గుంటూరు : కీలకమైన కేసుల్లో దర్యాప్తు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఏ హరిహరనాథ శర్మ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్పరెన్స్ హాలు నందు శనివారం రూరల్ జిల్లా నేర సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ దర్యాప్తులో జాగ్రత్తలు పాటించడం ద్వారా అసలైన నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
హత్య కేసుల్లో క్షుణ్ణంగా దర్యాప్తు
ముందుగా రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు గడిచిన మూడేళ్లలో జరిగిన నేరాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ఆయా కేసుల్లోని నిందితులను కోర్టులో హాజరు పరచాలని చెప్పారు. అనుమానాస్పద మృతి కేసుల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హత్య జరిగిన కేసులను కూడా అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు గుర్తిస్తే శాఖా పరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రానున్న దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా బాణసంచాను నిల్వ చేస్తున్నట్లు గుర్తిస్తే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని తెలిపారు.
ముఖ్యంగా క్వారీలు ఉన్న ప్రాంతాల్లో ఆయా సీఐలు తరచూ పరిశీలిస్తూ కార్మికులు పనులు సమయంలో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారా..లేదా? అనే విషయాలను పరిశీలించాలని చెప్పారు. జాగ్రత్తలు పాటించని క్వారీ యజమానులపై చట్ట పరిధిలో కేసులు నమోదు చేయాలన్నారు. మహిళా వేధింపులు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లలోని నిందితులను గుర్తించి వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని వివరించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కె.రామకృష్ణయ్య, అదనపు ఎస్పీలు వరదరాజు, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రతిభకు గుర్తింపు
అనంతరం గత నెలలో విధి నిర్వహణలో ప్రతిభను చూపిన అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు. సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె.వెంకటేష్, ఏఎస్‌ఐలు ఆర్ త్రివర్ణ, పి.సురేంద్రబాబు, జె.సత్యనారాయణ తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతిభను కనపరిచే వారికి శాఖా పరంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment