ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ, చిత్రంలో సోనియా గాంధీ, ఆ పార్టీ చీఫ్ ఖర్గే
మోదీ వ్యవస్థీకృత చర్యలకు పాల్పడుతున్నారు
కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు.
పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం.
ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు.
డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే
‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు.
‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్
‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్‌చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు.
‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి.
అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది.
అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్
విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment