kharif beginning
-
ఖరీఫ్‌కు గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతుకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. పాలనాపరమైన అంశాల్లో జాప్యం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. గత ఏడాది ఇదే నెలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ పనుల్లో హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు పనులు ప్రారంభించే అవకాశాలు లేక రైతులు దిక్కులు చూస్తుంటే, వ్యవసాయ కార్మికులు పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రెతులకు ఏలికలు ఇచ్చిన హామీలు, వాతావరణం అనుకూలించకపోవడం ఈ దుస్థితికి కారణం. ముఖ్యంగా బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రుణాలను టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేస్తారని ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అందుకు విరుద్ధంగా సీఎం రుణమాఫీపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బ్యాంకులకు అందకపోవడంతో పాత రుణాలు రద్దు కాక కొత్త రుణాలు మంజూరుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో రొక్కం లేక విత్తనమే కొనుగోలు చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.39 లక్షల హెక్టార్లు. వరి, పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగవుతుంటాయి. వర్షాలు లేక రిజర్వాయర్లలోని నీటి మట్టం అడుగంటటంతో ప్రభుత్వం కూడా కాలువలకు సాగునీటిని విడుదల చేయలేక పోయింది. ప్రతీ సంవత్సరం జూలై రెండో వారంలో నారుమడులు సిద్ధం చేసుకునేందుకు ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేసేది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే రెండుసార్లు విడుదల చేసింది. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. పాత రుణాలు రద్దు కాక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది జూన్ నెల 20 వ తేదీ నాటికి బ్యాంకర్లు రైతులకు సుమారు రూ.1000 కోట్ల రుణాలను ఇస్తే ఈఏడాది ఇప్పటి వరకు రూ.125 కోట్లు మాత్ర మే ఇచ్చారు. రూ.6,328 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా తీసుకున్నాయి. రుణమాఫీ కారణంగా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకర్లు లేరు. రుణమాఫీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోల్చితే పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది, ప్రస్తుతం పంటల సాగు ఇలా ఉంది. -
ఖరీఫ్.. రిలీఫ్
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా వరుస అతివృష్టి, అనావృష్టితో కరువు బారిన విలవిల్లాడుతున్న రైతాంగానికి ఈ ఏడాది ఊరట లభిస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పంటలు కళకళలాడుతున్నాయి. కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ తదితర కాల్వల కింద వరినాట్లు ముమ్మరమయ్యాయి. నీటి ఆధారంతో పాటు వర్షాధార పంటలు పచ్చని కళ సంతరించుకోవడంతో ఏటా నష్టాలను మూటకట్టుకుంటున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. కొద్దిరోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చాలా వరకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కోడుమూరు, గూడూరు, క్రిష్ఱగిరి తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో హంద్రీ నది పోటెత్తింది. ఈ కారణంగా రెండేళ్ల క్రితం ఎండిన బోర్లలోనూ భుగర్భ జలాలు మెరుగవడంతో రైతుల సంతోషానికి హద్దే లేకపోతోంది. కర్నూలు సమీపంలోని వక్కెరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 126 మి.మీ కాగా మొదటి 10 రోజుల్లోనే 106.1 మి.మీ నమోదు కావడం విశేషం. ఇప్పటికే 19 మండలాల్లో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది. రుద్రవరం, సంజామల, వెలుగోడు, చాగలమర్రి, జూపాడుబంగ్లా, ఉయ్యలవాడ, బండిఆత్మకూరు, దొర్నిపాడు, నంద్యాల మండలాల్లో మత్రమే ఈ నెలలో ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఉపశమనం లభించినట్లయిందని.. అయితే కొద్ది రోజులు తెరిపి ఇస్తే మేలని జేడీఏ ఠాగూర్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఖరీప్ సాధారణ సాగు 5.61 లక్షల హెక్టార్లు కాగా.. 5.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది పత్తి భారీగా సాగు చేశారు. సాధారణ సాగు 70వేల హెక్టార్లు కాగా.. ఈసారి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవడం విశేషం. నీటిపారుదల మెరుగవడంతో వరిసాగు భారీగా పెరిగే అవకాశం ఏర్పడింది. వరి సాధారణ సాగు 90వేల హెక్టార్లు ఉండగా, ఇప్పటికే దాదాపు 70వేల హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో వరి పైర్లు కళకళలాడుతున్నాయి. ఇదిలాఉండగా కొన్ని పంటలకు చీడపీడల బెడద ఎక్కువైంది. వ్యవసాయశాఖలో అటెండర్ మొదలుకొని డీడీఏ స్థాయి అధికారి వరకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా సమ్మెలో ఉండటంతో రైతులకు సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు.