Khammam parliament constituency
-
తెలంగాణలో తొలి విజయం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి భారీ గెలుపు
ఖమ్మం: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.కాంగ్రెస్: 759603బీఆర్ఎస్: 297592బీజేపీ: 117075పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...కాంగ్రెస్: 7326బీఆర్ఎస్: 1490బీజేపీ: 1561 -
ఎంపీగా పోటీ చేసి తీరుతాను: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ చీఫ్, సీనియర్‌నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ‘ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?. ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా?. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి?. ...గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ప్రధాని మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్దరించారని సంకల్ప యాత్ర చేస్తున్నారు. రాముడ్ని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగీర్లా?’అని వీహెచ్ మండిపడ్డారు. -
కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే మరింత డేంజరస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై ఖమ్మం నేతలతో సమీక్షించారు. ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కచ్చితంగా గెలవాల్సిందేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలిచామని, మరో 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని తెలిపారు. కొన్ని స్థానాలను వివిధ కారణాలతో కోల్పోయామని కేటీఆర్ అన్నారు. ఆ కారణాలు తెలుసుకుని, సమీక్షించుకుని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు చెప్పారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని పేర్కొన్నారు. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే ఈనెల చివర్లో అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి రెండు, మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. చదవండి: TS: ఫార్ములా ఈ రేస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటింది. వచ్చిన తెల్లారినించే హామీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు కాలయాపన చేస్తుంది. ఎన్నికల ముందు కంటే భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరించడంపట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. గత నెల రోజుల పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది’ అని తెలిపారు. -
వైఎస్ఆర్సీపీకి జనాశీస్సులున్నాయి..
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీకి జనాశీస్సులు ఉన్నాయని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈనెల 5వ తేదీన ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో నిర్వహించే జగన్ ‘జనభేరి’ బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశం లో పొంగులేటి మాట్లాడారు. తెలంగాణలోనూ జగన్మోహన్రెడ్డికి జననీరాజనాలు ఖాయమన్నారు. సభను అడ్డుకునేందుకు కొందరు పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతోనే కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ కుట్రలను కార్యకర్తలు సంయమనంతో తిప్పికొట్టాలని సూచించారు. ఒకవేళ పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ సభ నిర్వహించి తీరుతామన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని..ఇటువంటి వాటికి తలొగ్గొద్దన్నారు. తెలంగాణ కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు మరువరాద ని పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక కుట్రపూరిత చర్యలతో నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇంకా పార్టీ కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎడవల్లి కృష్ణ, మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వరరావు, బాణోత్ మదన్‌లాల్, సామాన్యకిరణ్, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చంద్రశేఖర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్లు తోట రామారావు, మెండెం జయరాజు, భూక్యా దళ్‌సింగ్, జిల్లా నాయకులు ఆకుల మూర్తి, గురుప్రసాద్, సంపెట వెంకటేశ్వర్లు, చాగంటి రవీందర్‌రెడ్డి, కొదమసింహం పాండురంగాచార్యులు, కీసర పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.