కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో కష్టాలు గట్టెక్కినట్టేనని రైతులు సంతోషించారు. పంటలు చేతికొచ్చే సమయంలో నాలుగు రోజులుగా తుపాను రూపంలో వరుణుడు విరుచుకుపడటం తీరని నష్టం మిగులుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడణ ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. జిల్లాలోని బండిఆత్మకూరు, మహానంది, గడివేముల, పాణ్యం, బనగానపల్లె, రుద్రవరం, చాగలమర్రి, గోస్పాడు, శిరువెళ్ల, ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, దొర్నిపాడు, కొత్తపల్లి, ఉయ్యాలవాడ ప్రాంతాల్లో తుపాను పెను బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
కొత్తపల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్లు.. అత్యల్పంగా గోస్పాడులో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తపల్లి, ఆత్మకూరులో భారీ వర్షాల కారణంగా బవనాసి, సుద్దవాగు, ఎద్దులేరులు పొంగి పొర్లుతున్నాయి. వరదనీటికి తోడు వరదరాస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం అధికమైంది. దీంతో ఆత్మకూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకలవ్య నగర్, ఇందిరానగర్, అర్బన్ కాలనీ, వెంగల్‌రెడ్డి నగర్, వాకితపేట, రహమత్‌నగర్, అక్కిరాజు కాలనీ, ఏపీఎం, ఎస్‌పీజీ పాలెంలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లు భారీగా దెబ్బతినడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కర్నూలు ఆర్డీఓ కూర్మానాథ్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలోని వెయ్యి ఎకరాల్లో వరి, ఇతర పంటలు మూడు రోజులుగా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల్లోనే మొక్కజొన్నకు రూ.కోటి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
15 మండలాల్లో మొక్కజొన్న, వరి, వేరుశెనగ, పత్తి, జొన్న, శనగ తదితర పంటలు దాదాపు 80వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అనధికారిక అంచనా. ఇదిలాఉండగా వ్యవసాయాధికారులు మాత్రం 15 మండలాల్లో 20,695 ఎకరాల్లో(8,278 హెక్టార్లు) మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు నిర్ధారించడం గమనార్హం.
వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తపల్లి మండలంలోని ఎర్రమఠం, మాడుగుల, జడ్డువారిపాలెం, సింగరాజుపల్లి, జట్టువారిపల్లి, శివపురం, చిన్నగుమ్మడూరు, పెద్దగుమ్మడూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల కర్నూలు, నంద్యాల డివిజన్లలో భారీ ఎత్తున ఇళ్లు కూలిపోయాయి. ప్రాథమిక సమాచారం మేరకు 923 ఇళ్లు దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నంద్యాల డివిజన్‌లో 473 ఇళ్లు, కర్నూలు డివిజన్‌లో 450 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 500 ఇళ్లు పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. అతి భారీ వర్షాల వల్ల నాలుగు రోజుల్లో జిల్లా మొత్తం మీద 94.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 114.5 మి.మీ కాగా, ఇప్పటివరకు 132.8 మి.మీ వర్షపాతం కురిసింది. ఈనెల 21వ తేదీ వరకు కేవలం 38.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.
ఏమీ మిగల్లేదు!
Published Sat, Oct 26 2013 3:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement