ఆమె ఫేస్ బుక్ పేజీ బ్లాక్
కోజికోడ్: మదర్సాలో లైంగిక వేధింపుల గురించి వెల్లడించిన కేరళ మహిళా జర్నలిస్ట్ వీపీ రజీనాపై సోషల్ మీడియాలో దూషణలు వెల్లువెత్తాయి. దీంతో తన ఫేస్ బుక్ పేజీని తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హెడ్ లైన్స్ గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న స్థానిక దినపత్రిక ఆమె జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు.
చిన్నతనంలో కోజికోడ్ మదర్సాలో చదువుకున్నప్పుడు తన సహవిద్యార్థులు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఉస్తాద్ లేదా టీచర్ బాలురు అందరినీ పిలిచి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. రాత్రి తరగతుల్లో బాలికల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించేవాడని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేక చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు మదర్సాకు రావడం మానుకున్నారన్నారు. దీంతో రజీనాకు వ్యతిరేకంగా, మద్దతుగా ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.
అయితే విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు తాను భయపడబోనని, చంపుతానని బెదిరించినా వెరవబోనని రజీనా స్పష్టం చేశారు. తాను చెప్పిందంతా వాస్తమని, అల్లా తన పక్షాన ఉన్నాడని పేర్కొన్నారు. 'పితృస్వామ్యాన్ని ఇస్లాం వ్యతిరేకిస్తుంది. కాని నేటికీ మహిళలు తమ అభిప్రాయలు వెల్లడిస్తే వారి లక్ష్యంగా చేసుకుంటున్నారు' అని రజీనా వాపోయారు.