డాక్టర్ శాంతి నారాయణ
అనంతపురం కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతినారాయణ దక్కించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ అవార్డు కమిటీ సభ్యులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని నవంబర్ ఒకటో తేదీన ప్రదానం చేస్తారు. రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో గౌరవించనున్నారు.
బలమైన గొంతుక ఆయన సొంతం
డాక్టర్ శాంతినారాయణ అనంతపురం యాసకు, కరువు కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈయన ఐదు దశాబ్దాలుగా సాహితీసేవలో తరిస్తున్నారు. తొలిరోజుల నుంచే ధార్మికుడు, మేధావి, అసలు సిసలైన సృజనశీలిగా కవిత్వాన్ని, గద్యాన్ని ఏకకాలంలో సమర్థవంతంగా నడిపించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో భిన్న ఇతివృత్తాల్ని ఎంచుకుని రచనలు చేయడం తెలుగు సాహిత్య రంగంలో అరుదనే చెప్పాలి.
నవలా రచనలో కూడా వైవిధ్యం కనబరిచారు. జీవిత దృక్పథం, రచనల నేపథ్యం, ప్రపంచీకరణ పోకడలు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, సమాజంలోని అసమానతల గురించి, ఆది నుంచి ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాలు, ప్రభావం చూపిన కథా సాహిత్యం, ఇక్కడ పురుడుపోసుకున్న ఉద్యమాల గురించి తన రచనలతో అందరినీ కదిలించారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో నిరుపేద కుటుంబంలో జని్మంచిన శాంతినారాయణ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు.
ఎటువంటి అభిప్రాయాన్నైనా నిక్కచ్చిగా, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగల్గిన ఆయన ఇనుప గజ్జెల తల్లి, పెన్నేటి మలుపులు, పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కల్లమయిపాయే, ఉక్కుపాద వంటి ప్రసిద్ధ కథలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘నాగులకట్ట సుద్దులు’ నవల తెలుగు సాహిత్యంలోనే సంచలనంగా నిలిచింది. ఇటీవలే ఆయన పంచసప్తతి కార్యక్రమం అనంతపురం వేదికగా జరిగింది. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత రచయితలు, కవులు శాంతినారాయణ సాహితీ కృషిని అభినందించారు.
పలువురి హర్షం
ప్రతిష్టాత్మక వ్యక్తులకందించే వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుకు శాంతినారాయణ ఎంపిక కావడంపై కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, జిరసం అధ్యక్షుడు శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్, సీనియర్ కథా రచయిత వెంకటేష్ తదితరులు వేర్వేరు ప్రకటనలో హర్షం ప్రకటించారు. విమలాశాంతి పురస్కారాల పేరిట ఎంతోమంది యువ రచయితలకందించి ప్రోత్సహిస్తున్న శాంతినారాయణను ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సమున్నతంగా గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు.
(చదవండి: ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..)
Comments
Please login to add a commentAdd a comment