'తన్నండి కానీ.. ఎముకలు విరగ్గొట్టొద్దు'
మీరట్: తమ సంస్థకు చెందిన యువ గో సంరక్షకులకు విశ్వహిందూ పరిషత్ మరో సలహా చెప్పింది. గోవులను అక్రమంగా తరలించేవారిని, హింసించేవారిని కొట్టండి అయితే, వారి ఎముకలు మాత్రం విరగ్గొట్టద్దు అంటూ మరో వివాదాస్పద సలహాను ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా విశ్వహిందూపరిషత్ కు చెందిన వారే. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్‌చంద్ మాట్లాడుతూ
'గోవులను స్మగ్లింగ్ చేసేవారిని కొట్టండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టద్దు. విశ్వహిందూపరిషత్‌కు చెందినవారు, చెందని వారు ఈ విధంగా ముందుకు వెళితే ఏ ఒక్కరూ ఆవులను తరలించేందుకు సాహసం చేయలేరు. కనీసం అలాంటివారు ఎదురుపడలేరు. ఆవుల సంరక్షణ అంటే మేక్ ఇన్ ఇండియా కాదని.. దేశాన్ని రక్షించుకోవడం' అని చెప్పారు. 'ఈ మధ్య ప్రధాని మోదీ గో సంరక్షణపై చాలా మాట్లాడారు. ఆయన చెప్పిన చాలా అంశాలతో నేను అంగీకరించను. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరిస్తా. ఏ ఒక్కరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ విషయం నేను తరుచుగా చెబుతూనే ఉన్నాను. అందుకే స్మగ్లర్లను తన్నండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టొద్దు. ఎందుకంటే పోలీసులతో కేసులై సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇక మోదీ మాటలతో నేను విభేదించకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు భారత్‌ను బంగారు పక్షి అనేవారు. నాడు ఎలాంటి పరిశ్రమలు లేవు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఆ రోజుల్లో భారత్ కు బంగారు పక్షి అని పేరు వచ్చిందా? మొత్తం భారత్‌ను ఆ రోజుల్లో కాపాడింది గోవులే. గో సంరక్షకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో వారు వీరమరణం కూడా పొందుతున్నారు' అని ఆయన చెప్పారు.
ఇటీవల కాలంలో గో సంరక్షణ పేరిట దళితులపై, ముస్లింలపై దాడులు ఎక్కువవుతున్నాయని కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.