సీఎంకు ఆ వాచీ ఎలా వచ్చిందో తేల్చండి
ఏసీబీకి తొలి ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన న్యాయవాదులు
బెంగళూరు: స్వపక్షంలోని నేతలతో పాటు విపక్షాలు, సాధారణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అవినీతిని అరికట్టడానికి అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెల 14న ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ)కు శనివారం మొదటి ఫిర్యాదు అందింది. అయితే ఏసీబీని ఏర్పాటు చేసి పదహేను రోజులైనా ఆ సంస్థకు కార్యాలయం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోకాయుక్తను మూసివేసే చర్యల్లో భాగంగా ఏసీబీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘సీఎం స్థానంలోని ముఖ్యమంత్రికి దాదాపు రూ.75 లక్షల విలువైన వాచ్ గిఫ్ట్‌గా వచ్చిన విషయమై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. దీని వెనక పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్యాప్తు చేయాల్సింది.’ అని లిఖిత పూర్వకంగా కోరుతూ న్యాయవాదులైన అమృతేష్, నటరేశ్ శర్మలు ఖనిజభవన్కు వచ్చారు.
ఈ విషయమై అమృతేష్ మీడియాతో మాట్లాడుతూ...‘ రాష్ట్ర హైకోర్టు కూడా ఏసీబీ అవసరం ఏమిటని తలంటింది. అసలు ఏసీబీ కార్యాలయం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బెంగళూరులోని ఖనిజభవన్లో ఏసీబీ కార్యాలయం ఉందని సామాన్య ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును అందజేయవచ్చునని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొణ్ణన్న సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అందువల్లే మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఏసీబీ కార్యాలయమే కాక ఏసీబీ కోసమంటూ ప్రభుత్వం నియమించిన అధికారి ఒక్కరూ లేరు. ఇలా అయితే అవినీ పై దర్యాప్తు ఎలా సాగుతుంది. లోకాయుక్త ఉన్నప్పుడు ఏసీబీ అవసరమేలేదు’ అని పేర్కొన్నారు. అనంతరంనృపతుంగ రోడ్డులోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేశారు.