* పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
* భర్తపై హత్య కేసు నమోదు చేసే అవకాశం
పుల్‌కల్: గత సంవత్సరం అక్టోబర్ 16న అనుమానాస్పదంగా మృతి చెందిన పుల్‌కల్ అంగన్‌వాడీ టీచర్ పీ రాణమ్మ (37)ను కొట్టడం వల్లే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును హత్య కేసు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన పుల్‌కల్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ రాణమ్మ గత అక్టోబర్ 16న రాత్రి ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు తెలుపడంతో ఆమెను ప్రథమ చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి రెఫర్ చేశారు. అయితే బంధువులు మాత్రం జూబ్లీహిల్స్‌లోని అపోలో అసుపత్రికి తరలించారు. అక్కడ రాణమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పుల్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరిలో వచ్చిన పోస్టుమార్టం నివేదికలో రాణమ్మది సహజ మరణం కాదని కొట్టడం వల్లే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ కాపీ పోలీసులకు చేరింది. రాణమ్మ శరీరంలోని గుడి వైపు ఛాతి పైన, వెనుక వైపున బలమైన గాయం కావడంతో రక్త ప్రసరణ కాలేదని అందులో పేర్కొన్నారు.
పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పుల్‌కల్ పోలీసులు రాణమ్మ భర్త సంజీవులుపై హత్య కేసు నమోదు చేయనున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణను వివరణ కోరగా రాణామ్మది అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గతంలో కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రాణమ్మ భర్తపై హత్య కేసు నమోదు చేయునున్నట్లు తెలిపారు.
అంగన్‌వాడీ టీచర్‌ది హత్యే
Published Mon, Feb 29 2016 1:55 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement