karimulla
-
శభాష్ కరిముల్లా
అమెచ్యూర్ టి-20 క్రికెట్ ఫెడరేషన్ జట్టుకు తెనాలి క్రీడాకారుడు ఎంపిక తెనాలి : అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికె ట్ ఫెడరేషన్ ఇండియా జట్టుకు తెనాలి క్రీడాకారుడు షేక్ కరిముల్లా మాలిక్ ఎంపికయ్యాడు. ఆసియన్ అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ ఫెడరేషన్ సహకారంతో నవంబర్‌లో ఇండో-బంగ్లాదేశ్ సిరీస్-2016 నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికె ట్ ఫెడరేషన్ ఇండియా జట్టుకు కరిముల్లా ఆడనున్నాడు. కరిముల్లా మాలిక్ పేదకుటుంబంలో జన్మించినా, చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ ప్రతిభ కనబరిచి 2014లో రాష్ట్ర ట్వంటీ-20 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అదే ఏడాది డిసెంబర్లో గోవాలో జరిగిన 31వ సౌత్‌జోన్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంజినీరింగ్ వదిలి.. క్రికెట్లోకి రీ ఎంట్రీ.. తలిదండ్రులు షేక్ ఖాశింబి, బాకర్ సూచన మేరకు కరిముల్లా మాలిక్ 2014 చివరలో క్రికెట్‌కు స్వస్తి చెప్పి గుంటూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. అయినా క్రికెట్‌ను వదల్లేకపోయాడు. ఓ ప్రైవేటు టోర్నీలో పాల్గొని ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆ కాలేజి జట్టుకు విజయాలను అందించాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. స్వస్థలం తెనాలిలోని ఎన్ఆర్కే కేఎస్ఆర్ గుప్త కాలేజీలో డిగ్రీలో చేరాడు. మాలిక్ ఆట గురించి తెలిసిన సీనియర్ తలతోటి సుధాకర్ తన సొంత డబ్బుతో క్రికెట్ కిట్ కొనిచ్చి ప్రాక్టీస్ చేయాలని ప్రోత్సహించారు అసోసియేషన్‌తో సంప్రదించి కొనసాగేలా చూశాడు. అప్పటి నుంచి మళ్లీ సాధన ఆరంభించిన కరిముల్లా మాలిక్ 2016 మార్చిలో నాగపూర్‌లో జరిగిన అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ చాలెంజర్ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆల్‌రౌండర్ అయిన మాలిక్ ఈ ట్రోఫీలో కేవలం 16 పరుగులిచ్చి, ఆరు వికెట్లు తీయటంతో భారత అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ ఫెడరేషన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ తర్వాత రంజీలో ఆడి, భారత జట్టుకు ఎంపిక కావాలనేది తన లక్ష్యమని కరిముల్లా మాలిక్ చెప్పాడు. -
మట్కా కింగ్ అరెస్ట్
- అదుపులో మరో 22 మంది నిందితులు -బెంగళూరు కేంద్రంగా వ్యవహారం అనంతపురం: పేదల బతుకులను బుగ్గి చేస్తున్న మట్కా మహమ్మారిపై అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు కొరడా ఝుళిపించారు. మట్కా వ్యవహారం, పోలీసుల సహకారంపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ స్పందించారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో రాయలసీమ మట్కా కింగ్‌లా వ్యవహరించే వ్యక్తితో పాటు 22 మందిని అరెస్ట్ చేశారు. కంపెనీ నిర్వాహకుడు రెండో రోడ్డు కరీముల్లా, ఈ కంపెనీకి అనుసంధాన కర్తగా ఉంటూ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీకి చెందిన చిగిచెర్ల చంద్రశేఖర్ అలియాస్ మంగలి చంద్ర, అతనికి అత్యంత సన్నిహితుడు రాణీనగర్‌కు చెందిన గోపీనాథ్‌రెడ్డి అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు నగరానికి చెందిన కొండారెడ్డి, ఖాదర్‌బాషా, మధుసూదన్, దేవరాజ్, అనిల్‌కుమార్, ఎస్.బాషా, అబ్దుల్‌కలాం, అక్కులప్ప, ముచ్చు వెంకటేష్, నన్నే సాహెబ్, బి.రమణ, మహబూబ్‌బాషా అలియాస్ చిచ్చు, డి. బాబు, వన్నూర్ సాహెబ్, మహబూబ్‌పీరా, పీరా, భాస్కర్, ఖాదర్, అంజన్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి రూ.13.60 లక్షల నగదు, 20 సెల్ఫోన్లు, మట్కా చీటీలు, పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ మంగళవారం డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీల్చి పిప్పి చేస్తున్న కరీముల్లా అరెస్టయిన వారిలో కరీముల్లా ముఖ్యుడు. ఈయన తండ్రి చాంద్‌బాషా గతంలో కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తూ గుత్తిలో మట్కా కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఆయన మృతి చెందాక భార్య మాబున్నీ అలియాస్ మున్ని తన కొడుకు కరీముల్లా సహకారంతో మట్కా వ్యవహారం కొనసాగిస్తోంది. గుత్తి నుంచి అనంతపురం మకాం మార్చారు. కరీముల్లా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూనే తల్లితో కలిసి మట్కా కంపెనీ నిర్వహిస్తున్నాడు. బీటర్ల నుంచి వచ్చిన పట్టీలు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా సబ్ బీటర్లకు అటు నుంచి సదరు కంపెనీకి చేరతాయి. అధిక మొత్తం కల్గిన నంబర్ల లావాదేవీలను ముంబాయిలోని శ్రీనివాస్ సేఠ్, శివప్ప కామాటి కంపెనీలకు వెళ్తాయి. ఇలా నిత్యం ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలు, బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తుండేవారు. న్యూరతన్, డేమిలాన్ తదితర మట్కా ఆటలద్వారా పట్టీలు కరీముల్లా కంపెనీకి వస్తాయి. రోజూ లక్షలాది రూపాయలు కలెక్షన్లు చేసేవారు. సబ్‌బీట్‌ల ద్వారా కరీముల్లా కంపెనీకి పట్టీలు బీటర్ల ద్వారా రాయించిన మట్కా వివరాలను సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి చేరుతుంటాయి. అనంతపురానికి చెందిన మంగలి చంద్ర, గుంతకల్లు మోహన్, కర్నూలు రాజు, బాషా, రామ్మోహన్, దౌలా, నంద్యాల స్టాలిన్, బాబు, శీను, పాణ్యం సుబ్బు, ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచయ్య, మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభాకర్, నాగర్‌కర్నూలు ప్రసాద్, బళ్లారికి మరికొందరి సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా పట్టీలు చేరుతుంటాయి. బెంగళూరు కేంద్రంగా... కరీముల్లా తర్వాత అతిముఖ్యమైన వ్యక్తి మంగలి చంద్ర. పిల్లిగుండ్లకాలనీలో నివాసం ఉంటాడు. అనంతపురంలో తరచూ పోలీసుల దాడులు పెరగడంతో బెంగళూరు మకాం మార్చాడు. అక్కడి నుంచే మట్కా నిర్వహిస్తున్నాడు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి మట్కా పట్టీలు ఫోన్లలో తీసుకుంటాడు. డబ్బు వ్యవహారమంతా బ్యాంకుల ద్వారానే జరుగుతుంది. -
పొన్నూరు కిడ్నాప్ కథ సుఖాంతం
గుంటూరు: రెండు రోజు కిందట జిల్లాలో సంచ లనం సృష్టించిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. జిల్లాలోని పొన్నూరుకు చెందిన తాపీమేస్త్రీ ఇబ్రహీం కుమారుడు కరీముల్లా(5)ను గుర్తుతెలియని అగంతకులు రెండురోజుల కిందట కిడ్నాప్‌కు చేశారు. బాలుడిని వదిలేయాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ఇబ్రహీం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. కిడ్నాపర్ల జాడ కనిపెట్టారు. కిడ్నాపర్ ప్రకాశం జిల్లా నాగుప్పలపాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. కిడ్నాపరే బాలుడ్ని వదిలేసి పారిపోయాడు. పైగా బాలుడి జేబులో అతడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లురాసిపెట్టాడు. రోదిస్తున్న బాలుడ్ని గుర్తించిన స్థానికులు అతడివద్ద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో కరీముల్లాను ఇంటికి తెచ్చుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు క్షేమంగా ఇంటికి చేరినందుకు సంతోషించారు. కాగా, పని ఇప్పించమంటూ గతంలో ఇబ్రహీం వద్దకు వచ్చిన సతీష్ అలియాస్ ఏసుపాదం(32) అనే వ్యక్తే బాలుడ్ని కిడ్నాప్ చేశాడని, ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.