Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్‌లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్‌పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్‌వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్‌పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే.