ఆసరా కోసం ఆందోళన
నిజామాబాద్‌లో మొక్కుబడి
జాబితాలో పేరు లేదని ఆందోళన
నెట్వర్క్: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాలకు ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలుజిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో పింఛన్ల తంతు మొక్కుబడిగా సాగింది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో పంచాయతీ కార్యదర్శిని, సీనియర్ అసిస్టెంట్‌ను గదిలో నిర్బంధించారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో గ్రామపంచాయతీని ముట్టడించారు. భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ పంచాయతీలో మూడు గంటల పాటు నిర్బంధించారు. ఇదే మండలం ముస్తఫాపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన బాధితులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం ఎర్దండిలో పింఛన్‌దారుల నుంచి కాగితాల ఖర్చులకంటూ రూ.వంద చొప్పున వసూలు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సుమారు 1,000 మంది పింఛన్లు గల్లంతయ్యాయి. గతంలో పింఛన్లు పొందుతూ అన్ని అర్హతలున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
బాధితులంతా బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాలో మొత్తం 3,13,831 మంది దరఖాస్తు చేసుకోగా, 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, తొలిరోజున 1.92 ల క్షల మందికి పంపిణీ చేశామని కలెక్టర్ ఇలంబరితి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం రాచాపూ ర్ పంచాయతీ పరిధిలోని కొత్తపతి(కె) గ్రామస్తులు 30 మంది ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముందు బుధవారం ఆందోళన చేశారు. జాబితాలో పేర్లు లేకపోవడంతో కెరమెరి మండలం గోయగాం, సావర్‌ఖేడ్ గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశా రు. కాసిపేట మండలంలో బుధవారం చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. నెన్నెల మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరగలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలువురి పేర్లు జాబితాలో లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కుంచె కుమారస్వామి రెండ్రోజుల్లోగా పెన్షన్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లాలో ఆర్భాటంగా పంపిణీకి శ్రీకారం చుట్టినా.. 20 శాతం మంది కి కూడా పంపిణీ చేయలేదు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క వర్ని మండలంలో మాత్ర మే పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఐదు మండలాల్లో పంపిణీ వాయిదా పడింది. బోధన్‌లో పింఛన్ల పంపిణీ గురువారం నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలో పింఛన్ల కోసం సాయంత్రం వరకు నిరీక్షించారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ కాలేదు. చిట్యా ల, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు, ఏటూరునాగారం, తొర్రూరు, నర్సంపేటతో పాటు నగరంలో అధికారులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు నిరసన తెలిపారు. మంగపేటలో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాలకు చెందిన వారికి పింఛన్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి ప్రయత్నించారు.
జాబితాలో పేరు లేదని ఆత్మహత్య
గార్ల: పింఛన్ల జాబితాలో పేరు లేదని మనస్తాపంతో ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన దైదా సత్యనారాయణరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణరెడ్డి మూడేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. మంగళవారం కొత్త జాబితా ప్రకటించగా, అందులో సత్యనారాయణరెడ్డి పేరు లేదు. దీంతో మనోవేదనకు గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
పింఛన్ కోసం వెళ్తూ మృత్యుఒడికి..
సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పింఛన్ కోసం వెళ్తూ బండారి కాంతమ్మ(65) బుధవారం మృతి చెందింది. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన కాంతమ్మ పింఛన్ కోసం రెండోవార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న సైకిలిస్ట్ ఆమెను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన కాంతమ్మను స్థానికులుఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చనిపోయింది.