ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ అనాథ బాలికను(14 ఏళ్లు) ఆదిలాబాద్ మహిళా సంరక్షణాధికారి, హెడ్‌కానిస్టేబుల్ ఉజ్వల అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు నిర్వహిస్తున్న వారి వద్ద బాలిక అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. నిర్వాహకులకు, బాలికకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో సదరు బాలికను ఆదిలాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఆ తర్వాత ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించి, ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అమ్మాయిని తన గురించి తెలుపమని ఆరా తీయగా.. పేరు గంగామణి(భూమిక) అని, నిర ్మల్‌లో ఉండేదని, తల్లిదండ్రుల పేర్లు భూమి, సంజీవ్ అని పేర్కొంది.
చిన్నప్పుడే తల్లి చనిపోయినట్లు, తండ్రి ఇటీవల చనిపోయినట్ల తెలిపింది. దీంతో బాలసదనంలో విద్యాబోధన చెప్పించేందుకు ఐసీపీఎస్ సిబ్బంది, మహిళా సంరక్షణాధికారులు బాలికకు నచ్చజెప్పగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన చిన్నమ్మ దగ్గరకు వెళ్తానంటూ రోదించడంతో బాలికను ఐసీపీఎస్ సామాజిక కార్యకర్త కరుణశ్రీ సహాయంతో పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక చెత్తకాగితాలు ఎదుర్కొంటూ జీవనం కొనసాగించేందుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. డీసీపీవో రాజేంద్రప్రసాద్, ఎన్‌ఐఈపీవో సగ్గం రాజు తదితరులు ఉన్నారు.