చేతగాని సీఎం రాజీనామా చేయాలి
=టీ బిల్లు ప్రతుల చించివేత
=జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదుల నిరసన
తిరుపతి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేయని సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికి తీరా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే సరికి ఆయన మొహం చాటేయడంపై మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో కలసి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లాలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మదనపల్లెలో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో తెలంగాణ బిల్లు నమూనా ప్రతులను చింపి నిరసన తెలిపారు. పుంగనూరులో సమైక్యవాదులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ బిల్లు ప్రతులను తగులబెట్టి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ వరదారెడ్డి, బీసీ నాయకుడు అద్దాల నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోకపోతే సిగ్గులేని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను వీధుల్లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. చేతగాని సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగాయి.