కొండ చిలువతో పోరాడిన బాలుడు
బెంగళూరు(బనశంకరి): మింగబోయిన కొండచిలువతో వీరోచితంగా పోరాడి ఓ బాలుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాళ గ్రామానికి చెందిన 11 ఏళ్ల వైశాఖ్ ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి కాలినడకన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పొదల్లో నుంచి 11 అడుగుల కొండచిలువ వచ్చి బాలుణ్ని పెనవేసుకొని మింగేందుకు యత్నించింది.
బాలుడు ధైర్యంగా పక్కనే ఉన్న రాయి తీసుకొని కొండచిలువ నోటిభాగంలో బలంగా బాది గాయపరిచాడు. దీంతో కొండచిలువ పట్టు సడలించడంతో ప్రాణాలు దక్కించుకొని ఇంటికి చేరాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాయపడిన బాలుణ్ని ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.