విజయవాడలోని కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
సాక్షి, అమరావతి: విజయవాడలోని కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 ఏడాది మార్చి నాటికల్లా పూర్తి చేయాల్సిన నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ డైరెక్టర్ జనరల్ మనోజ్‌కుమార్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నెల 31న ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన కేంద్ర బృందం పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ఏపీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది.
కృష్ణా పుష్కరాల నాటికి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని ఎనిమిది నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. మొత్తం ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.282 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు కేవలం రూ.135 కోట్లను ఖర్చు చేయడాన్ని కేంద్రం లేఖలో ఎత్తి చూపింది.అయితే ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రత్యుత్తరమిచ్చింది.