keki mistry
-
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్‌కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు. నలుగురు డైరెక్టర్లు–రాజేశ్ మాగౌ, రోహిత్ భగత్, స్టూవార్ట్ వాల్టన్, డిర్క్‌వాన్ డెన్ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్ నుంచి సురేశ్ కుమార్, లే హాప్కిన్స్ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం
ముంబై: పాలనా ప్రమాణాలు పెంచుకోవాలంటూ పెరిగిన రాజకీయ, నియంత్రణపరమైన ఒత్తిళ్ల మధ్య కంపెనీల బోర్డులు పనిచేస్తున్నాయని, ఫలితంగా కంపెనీలు రిస్క్ కు దూరంగా ఉండడమే ప్రస్తుత ఆర్థిక మందగమనానికి కారణమని హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రి వ్యాఖ్యానించారు. రిస్క్‌కు వెరిసే లక్షణం కారణంగా బ్యాంకర్లు రుణాలపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, ఇది మారకపోతే భారతదేశ సహజ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దేశ జీడీపీ వృద్ధి 2019–20 ఆరి్థక సంవత్సరానికి 5 శాతం లోపునకు (ఇది 11 ఏళ్ల కనిష్టం) పరిమితం కావచ్చంటూ కేంద్ర గణాంక విభాగం అంచనాలు వెలువడిన సమయంలో కేకిమిస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవే. ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ఆర్థిక వృద్ధి క్షీణతకు కారణాల్లో.. బ్యాంకులకు రిస్క్ పెద్ద తలనొప్పిగా మారడం కూడా ఒకటి. బ్యాంకులు ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాయి. వ్యవస్థలో ఎంతగానో నిధుల లభ్యత (లిక్విడిటీ) ఉంది. నిధులకు కొరతేమీ లేదు’’అని వాస్తవ పరిస్థితిని కేకిమిస్త్రి వివరించారు. అంటే కంపెనీలకు రుణా లు తగినంత లభించకపోవడానికి నిధుల సమస్య కాదని, రిస్క్ విషయంలో మారిన బ్యాంకుల వైఖ రే కారణమని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. రుణాల విషయంలో రిస్క్ తీసుకునేం దుకు అయిష్టంగా ఉన్నంత కాలం ఆరి్థక వ్యవస్థపై ప్రభావం చూపిస్తూనే ఉంటుందని మిస్త్రి అన్నారు. -
తక్కువ పన్ను రేట్లతో నల్లధనం నిర్మూలన
ముంబై: దేశంలో ప్రస్తుతం ఉన్న అధిక పన్ను రేట్లు దిగి రావాల్సిన అవసరం ఉందని... ఇది నల్లధనం ఉత్పత్తిని తగ్గించడంతోపాటు, ఆదాయాన్ని పెంచుతుందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పట్లో పన్ను రేట్లను తగ్గిస్తారని తాను ఆశించడం లేదని, సాధారణ ఎన్నికల ముందు తదుపరి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ఉండొచ్చన్నారు. ‘‘ప్రజల నుంచి మరిన్ని ప్రయోజనాలు కావాలని, పన్నులు తగ్గించాలన్న డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం ద్రవ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పన్ను రేట్లను నిజంగా తగ్గించాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కొద్ది మొత్తంలో నల్లధన ప్రవాహం అనేది అధిక పన్నుల వల్లే’’ అని కేకి మిస్త్రీ చెప్పారు. తక్కువ పన్ను రేట్లు ఉంటే, అధిక పన్నులు వసూలు అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ద్రవ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని సమతూకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. -
హెచ్డీఎఫ్సీ ఫలితాలు ఓకే
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఫలితాలు ఫర్వాలేదనిపించాయి. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో 13.5% అధికంగా రూ. 1,935 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలానికి రూ. 1,706 కోట్లను ఆర్జించింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17% ఎగసి రూ. 1,905 కోట్లను చేరినప్పటికీ, పెట్టుబడుల విక్రయంపై లభించే ఆదాయం తగ్గడంతో లాభాలు పరిమితమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ కేకి మిస్త్రీ చెప్పారు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 8,873 కోట్ల నుంచి రూ. 10,053 కోట్లకు చేరింది. పెట్టుబడుల విక్రయం ద్వారా లభించే లాభం, డివిడెండ్ల వంటివి రూ. 141.5 కోట్ల నుంచి రూ. 111 కోట్లకు తగ్గాయి. సబ్సిడరీలు మినహాయిస్తే (స్టాండెలోన్ ప్రాతిపదికన) క్యూ3లో కంపెనీ నికర లాభం 12% పుంజుకుని రూ. 1,278 కోట్లను తాకితే, ఆదాయం రూ. 5,250 కోట్ల నుంచి రూ. 6,020 కోట్లకు ఎగసింది. మొండిబకాయిలు, తదితరాలకు రూ. 466 కోట్లను అదనంగా కేటాయించడంతో ఇవి క్యూ3లో రూ. 1,357 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ నెలాఖరులో చేపట్టనున్న పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చునని, ఏప్రిల్ తరువాతే రేట్లలో తగ్గింపునకు అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బుధవారం షేరు ధర స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 842 వద్ద ముగిసింది.