పుష్ప విలాపం | Floral vilapam | Sakshi
Sakshi News home page

పుష్ప విలాపం

Published Fri, Oct 31 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

Floral vilapam

కవి సమయం
 
‘ఒకసారి ఒకరికి సన్మానం చేస్తుంటే ముఖ్యఅతిథి వచ్చేటప్పుడు మార్గం పొడవునా  పూలరెక్కల్ని చల్లారు. ఆ పెద్దమనిషి వాటిని తొక్కుకుంటూ వచ్చాడు. మరోసారి ఇంటికి వచ్చిన మిత్రుడి చేతికి రెండు గులాబీలు ఇస్తే నేను లోపలికి వెళ్లి వచ్చే లోపల అతడి చేతిలో ఒట్టి తొడిమలే ఉన్నాయి. రెక్కలను తినేశాడు. స్త్రీలు కూడా పుష్పాలను చిత్రహింసల పాలు చేయడం చూశాను. ఈ సంఘటనలన్నీ నన్ను పుష్ప విలాపం రాయడానికి ప్రేరేపించాయి’...
 - కరుణశ్రీ
 
 హుద్ హుద్ వచ్చి విశాఖ చెట్ల తలలు తీసుకెళ్లింది.
 కాదు... హుద్ హుద్‌తో విశాఖ చెట్లు తమ తలలు తెగిపడేంత వరకూ పోరాడి ప్రజల్ని కాపాడాయి.
 విశాఖ పౌరులు తమ కోసం కంటే ఈ చెట్ల కోసమే ఎక్కువ విలపించారు. ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక పూపొద, ఒక బలిష్టమైన కాండం, తరతరాల పాటు ఒక ఇంటినీ వీధినీ ఆ దారిన పోయే ఆప్తులనూ పరికించి చూస్తూ నిలుచున్న మహావృక్షం అన్నీ పోయాయి. కవులు కలాలు అందుకున్నారు. విలపించారు. వృక్ష విలాపాన్ని వర్ణించబూనారు.
 
కాని ఇలాంటి ఏ విపత్తునూ చూడకుండా అనునిత్యం జరుగుతున్న పుష్ప విధ్వంసాన్ని తన మానస మందిరంలో దర్శించి ‘పుష్ప విలాపం’ రాసి చిరకీర్తిని పొందిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. పదహారేళ్ల వయసులోనే బుద్ధదేవుని సన్నిధిలో (అమరావతి) ఒక పాకీపిల్ల దైన్యాన్ని చూసి ‘పాకీపిల్ల’ ఖండికను రాసిన కరుణశ్రీ ఆ కరుణనే తన రచనలకు ప్రధాన రసంగా తీసుకున్నారు. ఆయన ఖండ కావ్యాల్లో విశిష్టమైనది ‘ఉదయశ్రీ’. అందులో పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పాత్రలను స్వీకరించి రాసిన ‘తపోభంగం’, ‘కుంతీకుమారి’, ‘అనసూయాదేవి’, ‘సతీ సావిత్రి’, ‘పోతన’ వంటి ఖండికలు ఆయనలోని రచనా సౌశీల్యాన్ని నిరూపిస్తాయి. బుద్ధునికి పర్యాయపదంగా ‘కరుణశ్రీ’ కలం పేరును పెట్టుకున్న పాపయ్య శాస్త్రి అంతటి కరుణతో పాటు మబ్బు కంటె మెత్తనైన స్వచ్ఛమైన మనసుతో పిల్లల కోసం అనేక రచనలు చేశారు. చందమామలో కుందేలు, ఇంద్ర ధనుస్సు, ఆదికవి వాల్మీకి వంటి కథలూ గాథలతో పిల్లల ప్రపంచాన్ని సంపద్వంతం చేశారు. ఇక 1942లో తాను పని చేసే ఏ.సి. కళాశాల వార్షిక సంచికలో ఆయన ప్రకటించిన ‘పుష్పవిలాపం’ ఆనాటికీ ఈనాటికీ ఏనాటికీ నిలిచి ఉండే ఒక సుకుమారమైన ప్రకృతి పట్ల ప్రేమపూర్వకమైన రచన.
 అయితే-
 
ఆయన దీనిని రాయడం ఒకెత్తు ఘంటసాల పాడి అమరత్వం కల్పించడం మరొక ఎత్తు. అసలు ఘంటసాల పాడటం వల్లే పుష్ప విలాపం నలుగురికీ తెలిసి పండిత పామరులకు కూడా ఆత్మీయ ఖండిక అయ్యిందని భావించేవారున్నారు. కాని బంగారమంటూ ఉంటేనే కదా దానికి ఎవరైనా తావి ఇవ్వగలిగినది. పుష్పవిలాపం రాసి కరుణశ్రీ, పాడి ఘంటసాల చిరంజీవులయ్యారు. మనందరం పుష్పవిలాపం అనేకసార్లు వినుంటాం. కన్నీరు కార్చి ఉంటాం. కాని దాని వెనుక ఎటువంటి రాగాలు, ఛాయలు ఉన్నాయో తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. సంగీత పరిజ్ఞాని, స్వయంగా సంగీతకారుడు అయిన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఒక సందర్భంలో పుష్పవిలాపానికి ఘంటసాల ఎటువంటి సృజనాత్మక విలువ ఇవ్వగలిగారో వివరించారు. ఘంటసాల తానే స్వయంగా స్వరపరిచి పాడటం వల్ల, హృదయం నుంచి ఇష్టపడి చేయడం వల్ల, తన స్వభావం కూడా కరుణశ్రీ వలే కరుణపూరితమైనది కనుక ఆ ఖండిక అలా సజల నయనాల సౌందర్యాన్ని పొందగలిగింది.

తన జీవితకాలంలో అనేక సందర్భాలలో రోహిణీ ప్రసాద్ రాసిన సంగీత ప్రధాన వ్యాసాలను ఇటీవల హెచ్.బి.టి ‘సంగీతం రీతులు- లోతులు’ పేరిట వెలువరించింది (ప్రతులకు: 040- 23521849). అందులో పుష్పవిలాపం ఖండికను ఘంటసాల పాడటంలోని విశేషాలను వివరించిన వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాం.
 

- సాక్షి సాహిత్యం
 
పుష్పవిలాపం రాశాక కరుణశ్రీకి కొన్ని విశిష్ట అనుభవాలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన ట్రైన్‌లో వెళుతుంటే పుస్తకాలమ్మే వెండర్ వచ్చి- ఘంటసాల పుష్పవిలాపం కావాలా... చాలా బాగుంటుంది అని అమ్మజూపాడు. మరోసారి ఇద్దరు మెడికో అమ్మాయిలు వచ్చి ఇక జీవితంలో ఎప్పుడూ పూలను హింసించమనీ పూలు పెట్టుకోమనీ ప్రతిజ్ఞ చేసి వెళ్లారు...
 
ఘంటసాల పాడిన ‘పుష్ప విలాపం’లో కరుణశ్రీ రాసిన అన్ని పద్యాలు లేవు. బహుశా రికార్డింగ్‌కు వీలుగా ఆరు పద్యాలనే తీసుకొని, పాడి, 78 ఆర్.ఎం.పి. రికార్డులో విడుదల చేశారు. ఇందులోని రాగాలన్నీ హిందుస్తానీవే. భావ ప్రధానంగా సాగే కవిత్వానికి ఈ రాగాలు ఎంచుకోవడం సహజమేనేమో. మధ్య మధ్య ఘంటసాల తాను రాసిన వచనాన్ని భావభరితంగా వినిపిస్తారు. ఇందులో మొదటి పద్యాన్ని ‘మాండ్ రాగం’లో వింటాం. ఆహ్లాదకరమైన గంట సవ్వడి వినిపిస్తూ ఉండగా మనం పూలతోటలోకి ప్రవేశిస్తాం. పూజ, దేవాలయం, ప్రాతఃకాలం అన్నీ స్పష్టంగా ఆడియోలో వినిపిస్తాయి. ఇందులో ‘బావురుమనడం, క్రుంగిపోవడం’ వంటి పదాలు ఉన్నప్పటికీ పెద్దగా విషాదఛాయలు వినపడవు. చివర ఒక సున్నిత రాగాలాపన ఉంటుంది.
 నేనొక పూల మొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
 రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి మా
 ప్రాణము తీతుగా యనుచు బావురుమన్నవి; క్రుంగిపోతి; నా
 మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై

 
తరువాతి పద్య ‘మారు బిహాగ్’ రాగంలోనిది (యమునా తీరమున అనే పాట ఈ రాగంలోనిదే). శుద్ధ మధ్యమం వాడే సంప్రదాయాన్ని పంట్టించుకోలేదు కనుక కాస్త కల్యాణిలా అనిపిస్తుంది. కొత్త రాగమని కాబోలు, చివరలో కాస్త దీర్ఘమైన రాగాలాపన ఉంది.
 ఆయువు గల్గు నాల్గు గడియల్కని పెంచిన తీవతల్లి జా
 తీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
 నూయలలూగుచు న్మురియచుందుము ఆయువు తీరినంతనే
 హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై

 
దీని తరువాతిది ‘బసంత్ రాగం’. బహుశా ఈ రాగాన్ని ఇంత ఖచ్చితంగా ఏ ఇతర తెలుగు సినీ సంగీత దర్శకుడూ వాడుకోలేదేమో. జాలిని ప్రతిఫలించే స్వరసముదాయంతో చేసిన అద్భుత స్వర రచన ఇది. ప్రతిభావంతుడైన విద్వాంసుడు పద్ధతి ప్రకారం గురువు దగ్గర నేర్చుకోకపోయినా రాగాలను అర్థం చేసుకోగలడనడానికి ఇదొక ఉదాహరణ.
 గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృం
 గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే
 త్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
 తాళుము త్రుంచబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే

 అంతటితో రికార్డు ఒక వైపు ముగిసి రెండో వైపు తిప్పి ప్లే చేయగానే మంచి లయ వినిపిస్తుంది. దీంతో మూడ్ మారినట్టనిపిస్తుంది. తన సినిమా పాటల్లో ఘంటసాల పహాడీ రాగాన్ని ఏమాత్రం వాడుకున్నారో కాని ఈ పద్యం మాత్రం ఆ రాగంలోనిదే. పైగా భావంలోని నిందకు సరిగ్గా సరిపోయే రాగం ఇది.
 ఊలుదారాలతో గొంతులకురి బిగించి
 గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి
 ముడుచుకొందురు ముచ్చటముడులమమ్ము
 అకట దయలేనివారు మీ యాడవారు

 
 తరువాతి రాగం కరుణరసాన్ని ప్రతిబింబించే ‘మిశ్ర శివరంజని’. పద్యాలన్నిటి తరువాత చివరికి పాడిన ‘ప్రభూ’ అనే ‘కోడా’లో కూడా ఈ రాగచ్ఛాయలే వినిపిస్తాయి.
 మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ
 జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె మా
 యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మి మ
 మ్మావల పారవోతురు గదా నరజాతికి నీతి యున్నదా?

 
 చివరి పద్యం రాగేశ్రీ రాగం. హాయిగా సాగే ఈ పద్యంలో కవిగారు మనల్ని చివాట్లు పెడుతున్నప్పటికీ మనకు సుతిమెత్తగా వీడ్కోలు చెబుతున్నట్టుగానే ఉంటుంది.
 బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
 సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
 అందమును హత్యచేసెడి హంతకుండ
 మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ...

 
ఇన్నేళ్లలో ఎన్నో ఆడియో వీడియోలు వెలువడ్డాయి. ఇంత సులభంగా భావాన్ని ఎవరైనా పలికించగలగారా అంటే లేదనే చెప్పాలి. పేరు ప్రఖ్యాతుల మీద పెట్టినంత శ్రద్ధ సంస్కారం పొందడం మీద పెట్టకపోవడం వల్లే ఈ అవస్థ. జీవించినంత కాలం తన సంస్కారంతో పాటను ఉన్నతీకరించిన  ఘంటసాలకు మనం సెల్యూట్ చేయాలి.
 
- కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement