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని.. ఇంకా 30 శాతం పనులు పూర్తికావాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు. ఫ్లైఓవర్లో వై పిల్లర్ల నిర్మాణం ఎంతో కీలకదశ. మొత్తం ఫ్లైఓవర్లో ఆరు వై పిల్లర్లు నిర్మాణం చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రెండు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి దర్గా వరకు వీటిని నిర్మించాల్సి ఉంది. మరో రెండు వై పిల్లర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రెండు ప్రారంభిస్తారు. నాలుగునెలల క్రితం ప్రారంభమైన రెండు పిల్లర్ల నిర్మాణం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. మిగిలిన రెండు పిల్లర్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలీదు. దీనికి తోడు ఎండలు మండిపోతూ ఉండటంతో వర్కర్లు పనులు వేగవంతంగా చేయలేకపోతున్నారు. బీహార్ నుంచి తీసుకొచ్చిన కూలీలు.. ఎండలకు తట్టుకోలేక అనేక మంది అనారోగ్యం పాలు కాగా.. మరికొంత మంది తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. వదుల్చుకునేందుకు కాంట్రాక్టర్ సిద్ధం..! ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టింగ్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరోవైపు ప్రాజెక్ట్ సంబంధించి బిల్లులు సక్రమంగా రాకపోవడం.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం తగిన విధంగా లేకపోవడంతో సదరు సంస్థ కాంట్రాక్ట్ నుంచి తప్పుకునేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కాంట్రాక్టర్ లాభాల కంటే చేతి చమురు వదిలిపోతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పడు కాంట్రాక్టర్ తప్పుకుంటే తిరిగి కొత్త కాంట్రాక్టర్‌ను వెదకడం, పనులు పూర్తి చేయడానికి మరో రెండేళ్లు పడుతుందని భావించిన అధికారులు ఏదో విధంగా ఈ కాంట్రాక్టర్ చేతే పని పూర్తి చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కాంట్రాక్టర్‌ను కొనసాగిస్తే కనీసం మరో ఏడాదికైనా పనులు పూర్తవుతాయని అంటున్నారు. -
ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్రం అసంతృప్తి
-
కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్రం అసంతృప్తి
సాక్షి, అమరావతి: విజయవాడలోని కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 ఏడాది మార్చి నాటికల్లా పూర్తి చేయాల్సిన నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ డైరెక్టర్ జనరల్ మనోజ్‌కుమార్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నెల 31న ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన కేంద్ర బృందం పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ఏపీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. కృష్ణా పుష్కరాల నాటికి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని ఎనిమిది నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. మొత్తం ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.282 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు కేవలం రూ.135 కోట్లను ఖర్చు చేయడాన్ని కేంద్రం లేఖలో ఎత్తి చూపింది.అయితే ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రత్యుత్తరమిచ్చింది. -
ప్రజల సమస్యలు పట్టని కలెక్టర్
ఉయ్యూరు (కంకిపాడు) : ‘జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మినా డబ్బులు రైతులు రాక అవస్థపడుతున్నారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, రేషన్ అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కలెక్టరుకు ఇవేమీ పట్టడం లేదు. ఎంత వరకూ ముఖ్యమంత్రి వద్ద పేరు తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పనులపైనే శ్రద్ధ చూపుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఆయన శనివారం కంకిపాడులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, మచిలీపట్నం, తరకటూరు, పెడన పరిసర ప్రాం తాల్లో చెరువులు పూర్తిగా ఎండిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ సజావుగా అందక లబ్ధిదారులు, విక్రయించిన ధాన్యం సొమ్ము అందక రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా, జిల్లాలో సమస్యలు పేరుకుపోయినా ఏ ఒక్క రోజూ కలెక్టరు ఈ అంశాలను సమీక్షించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పట్టిసీమ ప్రాజెక్టు, కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, పుష్కరాల నిర్మాణాల కాంట్రాక్టులపై పదేపదే సమీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పట్టిసీమ కాలువలకు జిల్లాలోని లారీలను, మట్టి తవ్వే యంత్రాలను బలవంతంగా తీసుకెళ్లి పనులు చేయించిన కలెక్టరు, జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఒక్క ట్యాంకరైనా తీసుకెళ్లి తాగునీటిని సరఫరా చేశారా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు కూడా సమస్యలపై స్పందిండం లేదని దుయ్యబట్టారు. తక్షణమే జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై సమీక్ష జరిపి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీలకు అన్యాయం జరగదనే భరోసా ఇవ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్, పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు, నాయకులు అల్లాం పాల్గొన్నారు.