సదాశివపేట (సంగారెడ్డి): వైద్య ఖర్చులు భరించలేక.. ఆ తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని ఓ తండ్రి కన్నకూతురిని హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వైద్యం ఖర్చులు భరించలేక, ఒకవేళ చికిత్స చేయించినా తర్వాత పెళ్లి ఖర్చులు భరించాల్సి వస్తుందని రవినాయక్ అనే వ్యక్తి కన్న కూతురును హత్య చేశాడు. రవినాయక్ స్వగ్రామం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలోని జాంబాపూర్ తండా. బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి వచ్చి మేస్త్రీ పనులు చేస్తున్నాడు.
నవాబుపేటలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న కూతురు రేణుకకు జ్వరంగా ఉండడంతో అతను ఈనెల 12న బైక్‌పై ఆమెను ఆత్మకూర్ గ్రామానికి తీసుకువచ్చాడు. జ్వరం ఎక్కువైనందున చుట్టుపక్కల వారి సూచన మేరకు అదే రోజు రాత్రి చికిత్స కోసం రేణుకను సదాశివపేట పట్టణానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కూతురుకు ఎప్పుడూ జ్వరం వస్తుందని, గత ఏడాదే చికిత్సకోసం రూ.20 వేలు ఖర్చు చేసినందున ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే ఎంత డబ్బు ఖర్చవుతుందోనని, ఒక వేళ ఖర్చుపెట్టి బాగుచేయించినా ఆమె పెళ్లి చేయాలంటే మళ్లీ డబ్బు కావాలి అని ఆలోచించాడు.
ఈ క్రమంలో కూతురును గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు.. కూతురుకు ఎక్కిళ్లు వచ్చి చనిపోయిందని భార్య చంద్రిబాయిని నమ్మించాడు. అంత్యక్రియలు చేయడానికి కూతురు శవాన్ని సొంత గ్రామమైన వికారాబాద్ జిల్లా జాంబాపూర్ తండాకు తీసుకువెళ్లారు. అంతిమ సంస్కారం కార్యక్రమంలో మృతురాలు రేణుక గొంతుపై కమిలిన గాయాలు కనపడడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈనెల 13న వికారాబాద్ వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత సదాశివపేటలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా రేణుకను గొంతునులిమి చంపినట్లు తెలుసుకున్నారు. దీంతో కూతురును హత్య చేసిన నిందితుడు రవినాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
వైద్యం చేయించలేక..
Published Sun, Feb 16 2020 3:10 AM | Last Updated on Sun, Feb 16 2020 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment