khiladi lady
-
కిలాడీ లేడీ బాగోతం బట్టబయలు
సాక్షి, వరంగల్: వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయపడుతున్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. వరంగల్‌లోని మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా దందా సాగిస్తోంది.వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి.. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతోంది. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే, వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు బట్టబయలయ్యాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం రెండు రోజుల్లో ఆ కిలాడీ లీలలు పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది. -
మాయలేడి.. జగత్ కిలాడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్‌నగర్‌లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్? కొద్దిరోజులుగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా చిట్‌చాట్ చేసిన ఎస్ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్‌కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్‌కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
కిలాడీ లేడి అరెస్ట్
యశవంతపుర : విలాస జీవనం గడపడానికి భర్తతో దోపిడీలు చేయిస్తున్న భార్యను పోలీసులు అరెస్టు చేశారు. గొలుసు దొంగ అచ్యుత్‌కుమార్ అలియాస్ ఘణిపై బెంగళూరుతో పాటు రాష్ట్రంలో సుమారు 150 కేసులున్నాయి. విలాస జీవనం కోసం భర్త కొట్టుకొచ్చిన చేసిన గొలుసులను భార్య మహాదేవి విక్రయించి జల్సాలు చేసేది. ఏడాదిలో రూ.కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు కూడబెట్టింది. మూడు నెలల క్రితం నైస్ రోడ్డులో అచ్యుత్కుమార్పై కెంగేరి పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేసినప్పుటి నుండి మహదేవి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఒక అనాథాశ్రమంలో తలదాచుకుని ఉండగా అరెస్ట్ చేసినట్లు కెంగేరి పోలీసులు తెలిపారు. -
కి'లేడీ' ఖతర్నాక్ స్కెచ్
అంబర్‌పేట: బాకీ చెల్లిస్తామని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి నుంచి భారీగా సొత్తు కాజేసిస సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ విజయభాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. అంబర్‌పేట ఎంసీహెచ్ క్యార్టర్స్‌లో నివసించే ప్రకాష్‌కు రెడ్ బిల్డింగ్ ప్రాంతంలో నివసించే శ్రీదేవి (35) కొంత డబ్బు బాకీ ఉంది. ఈ ఏడాది మార్చి 27న ప్రకాష్‌కు ఫోన్ చేసి డబ్బులు చెల్లిస్తానని, తన ఇంటికి పిలిపించుకుంది. అతను రాగానే మాటల్లో పెట్టి ముఖం మీద పెప్పర్ స్పేర్ చల్లి అంబర్‌పేటకు చెందిన ప్రదీప్ (32)తో కలిసి ప్రకాష్‌ను ఓ గదిలో బంధించింది. అనంతరం అతడి సెల్ నుంచి ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు మన ఇంటికి వస్తున్నారని డబ్బు, బంగారు అభరణాలు, డాక్యుమెంట్లు ప్రదీప్ అనే వ్యకికి ఇవాల్సిందిగా ప్రకాష్ భార్యకు ఎస్ఎంఎస్ పెట్టారు. దీంతో ప్రకాష్ భార్య ప్రదీప్‌కు రూ.16 లక్షల నగదు, 40 తులాల బంగారు అభరణాలతో పాటు విలువైన డాక్యుమెంట్లు అందించింది. కొంత సమయానికి ప్రకాష్ తేరుకొని వారిబారి నుంచి బయట పడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ప్రకాశ్ విషయం తెలుసుకుని, వెంటనే శ్రీదేవి ఇంటికి వెళ్లి అడగ్గా చంపేస్తామని బెదిరించడంతో విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే నిందితులు మరోమారు రూ.12 లక్షలు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో బుధవారం రాత్రి ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.