kathi narasimhareddy
-
టీచర్లకు థ్రిల్లర్ సినిమా!
- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపాటు అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రభుత్వం టీచర్లకు థ్రిల్లర్ సినిమా చూపిస్తోందని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లోనే చేపట్టాల్సిన రేషనలైజేషన్, బదిలీలకు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పూనుకోవడం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పోనీ షెడ్యూల్ ప్రకారమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోందా అంటే అదీ లేదన్నారు. ఇప్పటికి మూడు జీఓలు, 12 సవరణ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ప్రభావం పాఠశాలలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా పంచాయతీరాజ్ టీచర్లు ఎదురు చూస్తున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈఓ, డీవైఈఓ, డైట్ అధ్యాపకులు, బీఈడీ కళాశాలల అధ్యాపకులు, ఎన్సీఆర్టీ, జేఎల్ పోస్టులు భర్తీ అవుతాయని, దీంట్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయమై మంగళవారం విద్యాశాఖ మంత్రి, కార్యదర్శిని కలిసి చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, ఏపీటీఎఫ్(1938) వెంకటసుబ్బయ్య, పండిత పరిషత్ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పెద్దన్న, యూటీఎఫ్ ఎస్వీవీ రమణయ్య, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి, పీఈటీ సంఘం లింగమయ్య, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
స్పాట్ కేంద్రాన్ని పరిశీలించిన ‘కత్తి’
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి స్పాట్ కేంద్రాన్ని శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సందర్శించారు. టీచర్లతో మాట్లాడారు. వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. అన్ని డీఎస్సీల సీనియారిటీ జాబితాలను వెంటనే ప్రకటించాలన్నారు. పండిట్, పీఈటీల సీనియారిటీ జాబితానూ ప్రకటించి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించాలన్నారు. అన్ని ఖాళీలనూ భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ చెప్పారు. స్పాట్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ వెంట ఎస్టీయూ నాయకులు రామన్న, గోవిందు, యూటీఎఫ్ జిలాన్, ఏపీటీఎఫ్ (1938) కులశేఖర్‌రెడ్డి, ఆర్‌యూపీపీ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, హెచ్ఎం అసోసియేషన్ రమనారెడ్డి, పీఈటీ అసోసియేషన్ లింగమయ్య తదితరులు ఉన్నారు. -
టీచర్లపై ప్రభుత్వం ఒత్తిడి
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యా ప్రమాణాల గురించి పదేపదే మాట్లాడుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధనేతర పనులు, ఆన్లైన్ సమాచార సమర్పణ పేరుతో తీవ్ర గందరగోళానికి, ఒత్తిడికి గురి చేస్తోందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి ఆరోపించారు. స్థానిక లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో శనివారం నిర్వహించిన ఎస్టీయూ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తరగతి గదిలో బోధనలో నిమగ్నం కావాల్సిన టీచర్లు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దసరా సెలవుల్లో సైతం విద్యార్థులకు సంబంధించిన 54 అంశాలు రెండ్రోజుల్లో ఆన్లైన్లో పొందుపరచాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలన్నారు. ఎయిడెడ్ టీచర్ల పదోన్నతులు, బదిలీలు, 010 పద్దు కింద జీతాలు మంజూరు, హెల్త్‌కార్డుల సదుపాయం కోసం కషి చేస్తున్నామన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కత్తినరసింహారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, జిల్లా నాయకులు గోవిందు, రామన్న, సూరీడు, పాల్గొన్నారు.