karunasri
-
విరి వాణి
‘‘నేనొక పూలమొక్క కడ నిల్చి..’’ అని కరుణశ్రీ పుష్ప విలాపాన్ని ఊహించి, అనుభూతి చెందితే.. ఈ ‘కరుణ’మ్మ.. పుష్ప ‘విలాసం’ కోసం పీహెచ్‌డీనే చేసింది. పూల పరిశ్రమకు ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తోంది. ‘చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫ్లోరల్ కల్చర్ – ఏ స్టడీ ఆన్ ఫ్లోరిస్ట్స్ ఆఫ్ హైదరాబాద్’... ఇది కరుణాఏకాంబర్ పూలమీద చేసిన పరిశోధన, పూలతో మమేకమైన మహిళల మీద పరిశోధన, వారి జీవితాల మీద సాగిన అధ్యయనం. పూలతో మనిషికి ఉండే బంధం అనంతమైనది. పండుగ, పర్వం, సంతోషం, దుఃఖం... సందర్భం ఏదైనా పువ్వుతోనే మొదలవుతుంది, పూలతోనే పూర్తవుతుంది. మనదేశంలో మట్టికి ఔన్నత్యం ఉంది. ఇక్కడ మొలిచిన ప్రతి చెట్టూ ఔషధాల మూలరూపమే. ప్రతి పువ్వూ సుగుణాల స్వరూపమే. ప్రతి వేడుకలోనూ పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి పూలకే ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన తెలంగాణ సంస్కృతి మూలాలను ఔపోసన పట్టారు డాక్టర్ కరుణా ఏకాంబర్. మనిషి జీవితంలో పూల ప్రాధాన్యంతోపాటు అలంకరణలో వస్తున్న మార్పులు, కొత్తగా వచ్చి చేరుతున్న పూల రకాల గురించి దండకట్టారు. మొక్క నాటి, పాదు చేసి, నీరు పోసి పూలు పూయించే వారి శ్రమ నుంచి వాటిని కోసి దండకట్టి మార్కెట్లో సిద్ధం చేసి ఉపాధి పొందే మహిళల వరకు ప్రతి ఒక్కరి జీవితాలనూ చదివారామె. వీళ్లంతా తెరవెనుక పని చేసే శ్రమ జీవులు. ఇక మోడరన్ మార్కెట్లో పూలతో కెరీర్‌ను అల్లుకున్న ఫ్లోరిస్ట్లను పరిశీలించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... మట్టిలో మొలిచిన మొక్క నుంచి మొగ్గ తొడిగి రెక్కలు విచ్చుకున్నప్పటి నుంచి... ఆ పువ్వు ముఖం వేళ్లాడేసుకుని తిరిగి నేల ఒడిని చేరే వరకు కొనసాగే పువ్వు ప్రయాణమంతటినీ అక్షరబద్ధం చేశారు డాక్టర్ కరుణ. ఈ ప్రయాణంలో ఎంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారో వివరించారు. మరెంత మంది ఈ పూలతో సంతోషాలను పంచుకుంటున్నారో... ఆ వివరాలను తన పరిశోధన గ్రంథంలో పూసగుచ్చారు డాక్టర్ కరుణ. పూల పుస్తకం ‘‘నా చిన్నప్పుడు నేను చూస్తూ పెరిగిన మాలతీలతలు, రేరాణి, గన్నేరు, సంపెంగ, పారిజాతం వంటి అనేక రకాల∙పూలు ఇప్పుడు ఏ ఫంక్షన్లోనూ కనిపించడం లేదు. మార్కెట్లో కొత్త రకాల పూలు చాలా వస్తున్నాయి. మన వాళ్లకు పాశ్చాత్యం మీద క్రేజ్ ఎక్కువ. చల్లని దేశాల్లో పూచే పూల వాడకం పెరిగింది. మార్కెట్లో ఏ పూలయితే బాగా అమ్ముడవుతాయో, ఆ పూల మొక్కలను పెంచితేనే పూలరైతుకి గిట్టుబాటవుతుంది. దాంతో మన దేశీయ పూలలో చాలా రకాలు కనుమరుగవుతున్నాయి. నా పరిశోధనలో భాగంగా వాటి కోసం అన్వేషించాను. ఒకచోట గ్రంథస్థం చేస్తేనయినా రాబోయే తరం తెలుసుకోవడానికి ఒక ఆధారం ఉంటుందనిపించింది. అందుకే మన కల్చర్‌లో దేవుళ్ల పూజల కోసం ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తారనే వివరాలను కూడా పరిశోధన గ్రంథంలో పొందుపరిచాను. సువాసనల పరిశ్రమ పూలు అలంకరణ కోసమో, ఆడంబర ప్రదర్శన కోసమో మాత్రమే కాదు. ఇది ఉపాధినిచ్చే విస్తారమైన పరిశ్రమ. ఈ పరిశ్రమను వ్యవస్థీకృతం చేయాలనేది నా కోరిక. ఇంట్లో ఉండి భర్త మార్కెట్ నుంచి తెచ్చిన పూలను దండలు కట్టే మహిళలు ఈ రంగంలో సైలెంట్ ప్లేయర్స్. ఇప్పుడు మన సొసైటీలో క్వాలిఫైడ్ ఫ్లోరిస్ట్‌కు గౌరవాలు బాగానే లభిస్తున్నాయి. పూల దండలు కట్టే మహిళ కూడా అలాంటి గుర్తింపునే పొందగలగాలనేది నా అభిలాష. అలాగే ఫ్లవర్ డెకరేషన్– ఫ్లోరిస్ట్ కెరీర్‌కోసం గ్రాడ్యుయేషన్ స్థాయిలో కోర్సు అవసరం. హోటల్ మేనేజ్మెంట్, నిథిమ్లలో పరిమితంగా సిలబస్ ఉంది తప్ప మొత్తం కోర్సుగా లేదు. ఎన్జీవోలు కానీ ఇతర కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్ఆర్లో భాగంగా ఇస్తున్న స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో మహిళలు ఫ్లవర్ డెకరేషన్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే మహిళలకు ఒక హోదా ఇచ్చినట్లవుతుంది. ఇకబెనా వంటి జపాన్ శైలి ఫ్లవర్ డెకరేషన్ కోర్సులు మన దగ్గర కూడా ఉన్నాయి. నేను ఇకబెనా కోర్సు చేశాను కూడా. అయితే అవి సంపన్న వర్గాల నుంచి కిందకు దిగే పరిస్థితి లేదు. అందుకే మన దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లవర్ డెకరేషన్ కెరీర్‌ను అభివృద్ధి చేస్తే బావుటుందనిపిస్తోంది. మా అమ్మాయి కరిష్మాకి మెడిసిన్ తర్వాత పెళ్లి చేశాం. మా వారు సిద్ధార్థ బిజినెస్‌మేన్. ఇప్పుడు నా పూర్తి టైమ్‌ని పూల మీదనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. పూలనగలొచ్చాయి మోడరన్ జనరేషన్లో పూలకు క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే... పెళ్లికి పూలనగలు ధరిస్తున్నారు. చీర రంగును బట్టి పూలను ఎంపిక చేసి పూలనగలు చేస్తాం. వధూవరులు ధరించే దండలు కూడా వాళ్ల దుస్తులకు అనుగుణంగా తయారవుతున్నాయి. ఫంక్షన్లలో డిఫోడిలీస్, ఆర్చిడ్స్ వంటి పూలు రాజ్యమేలుతున్నాయి. కొత్త పూలు తెచ్చుకుందాం, కానీ స్వదేశీ పూలకు దూరం కావద్దు అనేది నేను చెప్పే మాట’’ అన్నారు డాక్టర్ కరుణా ఏకాంబర్. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేశ్ బాబు చదువుతూనే ఉన్నాను మాది వ్యాపార కుటుంబం. తాత దండు వెంకన్న రైల్వేస్‌కి స్టీల్ సప్లయ్ చేసేవాళ్లు. సికింద్రాబాద్‌లో ఆయన నిర్మించిన చాలా భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. మా తాత (వెంకన్న) వారసులు పెంటయ్య, ఆగయ్య, బాల నర్సయ్య, ఆయిల్ మిల్లులు, పిండిమిల్లులు నడిపారు. మా నాన్న ఏకాంబర్ పార్క్‌లేన్ హోటల్, ప్యాట్నీమాల్ కట్టారు. మా ఇంట్లో ఆడపిల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే పరిమితులు లేవు కాబట్టి ఇంటర్లో కస్తూర్బా కాలేజ్‌లో జాయింట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగాను.అయితే అమ్మాయి ఇంటర్లోకి వస్తే చాలు.. ఇక పెళ్లి సంబంధాలు చూసేవాళ్లు. అలా నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. పెళ్లి తర్వాత బిఏ, హోటల్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్కోర్సు, ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్ కోర్సులతోపాటు ‘ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, లండన్’ కాలేజ్‌లో వెస్టర్న్ క్లాసికల్ పియానో కోర్సు చేశాను. సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్ చేశాను. ఇప్పుడు పూల మీద పీహెచ్డీ చేశాను. నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడం కూడా నాకు కలిసొచ్చిన అవకాశమే అయింది. నిత్యవిద్యార్థిగా మారిపోయాను. చదువుకోవడంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా బిజీగా ఉన్నాను. నాన్న కట్టిన పార్క్‌లేన్ హోటల్లో డైరెక్టర్ని, ఆయన అడుగుజాడల్లోనే నిజాం క్లబ్ కమిటీ మెంబర్‌గా కూడా పని చేశాను. ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను కూడా. క్లబ్లో ఉమెన్స్ డేకి సాధికారత సాధించిన మహిళలను సత్కరించడం అనే సంప్రదాయాన్ని మొదలు పెట్టాను. – డాక్టర్ కరుణా ఏకాంబర్, ఎంటర్ప్రెన్యూర్ పొగడ పూల బాల్యం ‘మాది సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్. ఉమ్మడి కుటుంబం, ఇల్లు రెండెకరాల ఆవరణలో ఉండేది. ఇంటి నిండా రకరకాల పూల మొక్కలు. మొత్తం మూడు వందల చెట్ల మధ్య గడిచిన బాల్యం. ప్రతి పువ్వుతోనూ పరిచయం, ప్రతి రెమ్మతోనూ అనుబంధం ఉండేది. మా నానమ్మ పొగడ పూలతో ‘లక్షపూల పూజ’ చేసేది. ఆ పూజ కోసం పిల్లలందరం పూలు కోసి దండలు గుచ్చేవాళ్లం. దసరా పది రోజులు మాకు పండుగే. అందరూ చేసుకునే పండుగ ఒక ఎత్తయితే, మా వేడుక ఒక ఎత్తు. మా చుట్టు పక్కల అన్ని ఇళ్ల వాళ్లూ బతుకమ్మను పేర్చి ఆర్పీ రోడ్‌లోని గుడికి తీసుకొచ్చేవాళ్లు. వాళ్లందరి కంటే మా బతుకమ్మే పెద్దగా ఉండాలని మేము చేసే హడావుడి చిన్నది కాదు.ఏడు అడుగుల ఎత్తు బతుకమ్మను పేర్చేవాళ్లం. అందరూ మా బతుకమ్మను ఆసక్తిగా చూస్తూ ఉంటే మాకు గర్వంగా ఉండేది. ఆ బతుకమ్మలను నీటిలో వదిలేవాళ్లం. తంగేడు పూలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంది. బంతి, చేమంతుల పరిమళం శ్వాసకోశ వ్యాధులను హరించి వేస్తుంది. మన జీవిక పూలతో ముడిపడి ఉంది. పూల మీదున్న ఇష్టమే నన్ను ఫ్లోరిస్ట్ని చేసింది. బంజారాహిల్స్‌లో ‘బ్లూమింగ్ బడ్స్’ షోరూమ్‌ని నడిపా’నని చెప్పారు కరుణ. -
పుష్ప విలాపం
కవి సమయం ‘ఒకసారి ఒకరికి సన్మానం చేస్తుంటే ముఖ్యఅతిథి వచ్చేటప్పుడు మార్గం పొడవునా పూలరెక్కల్ని చల్లారు. ఆ పెద్దమనిషి వాటిని తొక్కుకుంటూ వచ్చాడు. మరోసారి ఇంటికి వచ్చిన మిత్రుడి చేతికి రెండు గులాబీలు ఇస్తే నేను లోపలికి వెళ్లి వచ్చే లోపల అతడి చేతిలో ఒట్టి తొడిమలే ఉన్నాయి. రెక్కలను తినేశాడు. స్త్రీలు కూడా పుష్పాలను చిత్రహింసల పాలు చేయడం చూశాను. ఈ సంఘటనలన్నీ నన్ను పుష్ప విలాపం రాయడానికి ప్రేరేపించాయి’... - కరుణశ్రీ హుద్ హుద్ వచ్చి విశాఖ చెట్ల తలలు తీసుకెళ్లింది. కాదు... హుద్ హుద్‌తో విశాఖ చెట్లు తమ తలలు తెగిపడేంత వరకూ పోరాడి ప్రజల్ని కాపాడాయి. విశాఖ పౌరులు తమ కోసం కంటే ఈ చెట్ల కోసమే ఎక్కువ విలపించారు. ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక పూపొద, ఒక బలిష్టమైన కాండం, తరతరాల పాటు ఒక ఇంటినీ వీధినీ ఆ దారిన పోయే ఆప్తులనూ పరికించి చూస్తూ నిలుచున్న మహావృక్షం అన్నీ పోయాయి. కవులు కలాలు అందుకున్నారు. విలపించారు. వృక్ష విలాపాన్ని వర్ణించబూనారు. కాని ఇలాంటి ఏ విపత్తునూ చూడకుండా అనునిత్యం జరుగుతున్న పుష్ప విధ్వంసాన్ని తన మానస మందిరంలో దర్శించి ‘పుష్ప విలాపం’ రాసి చిరకీర్తిని పొందిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. పదహారేళ్ల వయసులోనే బుద్ధదేవుని సన్నిధిలో (అమరావతి) ఒక పాకీపిల్ల దైన్యాన్ని చూసి ‘పాకీపిల్ల’ ఖండికను రాసిన కరుణశ్రీ ఆ కరుణనే తన రచనలకు ప్రధాన రసంగా తీసుకున్నారు. ఆయన ఖండ కావ్యాల్లో విశిష్టమైనది ‘ఉదయశ్రీ’. అందులో పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పాత్రలను స్వీకరించి రాసిన ‘తపోభంగం’, ‘కుంతీకుమారి’, ‘అనసూయాదేవి’, ‘సతీ సావిత్రి’, ‘పోతన’ వంటి ఖండికలు ఆయనలోని రచనా సౌశీల్యాన్ని నిరూపిస్తాయి. బుద్ధునికి పర్యాయపదంగా ‘కరుణశ్రీ’ కలం పేరును పెట్టుకున్న పాపయ్య శాస్త్రి అంతటి కరుణతో పాటు మబ్బు కంటె మెత్తనైన స్వచ్ఛమైన మనసుతో పిల్లల కోసం అనేక రచనలు చేశారు. చందమామలో కుందేలు, ఇంద్ర ధనుస్సు, ఆదికవి వాల్మీకి వంటి కథలూ గాథలతో పిల్లల ప్రపంచాన్ని సంపద్వంతం చేశారు. ఇక 1942లో తాను పని చేసే ఏ.సి. కళాశాల వార్షిక సంచికలో ఆయన ప్రకటించిన ‘పుష్పవిలాపం’ ఆనాటికీ ఈనాటికీ ఏనాటికీ నిలిచి ఉండే ఒక సుకుమారమైన ప్రకృతి పట్ల ప్రేమపూర్వకమైన రచన. అయితే- ఆయన దీనిని రాయడం ఒకెత్తు ఘంటసాల పాడి అమరత్వం కల్పించడం మరొక ఎత్తు. అసలు ఘంటసాల పాడటం వల్లే పుష్ప విలాపం నలుగురికీ తెలిసి పండిత పామరులకు కూడా ఆత్మీయ ఖండిక అయ్యిందని భావించేవారున్నారు. కాని బంగారమంటూ ఉంటేనే కదా దానికి ఎవరైనా తావి ఇవ్వగలిగినది. పుష్పవిలాపం రాసి కరుణశ్రీ, పాడి ఘంటసాల చిరంజీవులయ్యారు. మనందరం పుష్పవిలాపం అనేకసార్లు వినుంటాం. కన్నీరు కార్చి ఉంటాం. కాని దాని వెనుక ఎటువంటి రాగాలు, ఛాయలు ఉన్నాయో తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. సంగీత పరిజ్ఞాని, స్వయంగా సంగీతకారుడు అయిన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఒక సందర్భంలో పుష్పవిలాపానికి ఘంటసాల ఎటువంటి సృజనాత్మక విలువ ఇవ్వగలిగారో వివరించారు. ఘంటసాల తానే స్వయంగా స్వరపరిచి పాడటం వల్ల, హృదయం నుంచి ఇష్టపడి చేయడం వల్ల, తన స్వభావం కూడా కరుణశ్రీ వలే కరుణపూరితమైనది కనుక ఆ ఖండిక అలా సజల నయనాల సౌందర్యాన్ని పొందగలిగింది. తన జీవితకాలంలో అనేక సందర్భాలలో రోహిణీ ప్రసాద్ రాసిన సంగీత ప్రధాన వ్యాసాలను ఇటీవల హెచ్.బి.టి ‘సంగీతం రీతులు- లోతులు’ పేరిట వెలువరించింది (ప్రతులకు: 040- 23521849). అందులో పుష్పవిలాపం ఖండికను ఘంటసాల పాడటంలోని విశేషాలను వివరించిన వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాం. - సాక్షి సాహిత్యం పుష్పవిలాపం రాశాక కరుణశ్రీకి కొన్ని విశిష్ట అనుభవాలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన ట్రైన్లో వెళుతుంటే పుస్తకాలమ్మే వెండర్ వచ్చి- ఘంటసాల పుష్పవిలాపం కావాలా... చాలా బాగుంటుంది అని అమ్మజూపాడు. మరోసారి ఇద్దరు మెడికో అమ్మాయిలు వచ్చి ఇక జీవితంలో ఎప్పుడూ పూలను హింసించమనీ పూలు పెట్టుకోమనీ ప్రతిజ్ఞ చేసి వెళ్లారు... ఘంటసాల పాడిన ‘పుష్ప విలాపం’లో కరుణశ్రీ రాసిన అన్ని పద్యాలు లేవు. బహుశా రికార్డింగ్‌కు వీలుగా ఆరు పద్యాలనే తీసుకొని, పాడి, 78 ఆర్.ఎం.పి. రికార్డులో విడుదల చేశారు. ఇందులోని రాగాలన్నీ హిందుస్తానీవే. భావ ప్రధానంగా సాగే కవిత్వానికి ఈ రాగాలు ఎంచుకోవడం సహజమేనేమో. మధ్య మధ్య ఘంటసాల తాను రాసిన వచనాన్ని భావభరితంగా వినిపిస్తారు. ఇందులో మొదటి పద్యాన్ని ‘మాండ్ రాగం’లో వింటాం. ఆహ్లాదకరమైన గంట సవ్వడి వినిపిస్తూ ఉండగా మనం పూలతోటలోకి ప్రవేశిస్తాం. పూజ, దేవాలయం, ప్రాతఃకాలం అన్నీ స్పష్టంగా ఆడియోలో వినిపిస్తాయి. ఇందులో ‘బావురుమనడం, క్రుంగిపోవడం’ వంటి పదాలు ఉన్నప్పటికీ పెద్దగా విషాదఛాయలు వినపడవు. చివర ఒక సున్నిత రాగాలాపన ఉంటుంది. నేనొక పూల మొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి మా ప్రాణము తీతుగా యనుచు బావురుమన్నవి; క్రుంగిపోతి; నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై తరువాతి పద్య ‘మారు బిహాగ్’ రాగంలోనిది (యమునా తీరమున అనే పాట ఈ రాగంలోనిదే). శుద్ధ మధ్యమం వాడే సంప్రదాయాన్ని పంట్టించుకోలేదు కనుక కాస్త కల్యాణిలా అనిపిస్తుంది. కొత్త రాగమని కాబోలు, చివరలో కాస్త దీర్ఘమైన రాగాలాపన ఉంది. ఆయువు గల్గు నాల్గు గడియల్కని పెంచిన తీవతల్లి జా తీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలూగుచు న్మురియచుందుము ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై దీని తరువాతిది ‘బసంత్ రాగం’. బహుశా ఈ రాగాన్ని ఇంత ఖచ్చితంగా ఏ ఇతర తెలుగు సినీ సంగీత దర్శకుడూ వాడుకోలేదేమో. జాలిని ప్రతిఫలించే స్వరసముదాయంతో చేసిన అద్భుత స్వర రచన ఇది. ప్రతిభావంతుడైన విద్వాంసుడు పద్ధతి ప్రకారం గురువు దగ్గర నేర్చుకోకపోయినా రాగాలను అర్థం చేసుకోగలడనడానికి ఇదొక ఉదాహరణ. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృం గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే త్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళుము త్రుంచబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే అంతటితో రికార్డు ఒక వైపు ముగిసి రెండో వైపు తిప్పి ప్లే చేయగానే మంచి లయ వినిపిస్తుంది. దీంతో మూడ్ మారినట్టనిపిస్తుంది. తన సినిమా పాటల్లో ఘంటసాల పహాడీ రాగాన్ని ఏమాత్రం వాడుకున్నారో కాని ఈ పద్యం మాత్రం ఆ రాగంలోనిదే. పైగా భావంలోని నిందకు సరిగ్గా సరిపోయే రాగం ఇది. ఊలుదారాలతో గొంతులకురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చటముడులమమ్ము అకట దయలేనివారు మీ యాడవారు తరువాతి రాగం కరుణరసాన్ని ప్రతిబింబించే ‘మిశ్ర శివరంజని’. పద్యాలన్నిటి తరువాత చివరికి పాడిన ‘ప్రభూ’ అనే ‘కోడా’లో కూడా ఈ రాగచ్ఛాయలే వినిపిస్తాయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె మా యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారవోతురు గదా నరజాతికి నీతి యున్నదా? చివరి పద్యం రాగేశ్రీ రాగం. హాయిగా సాగే ఈ పద్యంలో కవిగారు మనల్ని చివాట్లు పెడుతున్నప్పటికీ మనకు సుతిమెత్తగా వీడ్కోలు చెబుతున్నట్టుగానే ఉంటుంది. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్యచేసెడి హంతకుండ మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ... ఇన్నేళ్లలో ఎన్నో ఆడియో వీడియోలు వెలువడ్డాయి. ఇంత సులభంగా భావాన్ని ఎవరైనా పలికించగలగారా అంటే లేదనే చెప్పాలి. పేరు ప్రఖ్యాతుల మీద పెట్టినంత శ్రద్ధ సంస్కారం పొందడం మీద పెట్టకపోవడం వల్లే ఈ అవస్థ. జీవించినంత కాలం తన సంస్కారంతో పాటను ఉన్నతీకరించిన ఘంటసాలకు మనం సెల్యూట్ చేయాలి. - కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ -
అధికారుల అదుపులో అనాథ బాలిక
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ అనాథ బాలికను(14 ఏళ్లు) ఆదిలాబాద్ మహిళా సంరక్షణాధికారి, హెడ్‌కానిస్టేబుల్ ఉజ్వల అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు నిర్వహిస్తున్న వారి వద్ద బాలిక అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. నిర్వాహకులకు, బాలికకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో సదరు బాలికను ఆదిలాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఆ తర్వాత ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించి, ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అమ్మాయిని తన గురించి తెలుపమని ఆరా తీయగా.. పేరు గంగామణి(భూమిక) అని, నిర ్మల్లో ఉండేదని, తల్లిదండ్రుల పేర్లు భూమి, సంజీవ్ అని పేర్కొంది. చిన్నప్పుడే తల్లి చనిపోయినట్లు, తండ్రి ఇటీవల చనిపోయినట్ల తెలిపింది. దీంతో బాలసదనంలో విద్యాబోధన చెప్పించేందుకు ఐసీపీఎస్ సిబ్బంది, మహిళా సంరక్షణాధికారులు బాలికకు నచ్చజెప్పగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన చిన్నమ్మ దగ్గరకు వెళ్తానంటూ రోదించడంతో బాలికను ఐసీపీఎస్ సామాజిక కార్యకర్త కరుణశ్రీ సహాయంతో పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక చెత్తకాగితాలు ఎదుర్కొంటూ జీవనం కొనసాగించేందుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. డీసీపీవో రాజేంద్రప్రసాద్, ఎన్ఐఈపీవో సగ్గం రాజు తదితరులు ఉన్నారు.