- యువతి ట్రాప్ చేసిన వారిలో ఎస్‌ఐ హరీశ్ నాలుగో వ్యక్తి
- హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా..
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఐదు కేసులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్‌ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి.
ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్‌ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్‌నగర్‌లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్?
కొద్దిరోజులుగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా చిట్‌చాట్ చేసిన ఎస్‌ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్‌కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్‌కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు.
ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్‌పీఎఫ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment