న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ భాగమైన విషయం తెలిసిందే. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలో కలిసే పోరుకు వెళ్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు శాశ్వతం కాదని తాజాగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ. జూన్ 4న అందరిని ఆశ్చర్యపరిచే ఫలితాలు రానున్నాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌తో పొత్తు శాశ్వతం కాదని, బీజేపీని ఓడించడమే తమ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ‘దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం, బీజేపీని ఓడించేందుకు ఎక్కడ పొత్తు అవసరం అయినా ఆప్, కాంగ్రెస్ కలిసి వస్తాయి. పంజాబ్‌లో బీజేపీకి ఉనికి లేదు’ అని అన్నారు. కాగా ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కూటమిగా ఉండగా, పొరుగున ఉన్న పంజాబ్‌లో ఆ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాను తిరిగి జైలుకు వెళ్లడం సమస్యేం కాదని అన్నారు. ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, వారు(కేంద్రంలోని బీజేపీ) కోరుకున్నంత కాలం నన్ను జైల్లో పెట్టనివ్వండి. నేను దేనికి భయపడను. వెనకడుగు వేయను.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ తరపున ప్రచారం చేసేందుకు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ 2న ఆయన జైల్లో అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు కోర్టులో ఉన్నందున దానిపై స్పందించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి ప్రధాని త్వరలో ముగింపు పలుకుతారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్రలో బీజేపీ అధికారంలో వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షానే తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఆదిత్యనాథ్‌ను ఆయన పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment