‘సినీ’ వార్‌కు తాత్కాలిక తెర!
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ నిర్మాతలు, కార్మికుల మధ్య ప్రారంభమైన యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ప్రస్తుతమున్న వేతనాలనే మరో నాలుగు నెలల పాటు అందుకునేందుకు సినీ కార్మికుల సంఘం అంగీకరించడంతో నగరంలో మళ్లీ సినిమా షూటింగ్‌ల సందడి ప్రారంభమైంది. వివరాలను పరిశీలిస్తే....సినిమా రంగంలోని కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పెంచాలని కోరుతూ నిర్మాతలను సోమవారం సినీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది.
ఇప్పటికిప్పుడు కార్మికుల వేతనాలను పెంచేస్తే ఆయా సినిమాలకు నిర్ణయించిన బడ్జెట్ భారీగా పెరిగిపోతుందన్న నిర్మాతలు ఇందుకు ససేమిరా అన్నారు. దీంతో కార్మికులు కూడా షూటింగ్‌లకు వెళ్లకుండా బంద్‌కు దిగారు. దీంతో సోమవారం ఐరావత, రికీ తదితర చిత్రాల షూటింగ్‌లు నగరంలో ఆగిపోయాయి. సోమవారం సాయంత్రమే సినీ నిర్మాతల సంఘం, సినీ కార్మికుల సంఘం ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. దీంతో తిరిగి మంగళవారం సాయంత్రం ఇరు సంఘాల నేతలు కార్మికశాఖ అదనపు కమిషనర్ జింకలప్ప సమక్షంలో రెండవ సారి చర్చలు జరిపారు.
ఈ సమయంలో ప్రస్తుతం షూటింగ్‌లు జరుగుతున్న సినిమాల బడ్జెట్, సినిమా ప్రారంభానికి ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని, అందువల్ల షూటింగ్‌ల మధ్యలో కార్మికుల వేతనాలను పెంచలేమని నిర్మాతలు చెప్పారు. ఇక ప్రస్తుత వేతనాలతో తమ కుటుంబాలను పోషించడం కూడా అత్యంత క్లిష్టంగా మారిందని కార్మికులు తమ ఇబ్బందులను చెప్పుకొచ్చారు.
దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు నిర్మాతల సంఘం నాలుగు నెలల గడువు కోరింది. అప్పటి వరకు ప్రస్తుత వేతనాలనే కొనసాగించేందుకు అంగీకరించాల్సిందిగా సినీ కార్మికుల సంఘాన్ని కోరింది. ఇందుకు కార్మికుల సంఘం అంగీకారం తెలపడంతో ఈ ఇరు సంఘాల మధ్య వార్కి తాత్కాలిక తెర పడినట్లైంది.