మట్కా కింగ్ అరెస్ట్ | 22 matka beaters attested in ananthpur district | Sakshi
Sakshi News home page

మట్కా కింగ్ అరెస్ట్

Published Tue, Apr 19 2016 2:13 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

22 matka beaters attested in ananthpur district

- అదుపులో మరో 22 మంది నిందితులు
-బెంగళూరు కేంద్రంగా వ్యవహారం


అనంతపురం: పేదల బతుకులను బుగ్గి చేస్తున్న మట్కా మహమ్మారిపై అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు కొరడా ఝుళిపించారు. మట్కా వ్యవహారం, పోలీసుల సహకారంపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ స్పందించారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో రాయలసీమ మట్కా కింగ్‌లా వ్యవహరించే వ్యక్తితో పాటు 22 మందిని అరెస్ట్ చేశారు. కంపెనీ నిర్వాహకుడు రెండో రోడ్డు కరీముల్లా, ఈ కంపెనీకి అనుసంధాన కర్తగా ఉంటూ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీకి చెందిన చిగిచెర్ల చంద్రశేఖర్ అలియాస్ మంగలి చంద్ర, అతనికి అత్యంత సన్నిహితుడు రాణీనగర్‌కు చెందిన గోపీనాథ్‌రెడ్డి అరెస్టయిన వారిలో ఉన్నారు.

వీరితో పాటు నగరానికి చెందిన కొండారెడ్డి, ఖాదర్‌బాషా, మధుసూదన్, దేవరాజ్, అనిల్‌కుమార్, ఎస్.బాషా, అబ్దుల్‌కలాం, అక్కులప్ప, ముచ్చు వెంకటేష్, నన్నే సాహెబ్, బి.రమణ, మహబూబ్‌బాషా అలియాస్ చిచ్చు, డి. బాబు, వన్నూర్ సాహెబ్, మహబూబ్‌పీరా, పీరా, భాస్కర్, ఖాదర్, అంజన్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి రూ.13.60 లక్షల నగదు, 20 సెల్‌ఫోన్లు, మట్కా చీటీలు, పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ మంగళవారం డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

పీల్చి పిప్పి చేస్తున్న కరీముల్లా
అరెస్టయిన వారిలో కరీముల్లా ముఖ్యుడు. ఈయన తండ్రి చాంద్‌బాషా గతంలో కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తూ గుత్తిలో మట్కా కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఆయన మృతి చెందాక భార్య మాబున్నీ అలియాస్ మున్ని తన కొడుకు కరీముల్లా సహకారంతో మట్కా వ్యవహారం కొనసాగిస్తోంది. గుత్తి నుంచి అనంతపురం మకాం మార్చారు. కరీముల్లా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూనే తల్లితో కలిసి మట్కా కంపెనీ  నిర్వహిస్తున్నాడు. బీటర్ల నుంచి వచ్చిన పట్టీలు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా సబ్ బీటర్లకు అటు నుంచి సదరు కంపెనీకి చేరతాయి. అధిక మొత్తం కల్గిన నంబర్ల లావాదేవీలను ముంబాయిలోని శ్రీనివాస్ సేఠ్, శివప్ప కామాటి కంపెనీలకు వెళ్తాయి. ఇలా నిత్యం ఫోన్‌ల ద్వారా మట్కా కార్యకలాపాలు, బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తుండేవారు. న్యూరతన్, డేమిలాన్ తదితర మట్కా ఆటలద్వారా పట్టీలు కరీముల్లా కంపెనీకి వస్తాయి. రోజూ లక్షలాది రూపాయలు కలెక్షన్లు చేసేవారు.

సబ్‌బీట్‌ల ద్వారా కరీముల్లా కంపెనీకి పట్టీలు
బీటర్ల ద్వారా రాయించిన మట్కా వివరాలను సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి చేరుతుంటాయి. అనంతపురానికి చెందిన మంగలి చంద్ర, గుంతకల్లు మోహన్, కర్నూలు రాజు, బాషా, రామ్మోహన్, దౌలా, నంద్యాల స్టాలిన్, బాబు, శీను, పాణ్యం సుబ్బు, ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచయ్య, మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభాకర్, నాగర్‌కర్నూలు ప్రసాద్, బళ్లారికి మరికొందరి సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా పట్టీలు చేరుతుంటాయి.

బెంగళూరు కేంద్రంగా...
కరీముల్లా తర్వాత అతిముఖ్యమైన వ్యక్తి మంగలి చంద్ర. పిల్లిగుండ్లకాలనీలో నివాసం ఉంటాడు. అనంతపురంలో తరచూ పోలీసుల దాడులు పెరగడంతో బెంగళూరు మకాం మార్చాడు. అక్కడి నుంచే మట్కా నిర్వహిస్తున్నాడు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి మట్కా పట్టీలు ఫోన్లలో తీసుకుంటాడు. డబ్బు వ్యవహారమంతా బ్యాంకుల ద్వారానే జరుగుతుంది.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement