ప్రజల సమస్యలు పట్టని కలెక్టర్
ఉయ్యూరు (కంకిపాడు) : ‘జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మినా డబ్బులు రైతులు రాక అవస్థపడుతున్నారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, రేషన్ అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కలెక్టరుకు ఇవేమీ పట్టడం లేదు. ఎంత వరకూ ముఖ్యమంత్రి వద్ద పేరు తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పనులపైనే శ్రద్ధ చూపుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఆయన శనివారం కంకిపాడులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, మచిలీపట్నం, తరకటూరు, పెడన పరిసర ప్రాం తాల్లో చెరువులు పూర్తిగా ఎండిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాక, ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ సజావుగా అందక లబ్ధిదారులు, విక్రయించిన ధాన్యం సొమ్ము అందక రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా, జిల్లాలో సమస్యలు పేరుకుపోయినా ఏ ఒక్క రోజూ కలెక్టరు ఈ అంశాలను సమీక్షించడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ పెద్దలకు ముడుపులు తెచ్చిపెట్టే పట్టిసీమ ప్రాజెక్టు, కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, పుష్కరాల నిర్మాణాల కాంట్రాక్టులపై పదేపదే సమీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పట్టిసీమ కాలువలకు జిల్లాలోని లారీలను, మట్టి తవ్వే యంత్రాలను బలవంతంగా తీసుకెళ్లి పనులు చేయించిన కలెక్టరు, జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఒక్క ట్యాంకరైనా తీసుకెళ్లి తాగునీటిని సరఫరా చేశారా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు కూడా సమస్యలపై స్పందిండం లేదని దుయ్యబట్టారు. తక్షణమే జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై సమీక్ష జరిపి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీలకు అన్యాయం జరగదనే భరోసా ఇవ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్, పట్టణ అధ్యక్షుడు జంపాన కొండలరావు, నాయకులు అల్లాం పాల్గొన్నారు.