టీచర్లకు థ్రిల్లర్ సినిమా!
- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపాటు
అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రభుత్వం టీచర్లకు థ్రిల్లర్ సినిమా చూపిస్తోందని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లోనే చేపట్టాల్సిన రేషనలైజేషన్, బదిలీలకు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పూనుకోవడం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పోనీ షెడ్యూల్ ప్రకారమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోందా అంటే అదీ లేదన్నారు.
ఇప్పటికి మూడు జీఓలు, 12 సవరణ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ప్రభావం పాఠశాలలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా పంచాయతీరాజ్ టీచర్లు ఎదురు చూస్తున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈఓ, డీవైఈఓ, డైట్ అధ్యాపకులు, బీఈడీ కళాశాలల అధ్యాపకులు, ఎన్‌సీఆర్‌టీ, జేఎల్ పోస్టులు భర్తీ అవుతాయని, దీంట్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయమై మంగళవారం విద్యాశాఖ మంత్రి, కార్యదర్శిని కలిసి చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, ఏపీటీఎఫ్(1938) వెంకటసుబ్బయ్య, పండిత పరిషత్ ఎర్రిస్వామి, తులసిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పెద్దన్న, యూటీఎఫ్ ఎస్‌వీవీ రమణయ్య, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి, పీఈటీ సంఘం లింగమయ్య, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.