Karur district
-
యువకుడిని తన్నుతూ కర్రలతో దాడి.. పైశాచిక ఆనందం అంటే ఇదేనేమో..
సాక్షి, చెన్నై: బైక్ దొంగతనం నెపంతో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అతడిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కరూర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న అనిష్(22)ను కొందరు వ్యక్తులు కలిశారు. తమ బైకును అనిష్ దొంగిలించాడనే అనుమానంతో అతడితో మాట్లాడాలని వారు చెప్పారు. అనంతరం కరూర్ జిల్లాలో వీరరక్కియంలోని నిర్మానుష్య ప్రాంతానికి అనిష్‌కు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనిష్‌ను వారు బెదిరిస్తూ.. బైకు దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని బెదిరించారు. ఇందుకు అనిష్ ఒప్పుకోకపోవడంతో 10 మంది అతడిపై దాడి చేశారు. కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ, పిడి గుద్దులతో చితకబాదారు. వారిలో ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు. వారి దాడి చేస్తున్న సమయంలో అనిష్ అరుస్తూ.. తనను పోలీస్ స్టేషన్‌కు తరలించాలని వేడుకున్నాడు. కానీ, వారు అదేమీ పట్టించుకోకుండా దాడి చేశారు. అనంతరం అనిష్‌ను అతడి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన తన కొడుకును చూసి అనిష్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఎంత పనిచేశావ్ తల్లీ..!
సాక్షి, చెన్నై: బంధువుల వేడుకకు తీసుకెళ్లలేదని భర్తపై కోపంతో అభంశుభం తెలియని పిల్లలను బావితో తోసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కులితలై సమీపంలోని సెంబియం గ్రామానికి చెందిన శక్తి వేల్ (35) టైలర్. భార్య శరణ్య(30), కుమార్తెలు కనిష్క(6), పుదిషా(3) ఉన్నారు. నాచ్చిముత్తు పాళ యంలో బంధువుల ఇంటి వేడుకకు సోమవారం రాత్రి శక్తివేల్ వెళ్లాడు. తమకు చెప్పకుండా భర్త మాత్రమే వెళ్లడంతో ఆగ్రహించిన శరణ్య పిల్లలిద్దరిని ఇంటి సమీపంలోని బావిలో పడేసింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మంగళవా రం ఉదయం ఇంటికి వచ్చిన శక్తివేల్ భార్య పిల్ల లు కనిపించకపోవడంతో గాలించారు. బావిలో శరణ్య మృతదేహం కనిపించింది. అతి కష్టంతో పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బెంజ్ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి.. చదవండి: మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి -
లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’
చెన్నై: మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా ఫలితం శూన్యంగా మారుతోంది. చిన్న పిల్లలపై, మైనర్లపై జరిగే లైంగిక నేరాల నియంత్రణకు పోక్సో వంటి చట్టం కామాంధుల చర్యల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. తాజాగా లైంగిక వేధింపులకు మరో బాలిక ప్రాణం బలైపోయింది. ఇప్పటికే భర్తను పొగొట్టుకున్న ఆ తల్లికి కూతురి ఆత్మహత్య తీవ్ర కడుపుకోతను మిగిల్చింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక ఎంత సేపటికీ బయటకు రాకపోవడాన్ని గమనించిన పక్కనున్న వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక ఉరేసుకొని కనిపించింది. దీంతో షాక్ తిన్న ఆమె వెంటనే బాలిక తల్లికి సమాచారమిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. బాలిక మృతదేహం పక్కన రాసిన సుసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలు లేఖలో పేర్కొంది.‘ కరూర్ జిల్లాలో లైంగిక వేధింపులకు బలయ్యే అమ్మాయిల్లో నేనే చివరి దాన్ని కావాలి. నా ఈ కఠిన నిర్ణయానికి కారణమైన వారి గురించి చెప్పేందుకు భయంగా ఉంది. నాకు ఇంకా చాలా కాలం బతకాలని ఉంది. ఇతరకు సాయం చేయాలని ఉంది. కానీ చాలా త్వరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఈ తీవ్రమైన చర్య తీసుకున్నందుకు నన్ను క్షమించండి’ అని కోరింది. కాగా మరోవైపు తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత వారం కోయంబత్తూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. -
మనసున్న మారాజు
మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు.. మనసున్న వాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. రెండో కోవకు చెందిన వారే కరూర్ జిల్లా కలెక్టర్ అన్భళగన్. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న జిల్లాల కలెక్టర్లు ప్రజలతో సన్నిహితంగా మెలిగేందుకు అడుగులు వేస్తున్నారు. నీతి నిజాయితీతో, విధి నిర్వహణలో నిక్కచ్చితనంతో, సేవా ధృక్పథంతో ముందుకు సాగే సీనియర్ కలెక్టర్లు ఎందరో ఉన్నా, యువ కలెక్టర్లు సైతం తమకు ఆదర్శంగా ఉన్న వారి అడుగుజాడల్లో నడిచేందుకు ఇష్టపడుతున్నారు. నిత్యం జిల్లా వ్యవహారాల్లో బిజీగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో కొందరు కలెక్టర్లు తామూ సామాన్యులమేనని చాటుకుంటూ వస్తున్నారు. ఆ కోవలో పలువురు ఉన్నా, తాజాగా కరూర్ కలెక్టర్ అన్భళగన్ అందరికీ ఆదర్శవంతంగా నిలిచే రీతిలో సోమవారం ఓ వృద్ధురాలిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పింఛను అందించారు. తన ఇంటివద్ద నుంచి భోజనం తయారుచేయించుకుని వెళ్లి ఆ అవ్వతో కలసి నేలమీద కూర్చుని భుజించడం విశేషం. సాక్షి, చెన్నై : కరూర్ జిల్లా కలెక్టర్ అన్భళగన్ అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. ఎవరూ లేని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధురాలి విన్నపాన్ని తక్షణం పరిగణించారు. ఆమె ఇంటి వద్దకే వెళ్లి మరీ పింఛను మంజూరుకు ఉత్తర్వులను అందజేశారు. ఆమెతో కలిసి గుడిసెలో నేల మీద కూర్చుని భోజనం చేశారు. గుడిసెలో భోజనం రాక్కమ్మాల్కు వృద్ధాప్య పింఛన్ అందించడమే కాదు, ఆమెకు మంచి భోజనం సైతం తన చేతులతో వడ్డించాలని కలెక్టర్ అన్భళగన్ భావించారు. సోమవారం తన ఇంటి నుంచి క్యారియర్ సిద్ధం చేసి పట్టుకు వెళ్లారు. చిన్నమ్మ నాయకన్ పట్టిలోని గుడిసెలో జానెడు పొట్టను నింపుకునేందుకు ఏదో వంట తయారీలో ఉన్న ఆమెను పరామర్శించారు. తాను జిల్లా కలెక్టర్ అని పరిచయం చేసుకున్నారు. ఆమె పెట్టుకున్న అర్జీ గురించి గుర్తుచేశారు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసినట్టు, ఇక నెలసరి ఇంటి వద్దకే ఆమెకు పింఛను వచ్చి చేరే రీతిలో జారీచేసిన ఉత్తర్వులను చూపించారు. దీంతో రాక్కమ్మాల్ ఆనందానికి అవధులు లేవు. ఆనంద భాష్పాలతో కలెక్టర్‌కు ఆమె నమస్కరించారు. అంతే కాదు, ఆమెకు మంచి భోజనాన్ని వడ్డించేందుకు కలెక్టర్ సిద్ధం అయ్యారు. అయితే, తనతో పాటు భోజనం చేయాలని రాక్కమ్మాల్ చేసుకున్న విజ్ఞప్తిని కలెక్టర్ అంగీకరించారు. ఆమెతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఆమెతో ముచ్చటిస్తూ, ఏదేని సమస్య వస్తే, తన దృష్టికి తీసుకు రావాలని సూచించి సెలవు తీసుకున్నారు. నిన్నటివరకు రాక్కమ్మాల్ ఉందా..? లేదా..? అని కూడా ఆ గుడిసె వైపు తొంగి చూడని వాళ్లు సైతం ఆమె ఇంటికి కలెక్టర్ వచ్చి వెళ్లిన సమాచారంతో ఆ వృద్ధురాల్ని తమ గ్రామంలో ఓ వీఐపీ అన్నట్టుగా చూడడం మొదలెట్టడం గమనార్హం. వేడుకోలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. వాటన్నింటికీ కిందిస్థాయి అధికారులు పరిశీలించి, అవసరం అనుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతారు. మరికొన్ని చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఫిర్యాదులు, వినుతులు పడి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల తన కార్యాలయానికి వచ్చి ఓ వృద్ధురాలు పెట్టుకున్న వేడుకలు కరూర్ జిల్లా కలెక్టర్ అన్భళగన్ హృదయాన్ని కదిలించింది. కరూర్ చిన్నమ్మ నాయకన్ పట్టికి చెందిన రాక్కమ్మాల్ (80) వినతి ఆమె గుడిసె వైపుగా కలెక్టర్‌ను అడుగులు వేయించింది. తనకు ఎవరూ లేదని, ఊరి చివర్లో ఏదో ఓ పూరి గుడిసెలో ఉన్నట్టు, ఇంతవరకు తనకు వృద్ధాప్య పింఛను రాలేదని, తమరైనా స్పందించండి అని ఆమె చేసుకున్న మనవితో కలెక్టర్ సోమవారం అన్ని పనుల్ని పక్కన పెట్టి ఆమెను స్వయంగా కలిసేందుకు పయనం అయ్యారు. -
కరూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
♦ కారును ఢీకొన్న ఇసుక లారీ ♦ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం ♦ నలుగురికి తీవ్ర గాయాలు వాళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వారు. ఆధ్యాత్మిక చింతనతో రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ఆలయాలు చుట్టి ఆనందపరవశులయ్యారు. ఆ తీపి గురుతులను నెమరు వేసుకుంటూ ఇంటిముఖం పట్టారు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం. విధి ఆడిన వింత నాటకంలో ఏడుగురు బలైపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన శనివారం కరూర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించింది. బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. సేలం : తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, మహిళ సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేరళ రాష్ట్రం కాసర్కోడు జిల్లా మందైకాప్పు ప్రాంతానికి చెందిన రోహిత్ మంజర(22), జరాల్డ్ మంజర(35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40), విహారం.. విషాదం రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6), జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్ కారులో వేలాంకన్ని పర్యాటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి అదేకారులో తిరుగుపయనమయ్యారు. కారును రోహిత్ మంజర నడుపుతున్నాడు. శనివారం ఉదయం 6.30 గంటలకు కరూర్ జిల్లా కుళితలై సమీపంలోని కె.పేట్టై బైపాస్ రోడ్డులో కారు వెళ్తోంది. అదే సమయంలో కరూర్ నుంచి ఇసుక లోడుతో తిరుచ్చి వైపు లారీ వేగంగా వస్తోంది. అకస్మాత్తుగా కారు – లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారులోనివారు శిథిలాల్లో చిక్కుకుపోయారు. కేకలు విని స్థానికులు వారిని వెలుపలికి తీశారు. సమాచారం అందుకున్న కుళితలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో రోహిత్ మంజర (22), జరాల్డ్ మంజర (35), క్షత్రియన్ (30), ఆల్విన్ (40), రీవా (17), ప్రెజిల్లా (50), శాంతి (6) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. జెసిమా, ప్రేమ, సిల్ఫియా (3), రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కారు టైర్లు పేలిన కారణంగా అదుపుతప్పి లారీని ఢీకొని ఉండవచ్చని చెబుతున్నారు. ప్రమాదం కారణంగా కరూర్ – తిరుచ్చి రోడ్డుపై రెండు గంటలకు పైగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.