టీచర్లపై ప్రభుత్వం ఒత్తిడి
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యా ప్రమాణాల గురించి పదేపదే మాట్లాడుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధనేతర పనులు, ఆన్‌లైన్ సమాచార సమర్పణ పేరుతో తీవ్ర గందరగోళానికి, ఒత్తిడికి గురి చేస్తోందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి ఆరోపించారు. స్థానిక లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన ఎస్టీయూ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తరగతి గదిలో బోధనలో నిమగ్నం కావాల్సిన టీచర్లు, ఇంటర్‌నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దసరా సెలవుల్లో సైతం విద్యార్థులకు సంబంధించిన 54 అంశాలు రెండ్రోజుల్లో ఆన్‌లైన్‌లో పొందుపరచాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు.
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలన్నారు. ఎయిడెడ్ టీచర్ల పదోన్నతులు, బదిలీలు, 010 పద్దు కింద జీతాలు మంజూరు, హెల్త్‌కార్డుల సదుపాయం కోసం కషి చేస్తున్నామన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కత్తినరసింహారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, జిల్లా నాయకులు గోవిందు, రామన్న, సూరీడు, పాల్గొన్నారు.