రవితేజం ఎప్పుడు?
వర్షాకాలం.. శీతాకాలం.. వేసవికాలం.. ప్రతి సీజన్లోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతూ.. మంచి హిట్స్ అందుకున్న హీరో రవితేజ. గతంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. ఆ తర్వాత రెండు.. ఇప్పుడు ఒకటి. ఎప్పటికప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్ లేకుండా చూసుకోవాలని రవితేజ అనుకుంటున్నప్పటికీ ఎందుకనో గ్యాప్ వచ్చేస్తోంది.
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ‘బెంగాల్ టైగర్’ తర్వాత ఈ మాస్ హీరో ఇప్పటి వరకూ మేకప్ వేసుకోలేదు. దర్శక-నిర్మాతలెవరూ రవితేజ దగ్గరికి వెళ్లడం లేదా.. అంటే అదీ కాదు. ఆయనతో సినిమా తీయాలని ప్రయత్నించే దర్శక-నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ, ఆ ప్రయత్నాలన్నిటికీ ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది.
ఎందుకిలా జరుగుతోంది.. అంటే దాని వెనక చాలా కారణాలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఓ సినిమా, ముహూర్తంలో మరో సినిమా, మ్యూజిక్ సిట్టింగ్స్ వరకూ వెళ్లిన తర్వాత ఇంకో సినిమా అటకెక్కాయి. దాంతో గ్యాప్ తప్పలేదు.
తెర వెనుకే... ‘రాబిన్‌హుడ్’
‘రాబిన్‌హుడ్’... రవితేజ, రాశీఖన్నా జంటగా ‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో తీయాలనుకున్న సినిమా ఇది. ఆ మధ్య రవితేజ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన ఓ సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ పాట కూడా రాశారట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ. షూటింగ్ మొదలుపెట్టడం ఒక్కటే ఆలస్యం. కానీ, చివరి క్షణంలో సినిమా ఆగింది. ఎందుకంటే.. కథ తృప్తికరంగా లేదనే మాట వినిపిస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని భోగట్టా.
డిస్కషన్స్ దగ్గరే రీమేక్‌కి బ్రేక్
తమిళ దర్శకుడు టీఎన్ సంతోశ్ చెప్పిన కథ, తీసిన విధానం నచ్చడంతో ‘కనిదన్’ రీమేక్‌లో నటించడానికి రవితేజ సుముఖత వ్యక్తం చేశారు. రవితేజతో డిస్కషన్స్ జరిగాయని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్.థాను తమిళంలో ‘కనిదన్’ని నిర్మించారు. తెలుగులోనూ ఆయనే నిర్మించాలనుకున్నారట. స్టోరీ డిస్కషన్స్ టైమ్‌లో థాను తమిళ సినిమా ‘తెరి’ విడుదలతో బిజీగా ఉండడం, ఈ తెలుగు ప్రాజెక్ట్‌కి టైమ్ కేటాయించలేకపోవడం... ఈ క్రమంలో మిస్ కమ్యూనికేషన్ వల్ల ఈ సినిమా ఆగిందట.
పూజతో ఫుల్స్టాప్!
రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్న సినిమా ‘ఎవడో ఒకడు’. ఈ సినిమాకు గత విజయదశమి నాడు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తీరా, పారితోషికం ఎక్కువ కావాలని రవితేజ అడగడంతో.. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా కాస్తా అటకెక్కిందని గాసిప్స్ వినిపించాయి. కానీ, ఆ వార్తల్ని ‘దిల్’ రాజు ఖండించారు. ‘‘అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగింది. ఈ కథను నాగార్జున గారికి వినిపిస్తున్నాం’’ అని ‘దిల్’ రాజు ప్రకటించారు. కారణం ఏమైనా రవితేజతో సినిమా, కథ.. రెండూ ముందుకు వెళ్లలేదు.
పట్టాలెక్కని ప్రతిపాదనలెన్నో!
ఈ మూడు చిత్రాల సంగలా ఉంచితే.. హిందీ చిత్రం ‘స్పెషల్ ఛబ్బీస్’ తెలుగు రీమేక్‌లో నటించాలనుకున్నారు రవితేజ. ‘దబంగ్’లో మార్పులు-చేర్పులు చేసి, ‘గబ్బర్‌సింగ్’గా తీసి హిట్ సాధించిన దర్శకుడు హరీశ్ శంకర్‌కి మార్పులు చేర్పుల బాధ్యత అప్పగించారన్నారు. మరి, ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతూ బిజీగా ఉన్న హరీశ్‌శంకర్ ఇప్పటికిప్పుడు రవితేజతో సినిమా చేయడం కష్టమే. ‘స్వామి రారా’తో చిత్ర పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సుధీర్ వర్మను పిలిచి మరీ రవితేజ అవకాశం ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. వెంకటేశ్, రవితేజలతో మల్టీస్టారర్ మూవీ తీయాలని దర్శకుడు వీరు పోట్ల సంకల్పించినప్పటికీ... ఆ చిత్రం ప్రతిపాదన దశల్లోనే ఆగింది. ఇటీవల బాబీ (కేఎస్ రవీంద్ర)తో రవితేజ ఓ సినిమా చేయనున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. వీటిల్లో ఏవి పట్టాలకెక్కుతాయన్నది కాలమే చెప్పాలి.
కొత్త సిక్స్ ప్యాక్ కాంబినేషన్?
ఇవన్నీ ఇలా ఉండగా, తాజా ఖబర్ ఏమిటంటే - స్క్రీన్‌ప్లే రైటర్ విక్రమ్ సిరి చెప్పిన కథ నచ్చడంతో అతణ్ణి దర్శకునిగా పరిచయం చేయాలని రవితేజ ఇప్పుడు నిర్ణయించుకున్నారట. ‘బెంగాల్ టైగర్’ తర్వాత ఈ మాస్ మహారాజా చేయబోయే సినిమా ఇదే అవుతుందని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఏది ఏమైనా ఎనర్జీకి చిరునామా అనిపించేలా ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడిలా స్లో కావడం ఆయన ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. అయితే.. వేగంగా దూసుకెళ్లడానికే రవితేజ ఇలా స్లో అయ్యారేమో! అన్నట్టు.. ఈ గ్యాప్‌లో రవితేజ సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ ఆరుపలకల దేహం, కొత్త ఎనర్జీ రాబోయే ఏ సినిమాలో చూపిస్తారో!!