మినీ రణమేనా..?
♦ నేడు ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు
♦ వేమవరం హత్యలతో రగిలిపోతున్న కరణం బలరాం వర్గం
♦ గొట్టిపాటి వర్గంతో ఢీ అంటే ఢీ
♦ బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు
♦ మహానాడుకు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపు
♦ మరోసారి పగలు రగిలే అవకాశం
♦ మంత్రులు, జిల్లా అధ్యక్షుడికి సాధ్యం కాని సర్దుబాటు
♦ నేటి సభకు భారీ బందోబస్తు
♦ ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ ఎన్.సంజయ్
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే టీడీపీ మినీ మహానాడు సభ రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది. కరణం, గొట్టిపాటి వర్గాలు ఈ సమావేశానికి హాజరైతే మరోమారు గొడవలు తప్పవని ఆ పార్టీ వర్గాలే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలులో గురువారం జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని తన అనుచరులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. కరణం వర్గీయులు సైతం సమావేశానికి భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాలు సభకు హాజరైతే గొడవలు ఖాయం. వాటిని ఆపే శక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు, లేదా పార్టీ పరిశీలకులు, మంత్రులకు లేదు. ఇక పోలీసులు ఆది నుంచి చేష్టలుడిగి చూస్తుండటం తప్ప స్పందిస్తున్న దాఖలాల్లేవు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వేమవరం జంట హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యలకు కారణం గొట్టిపాటేనని బలరాం వర్గం ఆరోపణ. మంగళవారం ఒంగోలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక సమావేశంలో కరణం, గొట్టిపాటి వర్గాలు బాహాబాహీకి సిద్ధపడిన విషయం తెలిసిందే. గన్మేన్లతో వచ్చిన గొడవ ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు పరస్పర దాడులకు దిగే వరకు వచ్చింది. ఏకంగా కరణం, గొట్టిపాటిలు కలియబడ్డారు. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఘర్షణలో గొట్టిపాటి చొక్కా చినిగి కిందపడిపోయాడు. గొట్టిపాటి గన్‌మేన్ తోయడంతోనే గొడవ మొదలైందని కరణం బలరాం పేర్కొన్నారు. మొత్తంగా మంగళవారం జరిగిన సమావేశం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. గొట్టిపాటి కనపడగానే ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం దాడులకు తెగపడుతోంది. గొట్టిపాటి వర్గం సైతం ప్రతిదాడులకు సిద్ధమంటూ సవాల్ విసురుతోంది.
ఆధిపత్య పోరుకు వేదిక..
గురువారం జరిగే మినీ మహానాడు మరోమారు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గొడవ నేపథ్యంలో కరణం వర్గంతో పాటు గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున మినీ మహానాడుకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. చిన్నపాటి గొడవ జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని కరణం వర్గం సైతం సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి ఇరువర్గాల గొడవలను ఏ మాత్రం పట్టించుకోక జిల్లా పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తోంది. మంగళవారం నాటి ఘర్షణలోనూ ఇదే జరిగింది. గురువారం నాడు పరిస్థితి ఇలాగే ఉంటే మినీ మహానాడు ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు అధిపత్య పోరుకు వేదికగా మారుతుందనడంలో సందేహం లేదు. ఘర్షణ ఏ స్థాయికి దారి తీసిన ఆశ్చర్యపడనక్కర్లేదు.
గొడవలు పెంచింది.. చంద్రబాబే
కరణం వ్యతిరేకించినా.. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఇరువర్గాల గొడవల విషయం పట్టించుకోవడం లేదు. దీంతో కరణం, గొట్టిపాటి వర్గాల అధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారుల బదిలీలు మొదలుకొని పింఛన్లు, బ్యాంక్ రుణాలు, అభివృద్ధి పనుల విషయంలో ఇరువురు పోటీ పడుతూ వచ్చారు. పంతం నెగ్గించుకునేందుకు అధికారులపై ఒత్తిడులు పెంచారు. వీరి గొడవలతో అద్దంకి నియోజకవర్గంలో జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. జనచైతన్యయాత్రల ఊసే లేదు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం మూలనపడింది. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు జోక్యం చేసుకోలేదు. ఇద్దరిని ఒకే గూటికి చేర్చి తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావండి.. అన్న రీతిలో వ్యవహరించారు. ఇరువురు నేతలను కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. సర్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కరణం బలరాం సైతం పేర్కొనడం గమనార్హం. దీంతో అద్దంకి నియోజకవర్గంలో ఇరువురు నేతల గొడవలు మరింత పెరిగాయి. పదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. బాబు వైఖరి వేమవరం జంట హత్యలకు కారణమైందన్న విమర్శలున్నాయి.
సీఎం ఆదేశాలు అమలయ్యేనా..?
మంగళవారం ఒంగోలులో కరణం, గొట్టిపాటి వర్గాలు గొడవకు దిగడం, బుధవారం జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు రొటీన్‌గా పత్రికల్లో వార్తలొచ్చాయి. గొట్టిపాటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా.. ఆయన నిరాకరించినట్లు సమాచారం. గొడవల నేపథ్యంలో ఇరువర్గాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే బుధవారం ఉదయం పార్టీ అంతర్గత గొడవలపై ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నుండి పార్టీ సమావేశాల్లో ఏ ఒక్క నేత గొడవకు దిగినా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని కమిటీ నేతలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇది ఎంత వరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి.
మినీ మహానాడుకు భారీ బందోబస్తు
ఒంగోలు క్రైం : ఒంగోలులో గురువారం నిర్వహించనున్న టీడీపీ మినీ మహానాడుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ మినీ మహానాడును పురస్కరించుకొని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్ట్యా ఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం.త్రివిక్రమ వర్మ, ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యలు, తదనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య, వారి అనుచరుల మధ్య ఏ–1 కన్వెన్షన్ హాలు చోటు చేసుకున్న ఘర్షణలు, తోపులాటలు, దూషణలను పురస్కరించుకొని పూర్తి స్థాయి పోలీస్ నిఘాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుకోసం జిల్లాలోని అందరు డీఎస్పీలను ఇక్కడే మోహరింపచేయనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు పది మందికి పైగా డీఎస్పీలు 25 మందికి పైగా సీఐలు వందల సంఖ్యలో ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులను మోహరింజేస్తున్నారు. నిఘా విభాగాల ముందస్తు సమాచారం మేరకు మినీ మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు వేల మంది హాజరయ్యే సభకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యులకు పోలీస్ అధికారులు పాస్‌లు కూడా జారీచేసినట్టు సమాచారం. పాత గుంటూరు రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏర్పాట్లపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పోలీసులు సమీక్షించారు.