key markets
-
ఆంక్షల ఎత్తివేత: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్పందన
ముంబై: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలను ఎత్తి వేయడంపై సంతోషం ప్రకటించింది. కొత్త దేశీయ కస్టమర్లను ఆన్‌బోర్డ్‌లో చేరేలా తక్షణమే వీలు కల్పించడం తమకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తుందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కీలకమార్కెట్లో పరిమితులను ఎత్తివేయడాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్వాగతించింది తమకు ఇండియా కీలకమైన వ్యూహాత్మక మార్కెట్ అనీ, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో తమ స్థానిక ప్రధాన పెట్టుబడుల ఫలితమే ఆర్బీఐ నిర్ణయమని సంస్థ తాత్కాలిక సీఈఓ, సీఓఓ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ప్రీమియం ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ తీర్చేందుకు అత్యుత్తమ సామర్థ్యంతో ఉన్నామనీ, ఆర్బీఐ నిర్ణయం దేశంలో తమ వ్యాపార వృద్ధికి తోడ్పడు తుందన్నారు. కాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై ఆంక్షలను ఆర్బీఐ బుధవారం ఎత్తివేసింది. కొత్తగా దేశీయ కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతించింది. చెల్లింపుల సమాచారాన్ని నిక్షిప్తం చేసే అంశానికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై ఆర్బీఐ గతంలో ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు చెల్లింపుల పూర్తి సమాచారాన్ని 2018 ఏప్రిల్ నుంచి భారత్‌లోనే నిక్షిప్తం చేయాలన్న నిబంధన ఉంది. -
జియోతో 4జీ విప్లవం: ఐడీసీ
న్యూఢిల్లీ: ఉచితవాయిస్ కాల్స్, ఉచిత 4 జీ డేటాలతో టెలికాం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి నాంది పలకనుంది. జియో ఉచిత 4జీ సిమ్ కార్డులు, తక్కువ ధరలకే 4జీస్మార్ట్ ఫోన్ల నేపథ్యంలో 4 జీ విప్లవానికి భారతదేశం అగ్రస్థానంలో నిలవనుందని ఇంటర్నేషనల్ డాటా కార్పేరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి బిలియన్ ఖాతాదారుల లక్ష్యంతో ప్రారంభించిన 4జీ స్మార్ట్ ఫోన్లతో ఇండియా లాంటి కీలకమైన మార్కెట్లలో 4జీ విప్లవానికి దారులు వేసిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) బుధవారం వెల్లడించింది . ప్రపంచ వ్యాప్తంగా 4జీ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు కానుందని తెలిపింది. 2016లో 21.3 శాతం వృద్ధితో 1.17 బిలియన్ యూనిట్ల చేరనుందని తెలిపింది. 2015 లో 967 మిలియన్లుగా ఉందని పేర్కొంది. కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రవేశంతో ఇండియా లాంటి కీలక మార్కెట్లలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నట్టు వ్యాఖ్యానించింది. ఉచిత సిమ్ కార్డులు, తక్కువ ధరలకే సొంత బ్రాండెడ్ 4జీస్మార్ట్ ఫోన్లతో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన జియో మార్కెట్ ను షేక్ చేస్తోందని అసోసియేట్ రిసెర్చ్ డైరెక్టర్ మెలిస్సా చౌ చెప్పారు . కాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వాణిజ్యపరంగా సెప్టెంబర్ 5న జియో సేవలను లాంచ్ చేశారు. సుమారు 3,100 నగరాలు, పట్టణాలు అంతటా ఆధార్ ఆధారిత సేవలు ప్రారంభించారు. దీంతో జియో వినియోగదారులకు డిసెంబర్ 31 వరకు అపరిమిత హెచ్డీ వాయిస్ కాల్స్ హై స్పీడ్ డేటా ను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.