శభాష్ కరిముల్లా | Karimulla selected t20 cricket federation team | Sakshi
Sakshi News home page

శభాష్ కరిముల్లా

Published Sun, Sep 25 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

Karimulla selected t20 cricket federation team

అమెచ్యూర్ టి-20 క్రికెట్ ఫెడరేషన్ జట్టుకు తెనాలి క్రీడాకారుడు ఎంపిక
 
తెనాలి : అమెచ్యూర్  ట్వంటీ-20 క్రికె ట్ ఫెడరేషన్ ఇండియా జట్టుకు తెనాలి క్రీడాకారుడు షేక్ కరిముల్లా మాలిక్ ఎంపికయ్యాడు. ఆసియన్ అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ ఫెడరేషన్ సహకారంతో నవంబర్‌లో ఇండో-బంగ్లాదేశ్ సిరీస్-2016 నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో అమెచ్యూర్  ట్వంటీ-20 క్రికె ట్ ఫెడరేషన్ ఇండియా జట్టుకు కరిముల్లా ఆడనున్నాడు.
 
 కరిముల్లా మాలిక్ పేదకుటుంబంలో జన్మించినా, చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ ప్రతిభ కనబరిచి 2014లో రాష్ట్ర ట్వంటీ-20 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అదే ఏడాది డిసెంబర్‌లో గోవాలో జరిగిన 31వ సౌత్‌జోన్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
 
 ఇంజినీరింగ్ వదిలి.. క్రికెట్‌లోకి రీ ఎంట్రీ..
 తలిదండ్రులు షేక్ ఖాశింబి, బాకర్ సూచన మేరకు కరిముల్లా మాలిక్ 2014 చివరలో క్రికెట్‌కు స్వస్తి చెప్పి గుంటూరులోని వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. అయినా క్రికెట్‌ను వదల్లేకపోయాడు. ఓ ప్రైవేటు టోర్నీలో పాల్గొని ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆ కాలేజి జట్టుకు విజయాలను అందించాడు.
 
 ఆ తర్వాత ఇంజినీరింగ్ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. స్వస్థలం తెనాలిలోని ఎన్‌ఆర్‌కే కేఎస్‌ఆర్ గుప్త కాలేజీలో డిగ్రీలో చేరాడు. మాలిక్ ఆట గురించి తెలిసిన సీనియర్ తలతోటి సుధాకర్ తన సొంత డబ్బుతో క్రికెట్ కిట్  కొనిచ్చి ప్రాక్టీస్ చేయాలని ప్రోత్సహించారు అసోసియేషన్‌తో సంప్రదించి కొనసాగేలా చూశాడు.
 
 అప్పటి నుంచి మళ్లీ సాధన ఆరంభించిన కరిముల్లా మాలిక్ 2016 మార్చిలో నాగపూర్‌లో జరిగిన అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ చాలెంజర్ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆల్‌రౌండర్ అయిన మాలిక్ ఈ ట్రోఫీలో కేవలం 16 పరుగులిచ్చి, ఆరు వికెట్లు తీయటంతో భారత అమెచ్యూర్ ట్వంటీ-20 క్రికెట్ ఫెడరేషన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ తర్వాత రంజీలో ఆడి, భారత జట్టుకు ఎంపిక కావాలనేది తన లక్ష్యమని కరిముల్లా మాలిక్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement