విరి వాణి | Karuna Sri Research On Flower Plants | Sakshi
Sakshi News home page

విరి వాణి

Published Mon, Oct 21 2019 2:04 AM | Last Updated on Mon, Oct 21 2019 2:04 AM

Karuna Sri Research On Flower Plants - Sakshi

‘‘నేనొక పూలమొక్క కడ నిల్చి..’’ అని కరుణశ్రీ పుష్ప విలాపాన్ని ఊహించి, అనుభూతి చెందితే.. ఈ ‘కరుణ’మ్మ.. పుష్ప ‘విలాసం’ కోసం పీహెచ్‌డీనే చేసింది. పూల పరిశ్రమకు ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తోంది.

‘చేంజింగ్‌ ప్యాటర్న్స్‌ ఆఫ్‌ ఫ్లోరల్‌ కల్చర్‌ – ఏ స్టడీ ఆన్‌ ఫ్లోరిస్ట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’... ఇది కరుణాఏకాంబర్‌ పూలమీద చేసిన పరిశోధన, పూలతో మమేకమైన మహిళల మీద పరిశోధన, వారి జీవితాల మీద సాగిన అధ్యయనం. పూలతో మనిషికి ఉండే బంధం అనంతమైనది. పండుగ, పర్వం, సంతోషం, దుఃఖం... సందర్భం ఏదైనా పువ్వుతోనే మొదలవుతుంది, పూలతోనే పూర్తవుతుంది. మనదేశంలో మట్టికి ఔన్నత్యం ఉంది. ఇక్కడ మొలిచిన ప్రతి చెట్టూ ఔషధాల మూలరూపమే. ప్రతి పువ్వూ సుగుణాల స్వరూపమే. ప్రతి వేడుకలోనూ పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

అలాంటి పూలకే ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన తెలంగాణ సంస్కృతి మూలాలను ఔపోసన పట్టారు డాక్టర్‌ కరుణా ఏకాంబర్‌. మనిషి జీవితంలో పూల ప్రాధాన్యంతోపాటు అలంకరణలో వస్తున్న మార్పులు, కొత్తగా వచ్చి చేరుతున్న పూల రకాల గురించి దండకట్టారు. మొక్క నాటి, పాదు చేసి, నీరు పోసి పూలు పూయించే వారి శ్రమ నుంచి వాటిని కోసి దండకట్టి మార్కెట్‌లో సిద్ధం చేసి ఉపాధి పొందే మహిళల వరకు ప్రతి ఒక్కరి జీవితాలనూ చదివారామె. వీళ్లంతా తెరవెనుక పని చేసే శ్రమ జీవులు.

ఇక మోడరన్‌ మార్కెట్‌లో పూలతో కెరీర్‌ను అల్లుకున్న ఫ్లోరిస్ట్‌లను పరిశీలించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... మట్టిలో మొలిచిన మొక్క నుంచి మొగ్గ తొడిగి రెక్కలు విచ్చుకున్నప్పటి నుంచి... ఆ పువ్వు ముఖం వేళ్లాడేసుకుని తిరిగి నేల ఒడిని చేరే వరకు కొనసాగే పువ్వు ప్రయాణమంతటినీ అక్షరబద్ధం చేశారు డాక్టర్‌ కరుణ. ఈ ప్రయాణంలో ఎంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారో వివరించారు. మరెంత మంది ఈ పూలతో సంతోషాలను పంచుకుంటున్నారో... ఆ వివరాలను తన పరిశోధన గ్రంథంలో పూసగుచ్చారు డాక్టర్‌ కరుణ.

పూల పుస్తకం
‘‘నా చిన్నప్పుడు నేను చూస్తూ పెరిగిన  మాలతీలతలు, రేరాణి, గన్నేరు, సంపెంగ, పారిజాతం వంటి అనేక రకాల∙పూలు  ఇప్పుడు ఏ ఫంక్షన్‌లోనూ  కనిపించడం లేదు. మార్కెట్‌లో కొత్త రకాల పూలు చాలా వస్తున్నాయి. మన వాళ్లకు పాశ్చాత్యం మీద క్రేజ్‌ ఎక్కువ. చల్లని దేశాల్లో పూచే పూల వాడకం పెరిగింది. మార్కెట్‌లో ఏ పూలయితే బాగా అమ్ముడవుతాయో, ఆ పూల మొక్కలను పెంచితేనే పూలరైతుకి గిట్టుబాటవుతుంది. దాంతో మన దేశీయ పూలలో చాలా రకాలు కనుమరుగవుతున్నాయి. నా పరిశోధనలో భాగంగా వాటి కోసం అన్వేషించాను. ఒకచోట గ్రంథస్థం చేస్తేనయినా రాబోయే తరం తెలుసుకోవడానికి ఒక ఆధారం ఉంటుందనిపించింది. అందుకే మన కల్చర్‌లో దేవుళ్ల పూజల కోసం ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తారనే వివరాలను కూడా పరిశోధన గ్రంథంలో పొందుపరిచాను.

సువాసనల పరిశ్రమ
పూలు అలంకరణ కోసమో, ఆడంబర ప్రదర్శన కోసమో మాత్రమే కాదు. ఇది ఉపాధినిచ్చే విస్తారమైన పరిశ్రమ. ఈ పరిశ్రమను వ్యవస్థీకృతం చేయాలనేది నా కోరిక. ఇంట్లో ఉండి భర్త మార్కెట్‌ నుంచి తెచ్చిన పూలను దండలు కట్టే మహిళలు ఈ రంగంలో సైలెంట్‌ ప్లేయర్స్‌. ఇప్పుడు మన సొసైటీలో క్వాలిఫైడ్‌ ఫ్లోరిస్ట్‌కు గౌరవాలు బాగానే లభిస్తున్నాయి. పూల దండలు కట్టే మహిళ కూడా అలాంటి గుర్తింపునే పొందగలగాలనేది నా అభిలాష. అలాగే  ఫ్లవర్‌ డెకరేషన్‌– ఫ్లోరిస్ట్‌ కెరీర్‌కోసం గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కోర్సు అవసరం. హోటల్‌ మేనేజ్‌మెంట్, నిథిమ్‌లలో పరిమితంగా సిలబస్‌ ఉంది తప్ప మొత్తం కోర్సుగా లేదు.

ఎన్‌జీవోలు కానీ ఇతర కార్పొరేట్‌ సంస్థలు తమ సీఎస్‌ఆర్‌లో భాగంగా ఇస్తున్న స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లలో మహిళలు ఫ్లవర్‌ డెకరేషన్‌లో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్‌ ఇస్తే మహిళలకు ఒక హోదా ఇచ్చినట్లవుతుంది.
ఇకబెనా వంటి జపాన్‌ శైలి ఫ్లవర్‌ డెకరేషన్‌ కోర్సులు మన దగ్గర కూడా ఉన్నాయి. నేను ఇకబెనా కోర్సు చేశాను కూడా. అయితే అవి సంపన్న వర్గాల నుంచి కిందకు దిగే పరిస్థితి లేదు. అందుకే మన దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లవర్‌ డెకరేషన్‌ కెరీర్‌ను అభివృద్ధి చేస్తే బావుటుందనిపిస్తోంది. మా అమ్మాయి కరిష్మాకి మెడిసిన్‌ తర్వాత పెళ్లి చేశాం. మా వారు సిద్ధార్థ బిజినెస్‌మేన్‌. ఇప్పుడు నా పూర్తి టైమ్‌ని పూల మీదనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను.

పూలనగలొచ్చాయి
మోడరన్‌ జనరేషన్‌లో పూలకు క్రేజ్‌ ఎంతగా పెరిగిపోయిందంటే... పెళ్లికి పూలనగలు ధరిస్తున్నారు. చీర రంగును బట్టి పూలను ఎంపిక చేసి పూలనగలు చేస్తాం. వధూవరులు ధరించే దండలు కూడా వాళ్ల దుస్తులకు అనుగుణంగా తయారవుతున్నాయి. ఫంక్షన్‌లలో డిఫోడిలీస్, ఆర్చిడ్స్‌ వంటి పూలు రాజ్యమేలుతున్నాయి. కొత్త పూలు తెచ్చుకుందాం, కానీ స్వదేశీ పూలకు దూరం కావద్దు అనేది నేను చెప్పే మాట’’ అన్నారు డాక్టర్‌ కరుణా ఏకాంబర్‌.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: కె. రమేశ్‌ బాబు

చదువుతూనే ఉన్నాను
మాది వ్యాపార కుటుంబం. తాత దండు వెంకన్న రైల్వేస్‌కి స్టీల్‌ సప్లయ్‌ చేసేవాళ్లు. సికింద్రాబాద్‌లో ఆయన నిర్మించిన చాలా భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. మా తాత (వెంకన్న) వారసులు పెంటయ్య, ఆగయ్య, బాల నర్సయ్య, ఆయిల్‌ మిల్లులు, పిండిమిల్లులు నడిపారు. మా నాన్న ఏకాంబర్‌ పార్క్‌లేన్‌ హోటల్, ప్యాట్నీమాల్‌ కట్టారు. మా ఇంట్లో ఆడపిల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే పరిమితులు లేవు కాబట్టి ఇంటర్‌లో కస్తూర్బా కాలేజ్‌లో జాయింట్‌ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగాను.అయితే అమ్మాయి ఇంటర్‌లోకి వస్తే చాలు.. ఇక పెళ్లి సంబంధాలు చూసేవాళ్లు. అలా నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. పెళ్లి తర్వాత బిఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్, న్యూట్రిషన్‌కోర్సు, ఇకబెనా ఫ్లవర్‌ డెకరేషన్‌ కోర్సులతోపాటు ‘ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్, లండన్‌’ కాలేజ్‌లో వెస్టర్న్‌ క్లాసికల్‌ పియానో కోర్సు చేశాను.

సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్‌ చేశాను. ఇప్పుడు పూల మీద పీహెచ్‌డీ చేశాను. నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడం కూడా నాకు కలిసొచ్చిన అవకాశమే అయింది. నిత్యవిద్యార్థిగా మారిపోయాను. చదువుకోవడంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా బిజీగా ఉన్నాను. నాన్న కట్టిన పార్క్‌లేన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ని, ఆయన అడుగుజాడల్లోనే నిజాం క్లబ్‌ కమిటీ మెంబర్‌గా కూడా పని చేశాను. ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను కూడా. క్లబ్‌లో ఉమెన్స్‌ డేకి సాధికారత సాధించిన మహిళలను సత్కరించడం అనే సంప్రదాయాన్ని మొదలు పెట్టాను.
– డాక్టర్‌ కరుణా ఏకాంబర్,
ఎంటర్‌ప్రెన్యూర్‌

పొగడ పూల బాల్యం
‘మాది సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌. ఉమ్మడి కుటుంబం, ఇల్లు రెండెకరాల ఆవరణలో ఉండేది. ఇంటి నిండా రకరకాల పూల మొక్కలు. మొత్తం మూడు వందల చెట్ల మధ్య గడిచిన బాల్యం. ప్రతి పువ్వుతోనూ పరిచయం, ప్రతి రెమ్మతోనూ అనుబంధం ఉండేది. మా నానమ్మ పొగడ పూలతో ‘లక్షపూల పూజ’ చేసేది. ఆ పూజ కోసం పిల్లలందరం పూలు కోసి దండలు గుచ్చేవాళ్లం. దసరా పది రోజులు మాకు పండుగే. అందరూ చేసుకునే పండుగ ఒక ఎత్తయితే, మా వేడుక ఒక ఎత్తు. మా చుట్టు పక్కల అన్ని ఇళ్ల వాళ్లూ బతుకమ్మను పేర్చి ఆర్‌పీ రోడ్‌లోని గుడికి తీసుకొచ్చేవాళ్లు.

వాళ్లందరి కంటే మా బతుకమ్మే పెద్దగా ఉండాలని మేము చేసే హడావుడి చిన్నది కాదు.ఏడు అడుగుల ఎత్తు బతుకమ్మను పేర్చేవాళ్లం. అందరూ మా బతుకమ్మను ఆసక్తిగా చూస్తూ ఉంటే మాకు గర్వంగా ఉండేది. ఆ బతుకమ్మలను నీటిలో వదిలేవాళ్లం. తంగేడు పూలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంది. బంతి, చేమంతుల పరిమళం శ్వాసకోశ వ్యాధులను హరించి వేస్తుంది. మన జీవిక పూలతో ముడిపడి ఉంది. పూల మీదున్న ఇష్టమే నన్ను ఫ్లోరిస్ట్‌ని చేసింది. బంజారాహిల్స్‌లో ‘బ్లూమింగ్‌ బడ్స్‌’ షోరూమ్‌ని నడిపా’నని చెప్పారు కరుణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement