ఊరవతలికి కాలుష్యం!
గ్రేటర్లో పర్యావరణ హననానికి కారణమవుతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)సన్నాహాలు చేస్తోంది. ఇందులో తొలివిడతగా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమలను సైతం ముచ్చెర్ల ఫార్మా సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: తొలిదశలో కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని మరో వెయ్యి బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే పరిశ్రమల తరలింపును కాటేదాన్ పారిశ్రామిక వాడకు సంబంధించిన పరిశ్రమల వర్గాలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కాటేదాన్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలే అధికంగా ఉన్నాయని, కాలుష్య కారక పరిశ్రమలను ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి మూసివేయించిందని వారు స్పష్టం చేస్తున్నారు.
విడతల వారీగా పరిశ్రమల
తరలింపు...
గ్రేటర్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాలు తదితర కాలుష్య కారక పరిశ్రమలకు కాటేదాన్ నిలయంగా ఉంది. ఈ పారిశ్రామిక వాడ కారణంగా స్థానికంగా ఉన్న నూర్‌మహ్మద్ కుంట కాలుష్యకాసారమైన విషయం విదితమే. అంతేకాదు ఈ వాడ జి.ఓ.111 పరిధిలోనే ఉండడంతో జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు సైతం శాపంగానే పరిణమిస్తోంది. ఈనేపథ్యంలో తొలివిడతగా ఈ పారిశ్రామిక వాడలోని కాలుష్య కారక కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరవాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే వీటిలో ఫార్మా, ఇంటర్మీడియెట్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించాలని నిర్ణయించారు.
పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే..
కాటేదాన్‌లో ప్రస్తుతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే అధికసంఖ్యలో ఉన్నాయని..వీటిలో సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని కాటేదాన్ పారిశ్రామికవాడ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిని ఒకేసారి నగరానికి సుదూరంగా తరలిస్తే కార్మికులకు ఉపాధి దూరమౌతుందని..మరోవైపు పరిశ్రమల తరలింపు చిన్న పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఈ తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.