హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు ఓకే
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు ఫర్వాలేదనిపించాయి. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో 13.5% అధికంగా రూ. 1,935 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలానికి రూ. 1,706 కోట్లను ఆర్జించింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17% ఎగసి రూ. 1,905 కోట్లను చేరినప్పటికీ, పెట్టుబడుల విక్రయంపై లభించే ఆదాయం తగ్గడంతో లాభాలు పరిమితమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ కేకి మిస్త్రీ చెప్పారు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 8,873 కోట్ల నుంచి రూ. 10,053 కోట్లకు చేరింది.
పెట్టుబడుల విక్రయం ద్వారా లభించే లాభం, డివిడెండ్ల వంటివి రూ. 141.5 కోట్ల నుంచి రూ. 111 కోట్లకు తగ్గాయి. సబ్సిడరీలు మినహాయిస్తే (స్టాండెలోన్ ప్రాతిపదికన) క్యూ3లో కంపెనీ నికర లాభం 12% పుంజుకుని రూ. 1,278 కోట్లను తాకితే, ఆదాయం రూ. 5,250 కోట్ల నుంచి రూ. 6,020 కోట్లకు ఎగసింది.
మొండిబకాయిలు, తదితరాలకు రూ. 466 కోట్లను అదనంగా కేటాయించడంతో ఇవి క్యూ3లో రూ. 1,357 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ నెలాఖరులో చేపట్టనున్న పరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చునని, ఏప్రిల్ తరువాతే రేట్లలో తగ్గింపునకు అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బుధవారం షేరు ధర స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 842 వద్ద ముగిసింది.