kendra sahitya academy
-
కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం!
అవును,మనం వింటున్నది నిజమే!ఈ ఉత్సవం పెద్ద చరిత్ర సృష్టించింది, రికార్డుల పంట పండించింది, భారతదేశానికి,కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు మునుపెన్నడు లేని పెద్ద ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. ఇది చిన్న ఉత్సవం కాదు, మహోత్సవం,సారస్వత మహాయజ్ఞం. ఈ మహాయగాన్ని నిర్వహించింది 'కేంద్ర సాహిత్య అకాడెమి'. దీనిని నడిపింది ఆ సంస్థ కార్యదర్శి కె.శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ పదహారణాల మన తెలుగువాడు. కృష్ణా తీరంవాడు, దివిసీమవాడు,కవిసీమవాడు. దశాబ్దాల కేంద్ర సాహిత్య అకాడెమి చరిత్రలో కార్యదర్శి హోదాను పొందిన మొట్టమొదటి తెలుగువాడు శ్రీనివాస్. అకాడెమి ప్రయాణంలో ఈ స్థాయిలో సాహిత్య మహోత్సవాలు జరగడం గొప్ప చరిత్ర. 'ప్రపంచ అతి పెద్ద సాహిత్య మహోత్సవం ' పేరుతో దిల్లీలో, కేంద్ర సాహిత్య అకాడెమి ప్రాంగణంలో,రవీంద్ర భవన్ లో ఈ మార్చి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకూ వేడుకలు ఘనంగా జరిగాయి.పోయిన ఏడాది కూడా జరిగాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే? 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్', దుబాయ్, 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్',లండన్ నుంచి ఘనమైన గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడెమి సంస్థకు,అధిపతి కె.శ్రీనివాస్‌కు కూడా విశేషమైన అభినందనలు అందాయి. ఒక్కరోజులోనే, అతిపెద్ద సంఖ్యలో, అనేక భాషలవారు వివిధమైన సారస్వతాన్ని వినిపించినందుకు 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ ', లండన్ గొప్ప రికార్డుగా నమోదు చేస్తూ సర్టిఫికెట్ పంపించింది. 1100 మంది ప్రతినిధులు 175 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ,190 సెషన్స్ గా, వరుసగా 6రోజుల పాటు సారస్వత మహోత్సవంలో పాల్గొనడాన్ని అపూర్వమైన విశేషంగా అభివర్ణిస్తూ దుబాయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్ ' ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విషయంగా భావిస్తూ సర్టిఫికెట్స్ అందజేసింది.భాషా,సాహిత్య, సాంస్కృతిక ప్రేమికులకు గొప్ప ఆనందాన్నిచ్చే గొప్ప సందర్భం, సంరంభం మన దేశరాజధానిలో వెల్లివిరిసాయి. 'సామాజిక న్యాయం' అనే మాట ఈమధ్య మనం తరచుగా వింటున్నాం. సామాజిక న్యాయంతో పాటు సాహిత్యానికి కూడా ఈ మహోత్సవంలో గొప్ప న్యాయం జరిగింది. ప్రతి ఏటా జరుగుతోంది, ఈ ఏడు మరింత విశేషంగా జరిగింది.సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలకు ప్రాతినిధ్యం కల్పించిన వేళ,ఆ యా రూపాలకు తత్ తుల్యమైన గౌరవం కూడా దక్కింది. దేశంలోని అనేక భాషల వాణి వినపడడమే కాక,లింగవివక్షకు తావులేకుండా అందరికీ సమ ప్రాతినిధ్యం లభించింది. కవితలు,కథలు,చిన్న కథలు, కళలు,సమీక్షలు,విమర్శలు,చర్చలు ఒకటేమిటి? ఈ ఆరురోజుల్లో ఎన్నో జరిగాయి. లబ్దప్రతిష్ఠులే కాక,మాన్యులు, సామాన్యులు,అతి సామాన్యులకు కూడా ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. ఒక్కొక్క సభా వేదికకు ఒక్కొక్క మహనీయుని పేరు పెట్టి, ఆ మాననీయులకు నీరాజనం పలికారు. మహాకవి వాల్మీకి, వేదవ్యాసుడు,మీరాబాయి, కబీర్,శంకరదేవుడు,తులసీదాస్, తిరువాళ్వార్ వంటి మహానీయులను వేదికల ద్వారా తలచుకొని,తలపులలో నిలుపుకొని,నమస్కరించుకొనే సౌభాగ్యం కూడా ఈ వేదికల ద్వారా ప్రాప్తమైంది. కళలకు సాహిత్యం అవసరమా? మహిళాసాధికారికత, బాలసాహిత్యం,యువసాహితి, అనువాదం,అస్మిత,చదువరితనం, రచించే శక్తి,అభిరుచి, సమకాలీన సాహిత్య సరళులు, గిరిజన భాషా,సాహిత్య, సంస్కృతులు,నవల,నవలిక, నాట్యం,నాటకం, సారస్వత గమనంలో సవాళ్లు, భారతీయుల ఇంగ్లిష్ రచనా నిపుణత,ఈ -బుక్స్, ఆడియో బుక్స్, ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కవిత్వంలో స్త్రీ, సాహిత్యం అందించే ఆనందం, ప్రేరణ,ప్రభావం, సరిహద్దుల అవతల భారతీయ సాహిత్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన సారస్వత వారసత్వ వైభవం, విద్య అందించే సృజన, జనపదాలు, జానపదకథలు, కవిత్వ వ్యవసాయం, స్వాతంత్య్రానికి పూర్వం సాహిత్యం, భక్తి ఉద్యమ కవిత్వం, భావోద్వేగాలు, రచయితలతో ముఖాముఖీ, రామకథావిశేషాలు, మన ఘన సాంస్కృతిక వారసత్వం, మన మహాకావ్యాలు, మన తత్త్వ గ్రంథాలు, తాత్వికత,సైన్స్ ఫిక్షన్, సాహిత్యం సమకూర్చే విలువలు, ఆత్మకథలు,మీడియా, భిన్నత్వంలో ఏకత్వం, ఇతిహాసాలు,పురాణాలు, అణగారిన వర్గాల ఆలోచనా ధోరణులు,దళిత సాహిత్యం, వందేళ్ల భారత సాహిత్యం, భారతీయ భాషల సంరక్షణ, భిన్న స్వరాల్లో భారతీయ కవిత్వం, మౌఖిక సాహిత్యం, స్వాతంత్ర్యానంతర సాహిత్య సృష్టి... ఇలా ఎన్నో అంశాలను,రంగాలను స్పృశిస్తూ ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే వేదికలపై 'కేంద్ర సాహిత్య అకాడెమి -2023' అవార్డుల ప్రదానోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 24 భాషీయులు పురస్కార ఘన గౌరవాన్ని అందుకున్నారు. అందులో మన తెలుగువారైన తల్లావఝల పతంజలిశాస్త్రి కూడా ఉండడం మనకు ముదావహం. సినిమా సాహిత్యంపై ప్రఖ్యాత ఉర్దూ కవి,రచయిత,గీతకారుడు గుల్జార్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో మాటవిడుపుగా మధ్య మధ్యలో సాగిన నృత్య,నాటక, సంగీత రూపక ప్రదర్శనలు కొంగ్రొత్త విందులను చిందించాయి. ఈ ఉత్సవాలతో పాటు గతంలో సిమ్లాలో,భోపాల్ లో నిర్వహించిన ' ఉన్మేష ఉత్సవాలు' రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరు రోజుల ఉత్సవాలకు ఆహ్వానించిన ప్రతిఒక్కరికీ అన్ని ఖర్చులు,భోజన,వసతి,పారితోషిక వగైరాలన్నింటినీ అకాడెమి భరించింది. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్వహించిన ఈ సాహిత్య మహోత్సవం అపూర్వ పర్వంగా అందగించింది. భారతీయ భాషా,సాహిత్య, సాంస్కృతులకు పెద్ద దివిటీలు పట్టిన శుభఘడియలు ఈ ఆరు దినములు. ప్రతి ఏటా ఇలాగే జరిగితే మన సారస్వత శోభ ప్రభాసమానమవుతుంది. 'ఆజాదీ కా అమృతోత్సవ్' లో భాగంగా జరిగిన ఉన్మేష ఉత్సవాలు కూడా ఆగకుండా జరగాలి. ఇంతటి చారిత్రక సభల ప్రభలు కట్టిన కేంద్ర సాహిత్య అకాడెమికి వీరతాళ్లు వేద్దాం. -రచయిత మా శర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!) -
శాంతినారాయణకు ‘వైఎస్సార్ లైఫ్‌టైం’ అవార్డు
అనంతపురం కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతినారాయణ దక్కించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ అవార్డు కమిటీ సభ్యులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని నవంబర్ ఒకటో తేదీన ప్రదానం చేస్తారు. రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో గౌరవించనున్నారు. బలమైన గొంతుక ఆయన సొంతం డాక్టర్ శాంతినారాయణ అనంతపురం యాసకు, కరువు కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈయన ఐదు దశాబ్దాలుగా సాహితీసేవలో తరిస్తున్నారు. తొలిరోజుల నుంచే ధార్మికుడు, మేధావి, అసలు సిసలైన సృజనశీలిగా కవిత్వాన్ని, గద్యాన్ని ఏకకాలంలో సమర్థవంతంగా నడిపించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో భిన్న ఇతివృత్తాల్ని ఎంచుకుని రచనలు చేయడం తెలుగు సాహిత్య రంగంలో అరుదనే చెప్పాలి. నవలా రచనలో కూడా వైవిధ్యం కనబరిచారు. జీవిత దృక్పథం, రచనల నేపథ్యం, ప్రపంచీకరణ పోకడలు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, సమాజంలోని అసమానతల గురించి, ఆది నుంచి ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాలు, ప్రభావం చూపిన కథా సాహిత్యం, ఇక్కడ పురుడుపోసుకున్న ఉద్యమాల గురించి తన రచనలతో అందరినీ కదిలించారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో నిరుపేద కుటుంబంలో జని్మంచిన శాంతినారాయణ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు. ఎటువంటి అభిప్రాయాన్నైనా నిక్కచ్చిగా, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగల్గిన ఆయన ఇనుప గజ్జెల తల్లి, పెన్నేటి మలుపులు, పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కల్లమయిపాయే, ఉక్కుపాద వంటి ప్రసిద్ధ కథలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘నాగులకట్ట సుద్దులు’ నవల తెలుగు సాహిత్యంలోనే సంచలనంగా నిలిచింది. ఇటీవలే ఆయన పంచసప్తతి కార్యక్రమం అనంతపురం వేదికగా జరిగింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత రచయితలు, కవులు శాంతినారాయణ సాహితీ కృషిని అభినందించారు. పలువురి హర్షం ప్రతిష్టాత్మక వ్యక్తులకందించే వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు శాంతినారాయణ ఎంపిక కావడంపై కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, జిరసం అధ్యక్షుడు శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్, సీనియర్ కథా రచయిత వెంకటేష్ తదితరులు వేర్వేరు ప్రకటనలో హర్షం ప్రకటించారు. విమలాశాంతి పురస్కారాల పేరిట ఎంతోమంది యువ రచయితలకందించి ప్రోత్సహిస్తున్న శాంతినారాయణను ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సమున్నతంగా గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. (చదవండి: ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..) -
విముక్తవాదానికి గుర్తింపు
విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ, సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది. పురాణాలు రుద్దిన పవిత్రతా భావనలూ పతివ్రతా ధర్మాలూ- స్త్రీల జీవితాల్లో దుఃఖం ఒంపుతున్నాయి. వాళ్ల జీవితాల్ని నియంత్రిస్తున్నాయి. జీవించే హక్కుపై దాడి చేస్తున్నాయి. అదెలాగో తెలియాలంటే ఓల్గా సృష్టించిన కథావరణంలోకి వెళ్లాలి. సీతను సూత్రధారిగా చేసుకుని నాలుగు గాథల్ని స్త్రీవాద కోణం నుంచి ఆమె పునర్నిర్మించారు. వీటితో సహా మొత్తం ఐదు కథల్తో వెలువడిన ‘విముక్త’కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. విముక్త భావజాలానికి ఇదొక గుర్తింపు. వాటిని ప్రతిపాదించిన కథలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతాయి. స్త్రీవాదం మరింత విస్తరించడానికి దోహదపడతాయి. తనపై రాముని ప్రేమ సత్యమని నమ్మింది సీత. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉండబోదన్న అహల్య మాటల్ని తిప్పికొట్టిన సీత... రాముడు శీలపరీక్ష కోరినప్పుడు - అధికారానికి లొంగవద్దన్న ఆమె మాటలు గుర్తు చేసుకుంటుంది. రాముడు అగ్నిపరీక్ష పెట్టినప్పుడూ అరణ్యాలకు పంపినప్పుడూ రేణుక ఇచ్చిన సైకత కుంభం (ఇసుక కుండ) ఆమెకు స్ఫురణకొస్తుంది. తమ పాతివ్రత్యాలు సైకత కుంభాల వంటివి అంటుంది రేణుక. శూర్పణఖను కురూపిగా చేసిన రాముని రాజకీయాన్నీ, వలచిన ఆమెకూ - ప్రేమించిన తనకూ వేదన మిగిల్చిన అతని ఆర్యరాజధర్మాన్నీ సీత నిరసించగలుగుతుంది. లక్ష్మణుడు అరణ్యంలో వదలివెళ్లిపోయాక - ఊర్మిళ మాటలు గుర్తు చేసుకుని ఉపశమనం పొందగలుగుతుంది. ‘అధికారాన్ని తీసుకో. అధికారాన్ని వదులుకో. అప్పుడు నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి’ అంటుంది ఊర్మిళ. వివిధ సందర్భాల్లో పై నలుగుర్నీ కలుస్తుంది సీత. వాళ్ల జీవితాల్ని వింటుంది. వాళ్ల ‘అనుభవాల నుంచి తను నేర్వగలిగింది నేర్చింది’. వారివ్యధాభరిత జీవితంలో తనను తాను చూసుకుంది. స్నేహంతో బలపడింది. ‘నాకు లేనిదేమీ లేదు’ అనుకునే స్థాయికి ఎదిగింది. ఆర్యధర్మాన్ని ధిక్కరించింది. బాధించే సంప్రదాయాల హద్దులు దాటి తమదైన ప్రపంచం నిర్మించుకున్నారు ఈ కథల్లోని స్త్రీలు. తమతో తాము యుద్ధం చేసుకుంటూ - తమను తాము తెలుసుకుంటూ విస్తరించుకున్నారు. విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ, సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది. ఇలాంటి కథలు పాఠ్యాంశాలు కావాల్సివుంది. స్నేహ సహకారాలూ, సమూహంలో భాగం కావడాలూ, అనుభవాలు పంచుకోవడాలూ, తమను తాము తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలూ స్త్రీల జీవితాన్ని అర్థవంతంగా మలచుతాయి. ఓల్గా రచనలు అలాంటి దారి చూపుతాయి. అధికారానికి అతీతమైన - స్నేహపూరితమైన స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడుతాయి. సమాజంలోని అన్ని దృక్కోణాల్లోనూ ఒక పునరాలోచన, పునర్నిర్మాణం సాధించడం ఫెమినిజం అంతిమ లక్ష్యమన్న ఓల్గా - ఆ దిశగా తన సమకాలికులెవ్వరూ చేయనంత కృషి చేసినందుకూ, చేస్తూనే ఉన్నందుకు అభినందనపూర్వకంగా అందిస్తున్నాం ఈ అక్షరగుచ్ఛం. వి. ఉదయలక్ష్మి