Key Cases
-
కీలక కేసుల్లో జాగ్రత్తలు పాటించాలి
గుంటూరు : కీలకమైన కేసుల్లో దర్యాప్తు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఏ హరిహరనాథ శర్మ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్పరెన్స్ హాలు నందు శనివారం రూరల్ జిల్లా నేర సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ దర్యాప్తులో జాగ్రత్తలు పాటించడం ద్వారా అసలైన నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హత్య కేసుల్లో క్షుణ్ణంగా దర్యాప్తు ముందుగా రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు గడిచిన మూడేళ్లలో జరిగిన నేరాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ఆయా కేసుల్లోని నిందితులను కోర్టులో హాజరు పరచాలని చెప్పారు. అనుమానాస్పద మృతి కేసుల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హత్య జరిగిన కేసులను కూడా అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు గుర్తిస్తే శాఖా పరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రానున్న దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా బాణసంచాను నిల్వ చేస్తున్నట్లు గుర్తిస్తే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా క్వారీలు ఉన్న ప్రాంతాల్లో ఆయా సీఐలు తరచూ పరిశీలిస్తూ కార్మికులు పనులు సమయంలో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారా..లేదా? అనే విషయాలను పరిశీలించాలని చెప్పారు. జాగ్రత్తలు పాటించని క్వారీ యజమానులపై చట్ట పరిధిలో కేసులు నమోదు చేయాలన్నారు. మహిళా వేధింపులు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లలోని నిందితులను గుర్తించి వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని వివరించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కె.రామకృష్ణయ్య, అదనపు ఎస్పీలు వరదరాజు, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిభకు గుర్తింపు అనంతరం గత నెలలో విధి నిర్వహణలో ప్రతిభను చూపిన అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు. సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్ఐ కె.వెంకటేష్, ఏఎస్ఐలు ఆర్ త్రివర్ణ, పి.సురేంద్రబాబు, జె.సత్యనారాయణ తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతిభను కనపరిచే వారికి శాఖా పరంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు. -
కీలక కేసులు.. నీరుగారుతున్నాయ్!
కల్తీ, సెక్స్ రాకెట్ కేసుల్లో కొలిక్కిరాని విచారణ కల్తీ నెయ్యి నిందితునికి నెల క్రితమే ముందస్తు బెయిల్ సీపీకి సమాచారం ఇవ్వని పోలీసు అధికారులు విజయవాడ : విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వెలుగుచూసిన కీలక కేసులు నీరుగారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేరాలు, ఘోరాలను అదుపు చేయటంలో పోలీసు అధికారులే కమిషనర్‌కు సహకరించటం లేదని స్పష్టమవుతోంది. పైగా కేసులను నీరుగార్చే యత్నాలు చేస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ఏ2 నిందితుడు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ఈ విషయం సీపీకి తెలియదు. జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీని గురించి అటు ఎక్సైజ్ శాఖ కాని, పోలీస్ శాఖ కాని చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ విషయంలో ఇప్పటికే 800 వరకు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. క్షేత్రస్థాయిలో చర్యలకు పోలీసు అధికారులు చొరవ చూపటం లేదు. అధికార పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో వచ్చినవారే వారిలో ఎక్కువమంది కావటంతో అక్కడి నేతల కనుసన్నల్లో పనిచేయటానికే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి నిందితులకు ముఖ్య నేత అండ! కల్తీ నెయ్యి కేసులో ఏ2 నిందితుడు అనిల్‌కుమార్‌కు హైకోర్టు నెల రోజుల క్రితమే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం ఇంతవరకు పోలీస్ కమిషనర్‌కు తెలియదు. న్యాయస్థానంలో ఎవరైనా ముందస్తు బెయిల్ దాఖలు చేస్తే కోర్టు వారు పోలీసులకు కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ కేసులో పోలీసులు అనిల్‌కుమార్‌కు బెయిల్ రాకుండా ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదనేది ప్రశ్నగా మారింది. సంబంధిత పోలీసు అధికారులకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన నాయకుడు రంగంలోకి దిగటం వల్లే ఈ వ్యవహారం సీపీ వద్దకు కూడా పోకుండా స్థానిక పోలీసులు తొక్కిపట్టినట్టు తెలుస్తోంది. అండదండలు ఎవరివో! కల్తీ మద్యం అమ్మకాలు జిల్లాలో ఊపందుకున్నాయి. సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ వ్యవహారం వెనుక ఎవరి అండదండలున్నాయనే విషయమై అనేక అనుమానాలు రేగుతున్నాయి. స్వర్ణ బార్ ఉదంతంలో ఐదుగురి మృతిచెందినా కేసు దర్యాప్తులో నిజానిజాలు బయటికి రావటం లేదు. తాజాగా బందరులో నడిరోడ్డుపై కల్తీ మద్యం సీసాలు లభించటం యథేచ్ఛగా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయనడానికి తాజా ఉదాహరణ. పరారీలోనే కాల్‌మనీ నిందితులు కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ కేసు వ్యవహారం నెలరోజులైనా కొలిక్కి రాలేదు. తాజాగా మంగళవారం పెండ్యాల శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకోగా, ఇద్దరు నిందితులు పరారీలోనే ఉన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన వెనిగండ్ల శ్రీకాంత్ అటునుంచి అటే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే నిందితుడు ఉన్నట్లు సమాచారం. అయినా పోలీ సులు పట్టుకోవడం లేదు. ఇంకా సీహెచ్ శ్రీనివాస్ కూడా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసు వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో ఈ కేసును అధికార పార్టీ నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వరుసగా వెలుగుచూసిన కీలక కేసుల పరిస్థితే ఇలాగైతే ప్రజల భద్రత ఇక ప్రశ్నార్థకమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.