KGBV student
-
మూడు రోజులుగా పురుగుల అన్నమే.. 43 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆదిలాబాద్‌టౌన్/బేల: ఆదిలాబాద్ జిల్లా బేల కేజీబీవీలో సోమవారం 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం చికెన్ అన్నం, రాత్రి ఉల్లిగడ్డ కూరతో భోజనం పెట్టినట్టు విద్యార్థినులు తెలిపారు. అయితే మధ్యాహ్నం, రాత్రి వడ్డించిన పురుగుల అన్నంతోనే అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు. పాఠశాలలో ఆదివారం ఏఎన్ఎం తప్ప ఇతర సిబ్బంది లేరు. సోమవారం ఉదయం వరకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఏఎన్ఎం, వాచ్‌మన్ కలిసి మొదట అస్వస్థతకు గురైన 28 మందిని బేల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మరో 15 మందికి పాఠశాలలోనే పీహెచ్సీ వైద్యాధికారి క్రాంతి వైద్య సేవలందించారు. సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులే వాటిని చేతుల్లో పట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా సాక్షి ఫొటో తీశాకా అక్కడి సిబ్బంది హుటాహుటిన స్టాండ్లు తీసుకువచ్చి ఏర్పాటు చేయడం విశేషం. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మరికొందరు తల్లిదండ్రులు రిమ్స్‌కు చేరుకున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. కాగా, మూడ్రోజులుగా పురుగుల అన్నమే పెడుతున్నారని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో డీఈవో ప్రణీత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఉదయం ఏఎన్ఎం కావాలనే విద్యార్థులను టిఫిన్ తినకుండా అడ్డుకోవడంతో వారు నిరసించి, అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారి గేడాం నవీన పేర్కొనడం గమనార్హం. ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, అడిషనల్ డీఆర్డీఏ రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్.. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. 13 క్వింటాళ్ల స్టాకు బియ్యంలో 3 క్వింటాళ్లలో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. గుర్తించిన లోటుపాట్లపై కలెక్టర్‌కు నివేదిస్తామని వారు తెలిపారు. -
వైద్యం చేయించలేక..
సదాశివపేట (సంగారెడ్డి): వైద్య ఖర్చులు భరించలేక.. ఆ తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని ఓ తండ్రి కన్నకూతురిని హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సదాశివపేట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వైద్యం ఖర్చులు భరించలేక, ఒకవేళ చికిత్స చేయించినా తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని రవినాయక్ అనే వ్యక్తి కన్న కూతురును హత్య చేశాడు. రవినాయక్ స్వగ్రామం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలోని జాంబాపూర్ తండా. బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి వచ్చి మేస్త్రీ పనులు చేస్తున్నాడు. నవాబుపేటలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న కూతురు రేణుకకు జ్వరంగా ఉండడంతో అతను ఈనెల 12న బైక్‌పై ఆమెను ఆత్మకూర్ గ్రామానికి తీసుకువచ్చాడు. జ్వరం ఎక్కువైనందున చుట్టుపక్కల వారి సూచన మేరకు అదే రోజు రాత్రి చికిత్స కోసం రేణుకను సదాశివపేట పట్టణానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కూతురుకు ఎప్పుడూ జ్వరం వస్తుందని, గత ఏడాదే చికిత్సకోసం రూ.20 వేలు ఖర్చు చేసినందున ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే ఎంత డబ్బు ఖర్చవుతుందోనని, ఒక వేళ ఖర్చుపెట్టి బాగుచేయించినా ఆమె పెళ్లి చేయాలంటే మళ్లీ డబ్బు కావాలి అని ఆలోచించాడు. ఈ క్రమంలో కూతురును గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు.. కూతురుకు ఎక్కిళ్లు వచ్చి చనిపోయిందని భార్య చంద్రిబాయిని నమ్మించాడు. అంత్యక్రియలు చేయడానికి కూతురు శవాన్ని సొంత గ్రామమైన వికారాబాద్ జిల్లా జాంబాపూర్ తండాకు తీసుకువెళ్లారు. అంతిమ సంస్కారం కార్యక్రమంలో మృతురాలు రేణుక గొంతుపై కమిలిన గాయాలు కనపడడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈనెల 13న వికారాబాద్ వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత సదాశివపేటలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా రేణుకను గొంతునులిమి చంపినట్లు తెలుసుకున్నారు. దీంతో కూతురును హత్య చేసిన నిందితుడు రవినాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
విజయనగరం, బొబ్బిలి: పండగ సెలవులకని ఇంటికి వెళ్లిన విద్యార్థినికి పండగ పూర్తయ్యే సరికి మరింత బెంగ పట్టుకుంది. తల్లిదండ్రులు కూడా బలవంతం మీద స్కూలుకు పంపిస్తే అక్కడ ఉండలేక ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. తోటి విద్యార్థులు, కస్తూర్బా స్పెషలాఫీసరు తెలిపిన వివరాల ప్రకారం...బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన రామవరపు భారతి(15) బొబ్బిలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. భారతి గత నెల 11న పండగ సెలవులకని ఇంటికి వెళ్లింది. పాఠశాల పునఃప్రారంభమైనా తిరిగి పాఠశాలకు రాలేదు. ఈ విషయమై కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషలాఫీసరు ఛాయాదేవి పలుమార్లు ఫోను చేసినా ఒత్తిడి భయంతో తల్లిదండ్రుల చేత చెప్పించి కొన్ని రోజులు రాలేదు. బుధవారం ఎస్ఎస్ఏ పీఓ సమావేశం ఉందని ప్రతీ ఒక్కరూ హాజరులోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరుంటే ఊరుకునేది లేదని స్పెషలాఫీసరు ఛాయాదేవికి చెప్పడంతో కేజీబీవీ స్పెషలాఫీసరు తల్లిదండ్రులకు గట్టిగా చెప్పారు. దీంతో తల్లిదండ్రులు భారతిని స్కూల్‌కి వెళ్లాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్ధిని పాఠశాలకు చేరుకుంది. సమావేశ అనంతరం ఫలితాలపై రాజీ లేదని ఎస్ఎస్ఏ పీఓ విద్యార్థులందరికీ గట్టిగా చెప్పారు. తరువాత ఏం జరిగిందో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యార్థిని పాఠశాల భవనం నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన భారతి విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారమందించారు. తల్లిదండ్రులు వచ్చి భారతిని నేరుగా విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం జరిగిన సంఘటనను రహస్యంగా ఉంచేందుకు యత్నించినా చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్ఓ ఛాయాదేవి మాట్లాడుతూ విద్యార్థినికి చదవడం ఇష్టం లేదని ఇంటి నుంచి రావడానికి మొరాయించిందని చెప్పారు. ఏమైనా ప్రమాదం నుంచి బయటపడిందని పేర్కొన్నారు. అమ్మాయికి చదవడం ఇష్టం లేకే ఇలా చేసిందని అనుకుంటున్నట్టు ఎస్ఎస్ఏ పీఓ లక్ష్మణరావు చెప్పారు. -
ఫినాయిల్ తాగిన కేజీబీవీ విద్యార్థిని
సకాలంలో చికిత్సతో తప్పిన ప్రాణాపాయం గరుగుబిల్లి: మండలంలోని రావివలస కస్తూరిబా బాలికల విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న పి.శ్రావణి అనే విద్యార్థిని మంగళవారం ఉదయం ఫినాయిల్ తాగింది. దీన్ని గమనించిన సిబ్బంది గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. శ్రావణికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రావణి తల్లిదండ్రులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతేడాది వరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదివిన శ్రావణిని ఈ ఏడాది మండలంలోని దళాయివలసలో ఉన్న తాత గులిపిల్లి సత్యంనాయుడు వద్దకు పంపారు. ఆయన రావివలస కేజీబీవీలో చేర్పించారు. అయితే ఇక్కడ చదవటం శ్రావణికి ఇష్టం లేదని సమాచారం. పుష్కరాలకు సెలవులు ప్రకటించటంతో పదోతరగతి విద్యార్థులను మినహ మిగిలినవారిని ఇళ్లకు పంపేశారు. శ్రావణి మాత్రం తాతగారి ఇంటి కి వెళ్లనని చెప్పి పాఠశాలలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలు ముగించుకున్నాక బాత్రూమ్లోని ఫినాయిల్‌ను తాగేసింది. బాటిల్లో ఉన్నది ఫినాయిల్ అని తెలియక తాగానని ఆమె చెప్పటం గమనార్హం. కేజీబీవీలో చదవటం ఇష్టం లేక ఇలా చేసిందా, పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం పాఠశాలలోనే ఇలాంటి సంఘటనే చోటు చేసుకోగా బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారని స్థానికులంటున్నారు. ఎందుకు తాగిందో తెలియదు.. పాఠశాలకు ప్రస్తుతం సెలవులిచ్చాం. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మిగిలిన విద్యార్థులను ఇళ్లకు పంపాం. శ్రావణి తాతగారికి ఇంటి వెళ్లనంది. ఫినాయిల్ ఎందుకు తాగిందో తెలియదు. ఎంత ప్రశ్నించినా తెలియక తాగానని చెబుతోంది. ఆమె బంధువులకు సమాచారమిచ్చాం. శ్రావణికి అవసరమైన వైద్యసేవలనందిస్తున్నాం. -జె.సంధ్య, ప్రత్యేకాధికారి, కేజీబీవీ -
హాస్టల్ ఇష్టంలేక.. రెండో అంతస్తు నుంచి..
అనంతపురం ఎడ్యుకేషన్ : చదువంటే ఇష్టంలేక మొన్న అనంతపురం జిల్లా యాడికి మండలం పి. వెంగన్నపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లో ఉండడం ఇష్టంలేక గార్లదిన్నె కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 8వ తరగతి చదువుతున్న షాహిరా అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ అమ్మాయి శని వారం ఉదయం రెండో అంతస్తు నుంచి దూకింది. అదృష్టవశాత్తూ ప్రాణాపా యం తప్పింది. కాలికి బలమైన గాయమైంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థిని, ఆమె తల్లి భానూబీ తెలిపిన వివరాల మేరకు... గార్లదిన్నె మండలం మార్తాడు కు చెందిన బాబయ్య, భానూబీ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కు మార్తె (సాహిరా) సంతానం. అనంతపురం నగరానికి వలసవచ్చిన బాబయ్య కుటుంబం పాతూరులో నివాసం ఉం టోంది. బాబయ్య వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. సాహిరా ఈసారి 8వ తరగతి. ఇంట్లో ఉండి చదివించడం ఇబ్బందిగా ఉండడంతో హాస్టల్ ఉంటే బాగా చదువుకుంటుందని భావించారు. ఈ క్రమంలో గార్లదిన్నె కేజీబీవీలో వారం కింద చేర్పించారు. చేర్పించిన రోజే తాను ఇక్కడ ఉండలేనని తల్లిదండ్రుల వద్ద మొర పెట్టుకుంది. కొత్తగా అలానే ఉంటుందని, రెండు రోజులు గడిస్తే అలవాటవుతుందని చెప్పి తల్లిదండ్రులు వదలివెళ్లారు. ఆరోజు నుంచి షాహిరా కేజీబీవీలో ముభావంగా ఉండేది. ఈ క్రమంలో శనివారం ఉదయం రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది. అసలు విషయం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన సిబ్బంది కాగా కేజీబీవీ సిబ్బంది అసలు విషయం కప్పిపుచ్చే యత్నం చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉతికిన బట్టలు ఆరవేసేందుకు వెళ్తే ప్రమాదం జరిగిందని అమ్మాయితో చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా సాయంత్రం వరకు సమాచారం అందించలేదు. అనంతపురం ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్న సమయంలో చేరుకున్న తల్లిదండ్రులకు కూడా ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మీడియా బాధిత విద్యార్థినిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. తనకు అక్కడుండడం ఇష్టం లేదని అందుకోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని చెప్పింది. కనీసం తల్లిదండ్రులకు కూడా అసలు విషయం చెప్పకుండా దాచడం వెనుక ఆంతర్యమేమిటో కేజీబీవీ సిబ్బందికే తెలియాలి. ఇదిలా ఉండగా గార్లదిన్నె కేజీబీవీలో గతేడాది ఒక విద్యార్థిని విషద్రవం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి కూడా ప్రాణాలు నుంచి బయటపడింది.