ముంబై: దేశంలో ప్రస్తుతం ఉన్న అధిక పన్ను రేట్లు దిగి రావాల్సిన అవసరం ఉందని... ఇది నల్లధనం ఉత్పత్తిని తగ్గించడంతోపాటు, ఆదాయాన్ని పెంచుతుందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పట్లో పన్ను రేట్లను తగ్గిస్తారని తాను ఆశించడం లేదని, సాధారణ ఎన్నికల ముందు తదుపరి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ఉండొచ్చన్నారు. ‘‘ప్రజల నుంచి మరిన్ని ప్రయోజనాలు కావాలని, పన్నులు తగ్గించాలన్న డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
అదే సమయంలో ప్రభుత్వం ద్రవ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పన్ను రేట్లను నిజంగా తగ్గించాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కొద్ది మొత్తంలో నల్లధన ప్రవాహం అనేది అధిక పన్నుల వల్లే’’ అని కేకి మిస్త్రీ చెప్పారు. తక్కువ పన్ను రేట్లు ఉంటే, అధిక పన్నులు వసూలు అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ద్రవ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని సమతూకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment