కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా వరుస అతివృష్టి, అనావృష్టితో కరువు బారిన విలవిల్లాడుతున్న రైతాంగానికి ఈ ఏడాది ఊరట లభిస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పంటలు కళకళలాడుతున్నాయి. కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ తదితర కాల్వల కింద వరినాట్లు ముమ్మరమయ్యాయి. నీటి ఆధారంతో పాటు వర్షాధార పంటలు పచ్చని కళ సంతరించుకోవడంతో ఏటా నష్టాలను మూటకట్టుకుంటున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. కొద్దిరోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చాలా వరకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కోడుమూరు, గూడూరు, క్రిష్ఱగిరి తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో హంద్రీ నది పోటెత్తింది. ఈ కారణంగా రెండేళ్ల క్రితం ఎండిన బోర్లలోనూ భుగర్భ జలాలు మెరుగవడంతో రైతుల సంతోషానికి హద్దే లేకపోతోంది. కర్నూలు సమీపంలోని వక్కెరవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 126 మి.మీ కాగా మొదటి 10 రోజుల్లోనే 106.1 మి.మీ నమోదు కావడం విశేషం. ఇప్పటికే 19 మండలాల్లో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది.
రుద్రవరం, సంజామల, వెలుగోడు, చాగలమర్రి, జూపాడుబంగ్లా, ఉయ్యలవాడ, బండిఆత్మకూరు, దొర్నిపాడు, నంద్యాల మండలాల్లో మత్రమే ఈ నెలలో ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఉపశమనం లభించినట్లయిందని.. అయితే కొద్ది రోజులు తెరిపి ఇస్తే మేలని జేడీఏ ఠాగూర్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఖరీప్ సాధారణ సాగు 5.61 లక్షల హెక్టార్లు కాగా.. 5.50 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి.
ఈ ఏడాది పత్తి భారీగా సాగు చేశారు. సాధారణ సాగు 70వేల హెక్టార్లు కాగా.. ఈసారి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవడం విశేషం. నీటిపారుదల మెరుగవడంతో వరిసాగు భారీగా పెరిగే అవకాశం ఏర్పడింది. వరి సాధారణ సాగు 90వేల హెక్టార్లు ఉండగా, ఇప్పటికే దాదాపు 70వేల హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో వరి పైర్లు కళకళలాడుతున్నాయి. ఇదిలాఉండగా కొన్ని పంటలకు చీడపీడల బెడద ఎక్కువైంది. వ్యవసాయశాఖలో అటెండర్ మొదలుకొని డీడీఏ స్థాయి అధికారి వరకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా సమ్మెలో ఉండటంతో రైతులకు సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు.
ఖరీఫ్.. రిలీఫ్
Published Wed, Sep 11 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement
Advertisement