సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీలు కలిపి రూ. 3.03 లక్షల కోట్లు ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొత్తం అప్పులు రూ. 1.92 లక్షల కోట్లు కాగా, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీ రూ. 77,304 కోట్లు అని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఖర్చులు ఇష్టారాజ్యంగా చేస్తే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణగా మారుతుందన్నారు. చేసే పనులు తక్కువ.. ప్రచారం ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. 2022–23 నాటికి ఇవి మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు.
సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. సన్నబియ్యం ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని వ్యాఖ్యానించారు. విద్యుత్ వెలుగులు కాంగ్రెస్ చలవేనని అన్నారు. కూకట్‌పల్లి మండలంలో దళిత మహిళలకు 4 ఎకరాల్లో పట్టాలిచ్చారని, వాటిని కొందరు పెద్దలు ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధరణి వెబ్‌సైట్‌లోనూ గ్లోబరీనా జోక్యం ఉన్నట్లు చెబుతున్నారని, దాన్ని దూరం పెట్టాలని సూచించారు. ఎనిమిది, పదేళ్లుగా పనిచేస్తున్న హోంగార్డులను తీసేశారని, వారు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్ రావడంలేదన్నారు. ఇంతలో అధికార పక్ష సభ్యుడు బాల్క సుమన్ అడ్డుతగలగా, ఆయన్ను సంక్షేమ మంత్రిగానో ఏదో ఒకటి చేయాలని భట్టి ఎద్దేవా చేశారు.
ఏడెనిమిది నెలల నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు రావడంలేదన్నారు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల జీతాలను రూ. 18 వేలు చేయాలని డిమాండ్ చేశారు. పాలీహౌస్ రైతులకు డబ్బులు నిలిపివేశారని తెలిపారు. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బంగారు రుణం తీసుకుంటే, రుణమాఫీని వర్తింపచేయలేదని భట్టి స్పీకర్‌కు ఆధారాలతో సహా వివరించారు. రూ. 78 వేలు తీసుకుంటే మాఫీ కాకపోగా, ఇప్పుడది వడ్డీతో కలిపి రూ.1.47 లక్షలు అయిందన్నారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకొని.. ఏడు శాతం లోపు వడ్డీ ఉన్నటువంటి బంగారు రుణాలను మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తారని, అంతకుమించితే పరిగణించరని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంపై అభ్యంతరం
తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో కలుపుకుపోవడంపై భట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకేసారి 12 మంది విలీనం కాలేదన్నారు. ఒకసారి ఒకరు, మరోసారి ఇద్దరు ఇలా వేర్వేరుగా చేరారని, ఆ సమయంలో స్పీకర్‌కు విన్నవించామని గుర్తు చేశారు. ఆ సమయంలో వారిపై చర్య తీసుకోకుండా కాలయాపన చేశారని, చివరకు వేర్వేరు సమయాల్లో చేరిన 12 మందిని విలీనం చేశారని ఆరోపించారు. తమ ఫిర్యాదు సమయంలోనే ఒకరిద్దరిపై వేటు వేస్తే తమకు న్యాయం జరిగేదని వాపోయారు. ఇది సమంజసం కాదన్నారు.
పాతబస్తీకి మెట్రో నడపండి..
ఎంఐఎం సభ్యుడు ముజంఖాన్ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రోరైలును తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. జ్వరాల తీవ్రత ఉన్నందున వైద్య ఖాళీలను భర్తీ చేయా లని కోరారు. అవసరమైన మందులను సరఫరా చేయాలన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబాల ను ఆదుకునేందుకు మంత్రులు అజయ్, ఎర్రబెల్లి దయాకర్‌లతో కలిసి ఏపీకి వెళ్లామన్నారు. అక్కడి సీఎం జగన్‌తో కలిసి పరిస్థితిని చక్కదిద్దామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 3 లక్షలు, సాధారణంగా బయటపడిన వారికి రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. పీహెచ్‌డీ విద్యార్థులకు కేంద్రమే ఫెలోషిప్ ఇస్తుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఫెలోషిప్‌పై విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment