అనంతపురం సెంట్రల్ : అతనో కానిస్టేబుల్.. ట్రాక్ రికార్డు మొత్తం తిరగేస్తే అవినీతి అరోపణలే ఎక్కువ. తాజాగా జిల్లా కేంద్రంలోని పాతూరులో మట్కా నిర్వహణలో అతనే కీలకంగా మారినట్లు బలమైన ఆరోపణలున్నాయి. స్టేషన్ ఉన్నతాధికారుల అండతోమట్కాబీటర్ల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...
బీటర్ల పీచమణిచిన హమీద్‌ఖాన్
అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ తీరు తీవ్ర దూమారం రేపుతోంది. ప్రస్తుతం స్టేషన్‌లో అంతా తానై వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా మట్కా నిర్వహణకు సంబంధించి మొత్తం వ్యవహారాలు అతనే చూసుకుంటున్నట్లు సమాచారం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20కు పైగా మట్కా కేంద్రాలు నడుస్తున్నాయి. ఎస్‌ఐ హమీద్‌ఖాన్ హయాంలో మట్కా నిర్వాహకులు తమ దుకాణాలు కట్టిపెట్టేశారు. దాదాపు 30 మందికి పైగా మట్కా బీటర్లు, నిర్వాహకులను అప్పట్లో ఆయన అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షలకు పైగా రికవరీ చేశారు. హమీద్‌ఖాన్ దాడులకు భయపడి చాలా మంది బీటర్లు నగరాన్ని వదిలి వెళ్లారు.
ఆరు నెలలుగా ఊపందుకున్న మట్కా
ఆరు నెలలుగా అనంతపురం పాతూరులో మట్కా మళ్లీ జీవం పోసుకుంది. మట్కా నిర్వాహకులు, బీటర్ల సంఖ్య అతి కొద్ది కాలంలోనే భారీగా పెరిగింది. రూ.కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్లు, నిర్వాహకులు ప్రస్తుతం కొంతమంది పోలీసు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని తమ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. స్టేషన్‌లో అతను చెప్పిందే వేదం అన్నట్లుగా నడుస్తోంది.
ట్రాక్ రికార్డు అంతాఅవినీతి ఆరోపణలే
సదరు కానిస్టేబుల్ ట్రాక్ట్ రికార్డు పరిశీలిస్తే మొత్తం అవినీతి ఆరోపణలే వినిపిస్తాయి. కదిరిలో పనిచేసే సమయంలో ఎర్రచందనం దొంగలతో కుమ్మక్కయాడనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా ఈ విషయం తేలడంతో అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం రాప్తాడు మండలంలోని కళాకారుల కాలనీలో ఓ వేశ్య గృహం నడిపించడంలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. దీనిపై అప్పట్లో కేసు నమోదు చేస్తే యావత్ పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం నగరంలోని వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో మట్కా బీటర్లతో నిరంతరం టచ్‌లో ఉంటూ అక్రమార్జనకు గేట్లు ఎత్తాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి మట్కా బీటర్లను అరెస్ట్ చేసి రూ. 60 వేలకు పైగా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రికవరీ చూపింది కేవలం రూ. 11 వేలు మాత్రమే. ఈ కుంభకోణంలో సదరు కానిస్టేబులుకు మరో సహచర ఉద్యోగితో పాటు, ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు విమర్శలున్నాయి. చేతుల్లో కాసులు గలగలామంటుండడంతో నిరంతరం బార్‌లు, రెస్టారెంట్లలో వారు గడుపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో మట్కా నిర్వహణ వెనుక దాగి ఉన్న కుంభకోణంపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు దోషులు ఎవరనేది వెలుగు చూసే అవకాశముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment