కీలక కేసులు.. నీరుగారుతున్నాయ్! | Adulteration, an investigation into sex racket cases | Sakshi
Sakshi News home page

కీలక కేసులు.. నీరుగారుతున్నాయ్!

Published Wed, Jan 13 2016 2:11 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Adulteration, an investigation into sex racket cases

కల్తీ, సెక్స్ రాకెట్ కేసుల్లో కొలిక్కిరాని విచారణ
కల్తీ నెయ్యి నిందితునికి నెల  క్రితమే ముందస్తు బెయిల్
సీపీకి సమాచారం ఇవ్వని పోలీసు అధికారులు

 
విజయవాడ :  విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వెలుగుచూసిన కీలక కేసులు నీరుగారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేరాలు, ఘోరాలను అదుపు చేయటంలో పోలీసు అధికారులే కమిషనర్‌కు సహకరించటం లేదని స్పష్టమవుతోంది. పైగా కేసులను నీరుగార్చే యత్నాలు చేస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ఏ2 నిందితుడు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ఈ విషయం సీపీకి తెలియదు. జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీని గురించి అటు ఎక్సైజ్ శాఖ కాని, పోలీస్ శాఖ కాని చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ విషయంలో ఇప్పటికే 800 వరకు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. క్షేత్రస్థాయిలో చర్యలకు పోలీసు అధికారులు చొరవ చూపటం లేదు. అధికార పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో వచ్చినవారే వారిలో ఎక్కువమంది కావటంతో అక్కడి నేతల కనుసన్నల్లో పనిచేయటానికే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది.
 
కల్తీ నెయ్యి నిందితులకు ముఖ్య నేత అండ!

కల్తీ నెయ్యి కేసులో ఏ2 నిందితుడు అనిల్‌కుమార్‌కు హైకోర్టు నెల రోజుల క్రితమే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం ఇంతవరకు పోలీస్ కమిషనర్‌కు తెలియదు. న్యాయస్థానంలో ఎవరైనా ముందస్తు బెయిల్ దాఖలు చేస్తే కోర్టు వారు పోలీసులకు కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ కేసులో పోలీసులు అనిల్‌కుమార్‌కు బెయిల్ రాకుండా ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదనేది ప్రశ్నగా మారింది. సంబంధిత పోలీసు అధికారులకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన నాయకుడు రంగంలోకి దిగటం వల్లే ఈ వ్యవహారం సీపీ వద్దకు కూడా పోకుండా స్థానిక పోలీసులు తొక్కిపట్టినట్టు తెలుస్తోంది.
 
అండదండలు ఎవరివో!
కల్తీ మద్యం అమ్మకాలు జిల్లాలో ఊపందుకున్నాయి. సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ వ్యవహారం వెనుక ఎవరి అండదండలున్నాయనే విషయమై అనేక అనుమానాలు రేగుతున్నాయి. స్వర్ణ బార్ ఉదంతంలో ఐదుగురి మృతిచెందినా కేసు దర్యాప్తులో నిజానిజాలు బయటికి రావటం లేదు. తాజాగా బందరులో నడిరోడ్డుపై కల్తీ మద్యం సీసాలు లభించటం యథేచ్ఛగా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయనడానికి తాజా ఉదాహరణ.
 
పరారీలోనే కాల్‌మనీ నిందితులు
కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ కేసు వ్యవహారం నెలరోజులైనా కొలిక్కి రాలేదు. తాజాగా మంగళవారం పెండ్యాల శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకోగా, ఇద్దరు నిందితులు పరారీలోనే ఉన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లిన వెనిగండ్ల శ్రీకాంత్ అటునుంచి అటే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే నిందితుడు ఉన్నట్లు సమాచారం. అయినా పోలీ సులు పట్టుకోవడం లేదు. ఇంకా సీహెచ్ శ్రీనివాస్ కూడా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసు వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో ఈ కేసును అధికార పార్టీ నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వరుసగా వెలుగుచూసిన కీలక కేసుల పరిస్థితే ఇలాగైతే ప్రజల భద్రత ఇక ప్రశ్నార్థకమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement