kerala govt
-
అర్ధరాత్రి స్వతంత్రం
తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం. ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్డౌన్ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్ బేకింగ్’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. బయట మార్కెట్లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే. ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది. క్రాఫ్ట్ బేకింగ్ కోర్సు ఫస్ట్ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్ నేషనల్ ట్రస్ట్, కోళికోడ్ పరివార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్.ఎ.పి. (అడిషనల్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్ బేకింగ్’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే. కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు. సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్’. ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్కీ వీలవుతుంది షైజాకు. లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్ చేయాలని ఎ.ఎస్.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట. బార్బీ కేకు, వైట్ వాంచో కేక్ -
అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం
కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావ్వాల్సిందిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ పోటీలు ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరస్సులో జరగనున్నాయి. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై బన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక బన్నీకి కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అతని సినిమాలు అక్కడ కూడా మంచి కలెక్షనను రాబడతాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
శబరి ఆలయంలో యువతి!
తిరువనంతపురం: మహిళలకు ప్రవేశం లేని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఒక యువతి ఉండగా తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవాదాయ అధికారులకు ఆ ఫొటో నిష్పాక్షితను నిర్ధారించాలని ఆదేశించారు. మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై కొల్లాంకు చెందిన వ్యాపారవేత్త ఒకరు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధం. -
పంబా తీరంలో తెలంగాణ భవనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల వసతి కోసం శబరిమలలో తెలంగాణ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. పంబా నదీ తీరంలో ఐదెకరాల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి బుధవారం కేరళ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనం కోసం కేరళ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం అయ్యప్ప దీక్షల నాటికి ఈ భవనం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. క్యాంటిన్, పార్కింగ్ వసతి కూడా ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. శబరిమలలో వేరే రాష్ట్ర వసతి భవనం రూపుదిద్దుకోవటం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలన్న ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తికి కేరళ సీఎం ఉమన్ చాందీ సానుకూలంగా స్పందించారు. -
కేరళ సర్కారుకు ఎదురుదెబ్బ
పామాయిల్ కేసు ఉపసంహరణకు హైకోర్టు తిరస్కరణ కొచ్చి: పామాయిల్ దిగుమతుల స్కాం కేసులో కేరళలోని కాంగ్రెస్-యూడీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. కేసును కొట్టేస్తే నిందితులకు వ్యక్తిగతంగానో మరోరకంగానో మేలు కలుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా న్యాయప్రక్రియను తొక్కిపెట్టినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌లో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాలేదని పేర్కొంది. తనపై విచారణ రద్దు చేయాలని ఐఏఎస్ అధికారి గిజీ థామ్సన్, తమను కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలని అసెంబ్లీ విపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌లు వేసిన పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చింది. పామాయిల్ దిగుమతుల్లో అక్రమాలు జరగలేదు కనుక కేసును కొట్టేయాలని తాను వేసిన పిటిషన్‌ను త్రిస్సూర్ విజినెల్స్ కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు వేసింది. దీన్ని మూడు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్‌లో హైకోర్టును ఆదేశించింది. 1991-92లో అప్పటి కరుణాకరన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మలేసియా నుంచి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకోవడంతో ఖజానాకు రూ. 2.3 కోట్ల నష్టం వచ్చినట్లు ఆరోపణలన్నాయి. ప్రస్తుత సీఎంచాందీ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నియామకాన్ని ఈ కేసు పెండింగ్‌లో ఉండడంతో సుప్రీం కోర్టు రద్దు చేసింది.